YS Sunitha : కడపలో అరాచకాలు తగ్గాయనుకున్నా కానీ..
ABN , First Publish Date - 2023-03-15T10:47:52+05:30 IST
వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదన్నారు.
కడప : వైఎస్ వివేకా (YS Viveka) నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణ దశలో ఉందని.. ఈ సమయంలో తాను దీనిపై మాట్లాడబోనన్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ.. సీబీఐకి ఇచ్చానన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలని సునీత పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదన్నారు. కడప అరాచకాలు తగ్గాయి అనుకున్నానని.. కానీ తగ్గలేదన్నారు. ఎక్కడికెళ్లినా కడపలో అరాచకాల గురించి మాట్లాడుతున్నారన్నారు. కడపకు అనేక విద్యాసంస్థలు వచ్చాయి కాబట్టి అరాచకాలు తగ్గాయనుకున్నానన్నారు. కానీ తన తండ్రి హత్య తర్వాత అరాచకాలు తగ్గలేదని రుజువైందన్నారు. తప్పు చేసిన వాళ్లకి శిక్షపడితేనే నేరాలు తగ్గుతాయని వైఎస్ సునీత పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు. ఆయనను 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలోనే దారుణంగా హత్యచేశారు. గొడ్డలివేటుతో పాశవికంగా మట్టుబెట్టారు. కత్తులు దూసే కడప రాజకీయంలో అజాతశత్రువుగా వివేకాకు పేరు. ఎన్ని పదవులు అలంకించినా వాటిని తలకు ఎక్కించుకోని సౌమ్యునిగా, అందరివాడుగా మెలిగారు. అలాంటి నేత కిరాతక హత్యకు గురికావడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఆయన మరణం విషయం తెలుస్తూనే.. తొలుత రక్తవాంతులు చేసుకుని గుండెపోటుతో మృతిచెందారు అంటూ జగన్ సొంత మీడియా ప్రకటించింది. వివేకా మరణంపై ఆయన కూతురు సునీత అనుమానం వ్యక్తం చేయడంతో అది చివరికి హత్యగా తేల్చారు.