Kanna రాజీనామాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన జీవిఎల్
ABN , First Publish Date - 2023-02-16T13:38:29+05:30 IST
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవియల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నా రాజీనామాపై పార్టీ నాయకులతో తాను మాట్లాడానన్నారు
విజయవాడ : బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు (GVL Narasimha Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నా రాజీనామాపై పార్టీ నాయకులతో తాను మాట్లాడానన్నారు. కన్నా కు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారని ఎంపీ వెల్లడించారు. ఇవి రెండూ చాలా కీలకమైన పదవులని జీవీఎల్ పేర్కొన్నారు.
ఈ రోజు కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమేనని జీవీఎల్ పేర్కొన్నారు. గతంలో కూడా సోమువీర్రాజు (Somu Veerraju)పై అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. పార్టీలో సోమువీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి చెప్పే చేశారన్నారు. సోము ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తనపై కూడా గతంలో, ఇప్పుడు కన్నా ఎక్కువ విమర్శలు చేశారన్నారు. తన పరిధిలో తాను పని చేస్తున్నానని.. కన్నా విమర్శలపై తాను మాట్లాడబోనన్నారు. బయట పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కన్నాకు కీలక పదవులు ఇచ్చారన్నారు. ఇది బీజేపీలో చాలా గొప్ప విషయం అన్నారు. సోము వీర్రాజుపై అనేక సార్లు విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. ఇక వీటిపై తాను ఇంత కన్నా మాట్లాడేదేమీ లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
ఇక తన రాజీనామా కారణాలపై కన్నా మాట్లాడుతూ.. సోమువీర్రాజు (Somuverraju) నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. సోము వీర్రాజు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. తనతో పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.