TDP: పట్టభద్ర ఎన్నికల్లో.. టీడీపీ హవా

ABN , First Publish Date - 2023-03-18T02:44:21+05:30 IST

ఏపీలో ఎన్నికలు జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ సీట్లను గెలుచుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

TDP: పట్టభద్ర ఎన్నికల్లో.. టీడీపీ హవా

ఉత్తరాంధ్ర, తూర్పు సీమలో గెలుపు ఖాయం..

పశ్చిమ సీమలో వైసీపీకి స్వల్ప ఆధిక్యం

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఏపీలో ఎన్నికలు జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ సీట్లను గెలుచుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటులో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో 2,89,214 మంది ఓటర్లకు గాను 2,01,335 మంది(పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి) ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచి లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 8 రౌండ్లలో చిరంజీవిరావుకు 82,957 ఓట్లు లభించగా, సుధాకర్‌కు 55,749 ఓట్లు వచ్చాయి. చిరంజీవి 27,208 ఓట్ల మెజారిటీ సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభ 35,148 ఓట్లు పొందారు. 10,884 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం 2,01,335 ఓట్లు పోలవ్వగా.. 12,318 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలో విజయానికి అవసరమైనన్ని ఓట్లు ఎవరికీ లభించకపోవడంతో అధికారులు శుక్రవారం సాయంత్రం ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు.

1AVN.jpg

ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 11,551 ఓట్లు లభిస్తే ఆయన విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారిటీతో విజయానికి చేరువయ్యారు. చెల్లిన 2,48,360 ఓట్లలో ఆయనకు 1,12,514 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 85,252 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీకాంత్‌కు 27,262 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే 50 శాతానికి మించిన ఓట్లు రాకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. అందులోనూ శ్రీకాంత్‌ ఆధిక్యం సాధించడంతో.. కౌంటింగ్‌ హాలు నుంచి వైసీపీ నాయకులు వెళ్లిపోయారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అర్ధరాత్రి దాటాక ఫలితం వచ్చే అవకాశముంది.

వెన్నపూసకు 1,449 ఓట్ల స్వల్ప మెజారిటీ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది. ఈ స్థానంలో 2,44,307 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ఓట్ల లెక్కింపు మొదలైంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎనిమిది రౌండ్లలో 1,92,018 ఓట్లు లెక్కించగా.. వైసీపీ అభ్యర్థికి 74,678 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 73,229 ఓట్లు వచ్చాయి. రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. అప్పటి వరకూ 15,104 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. కౌంటింగ్‌ శనివారం పూర్తవుతుందని తెలుస్తోంది.

సైకిల్‌ హవా మొదలైంది

‘‘ప్రస్తుతం వెలువడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో.. రాష్ట్రంలో సైకిల్‌ హవా మొదలైంది. జగన్‌ పని అయిపోయింది. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా 45వరోజు శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం పులికల్లు పంచాయతీ కమ్మపల్లి నుంచి ఆయన నడక మొదలు పెట్టారు. ములకల చెరువులో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడారు.

టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే

తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. బెదిరింపులు, తాయిలాలు, బోగస్‌ ఓట్లు, కోట్ల కొద్దీ డబ్బుల పంపిణీ.. ఇవన్నీ చేసినా పాలక పక్ష అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. వైసీపీ అభ్యర్థికి దీటుగా ఓట్లు తెచ్చుకున్న ఒంటేరు.. మూడో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించాలని కోరారు. అలా చేయకపోవడంతో రీకౌంటింగ్‌ చేయాలని కోరుతూ ఈసీకి లేఖ రాసిన ఒంటేరు.. ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్‌ నిర్వహణపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మరోవైపు.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపరచిన అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు.

Updated Date - 2023-03-18T02:44:21+05:30 IST