Sharmila : షర్మిల వెంట నేను!
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:24 AM
తాను మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మళ్లీ వైసీపీలో చేరను.. జగన్ వంచించారు!
హామీలిచ్చి గాలికొదిలేశారు.. అభివృద్ధిని మరిచారు
ఒంటికన్నుతో రాణించలేం.. మంగళగిరికి నిఽధులు కుదింపు
చేసిన పనులకూ బిల్లులు ఇవ్వలేదు
3 రాజధానులతో అమరావతి రైతులు విలవిల
తప్పులు దొరికితే జగన్‌పైనా కేసులు.. ఎమ్మెల్యే ఆళ్ల వెల్లడి
మంగళగిరి, డిసెంబరు 30: తాను మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల వెంటే ఉంటానని.. ఆమెతో ఇప్పటికే చర్చించానని.. ఆమె భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరితే తానూ అదే పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళగిరి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల తన శాసనసభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. శనివారమిక్కడ మంగళగిరి ఆటోనగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టి.. అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లు వంటివని.. ఒంటికన్నుతో రాణించాలనుకోవడం ఆత్మహత్యాసదృశమన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి దాదాపు స్తంభించిందని చెప్పారు. ‘మంగళగిరికి దూరంగా ఉండలేను. విలువలకు లోబడి జీవిస్తా. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ పంపించా. ఆమోదంతో నాకు పనిలేదు. నా గన్‌మెన్‌ను సరెండర్ చేశా. సాధారణ పౌరుడిగానే ఉంటా. ఇంకా ఎమ్మెల్యేనేనంటూ వ్యవహరించలేను’ అని తెలిపారు.
టికెట్ ఇవ్వనందుకు వైసీపీని వీడలేదని.. ప్రస్తుత ఇన్‌చార్జి గంజి చిరంజీవికి, తనకూ మధ్య ఏం జరిగిందో జగన్‌కు తెలుసని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షంగా నాడు అడ్డుపడి పోరాటాలు చేశాం. అధికారంలోకొచ్చాక ఆ భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ నుంచి ప్రకటన ఇప్పించాలని ముఖ్యమంత్రి వద్ద ఎన్నిమార్లు చెప్పుకొన్నా ఫలితం శూన్యం. ఆ గ్రామాలవైపు వెళ్లాలంటేనే తల కొట్టేసినట్లుగా ఉంది. తర్వాత మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి గ్రామాల రైతు కుటుంబాల్లో పెళ్లిళ్లకు, చదువులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తప్పులన్నింటికీ బాధ్యులెవరు?
1,200 కోట్లన్నారు.. 12 పైసలైనా ఇవ్వలేదు
జగన్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా మోసం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,200 కోట్లు ఇస్తానని నమ్మబలికి ఇప్పటికి 12 పైసలు కూడా ఇవ్వలేదు. రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం స్వయంగా నాతో చెప్పారు. ఆనక రూ.500 కోట్లన్నారు. మళ్లీ రూ.300 కోట్లన్నారు. చివరకు రూ.125 కోట్లకు జీవో విడుదల చేసి పరిపాలనా అనుమతులిచ్చాం.. పనులు చేసుకోమన్నారు. ఆ పనులు చేసి నెలలు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎన్నికలు తరుముకొస్తుంటే ఇంకా ఎప్పుడు చెల్లిస్తారు? కాంట్రాక్టర్ల ఇబ్బందులు చూడలేక నేనే వడ్డీపై ఏడెనిమిది కోట్లు అప్పుతెచ్చి సర్దాను. దుగ్గిరాల మండలంలో అభివృద్ధి పనులకు 50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో కనీసం రూ.20 కోట్లయినా ఇవ్వాలని చెప్పులరిగేలా సీఎం పేషీ చుట్టూ తిరిగినా నయాపైసా రాలేదు. నేను రాజశేఖరరెడ్డి అభిమానిని. ఆ అభిమానంతోనే ఆయన కొడుకు వెంట నడిచా. నా రాజీనామాకు దారితీసిన పరిస్థితులన్నీ నాతో పాటు జగన్‌కు కూడా బాగా తెలుసు. అయిందేదో అయిపోయింది. ఇక మళ్లీ వెనుదిరిగేదిలేదు.
కేసులు ఉపసంహరించను..
టీడీపీ నేతలపై వేసిన కేసులను ఉపసంహరించుకోను. తప్పులు చేసినవాళ్లు శిక్ష అనుభవించాలి కదా! ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుపై వేసిన కేసుతోపాటు ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు కూడా ఉపసంహరించుకోను. వైసీపీ ప్రభుత్వం గానీ, సీఎం జగన్ గానీ తప్పు చేసినట్లు దొరికితే వారిపైనా కేసులు వేయడానికి వెనుకాడను.