MLC Elections TDP Win : ‘ఫ్యాను’కు ఉక్కపోత!
ABN , First Publish Date - 2023-03-18T03:17:55+05:30 IST
ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు రాయలసీమలోనూ చుక్కెదురైంది. సీఎం సొంత జిల్లా కడప గడప కలిసి ఉన్న పశ్చిమ సీమలోనూ నిరాశాజనకమైన ఫలితమే! మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ

పట్టభద్ర స్థానాల్లో చుక్కెదురు
వైసీపీని ఛీకొట్టిన ఉత్తరాంధ్ర
అదేబాట పట్టిన తూర్పు ‘సీమ’
ఆ రెండుచోట్లా టీడీపీదే గెలుపు
పశ్చిమ సీమలో వైసీపీకి స్వల్ప ఆధిక్యం
పని చేయని ప్రలోభాలు, అరాచకాలు
సీఎం జిల్లా పరిధిలోనూ చేదు ఫలితం
అధికార పార్టీ నేతల్లో దిగ్ర్భాంతి
అసెంబ్లీ లాబీల్లో ముభావంగా పెద్దిరెడ్డి
‘వైనాట్ 175’కు హంసపాదు
2024 ఫలితాలకు ఇది దిక్సూచి అంటున్న రాజకీయ వర్గాలు
అధికారికంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు
రాష్ట్రంలోని 90 శాతానికిపైగా స్థానిక సంస్థలు అధికార పార్టీ చేతిలోనే ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఈ నాలుగూ వైసీపీ కైవశం చేసుకుంది. గురువారమే వీటి ఫలితాలు వెలువడ్డాయి.
బొటాబొటిగా టీచర్ ఎమ్మెల్సీలు
తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండూ వైసీపీ దక్కించుకుంది. ఉన్నతస్థాయి అధికారులే రంగంలోకి దిగి ఉపాధ్యాయులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించి... బోగస్ ఓట్లు చేర్పించి, ప్రలోభాలకు గురి చేసినా... బొటాబొటి మెజారిటీయే లభించింది. ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి పోయాయి. ఇది వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు కలిసి వచ్చింది.
సైకిల్ హవా పట్టభద్ర ఎమ్మెల్సీలు
రాష్ట్రంలోని 108 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి ‘షాక్’ తగిలింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఇక.. పశ్చిమ రాయలసీమలో వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీలో ఉన్నారు. రెండో ప్రాధాన్య ఓట్లతో ఇక్కడ కూడా గెలుపు జెండా ఎగరేస్తామని టీడీపీ గట్టిగా చెబుతోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు రాయలసీమలోనూ చుక్కెదురైంది. సీఎం సొంత జిల్లా కడప గడప కలిసి ఉన్న పశ్చిమ సీమలోనూ నిరాశాజనకమైన ఫలితమే! మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఎదురైన ఈ చేదు అనుభవంతో ‘ఫ్యాను’లో కలకలం మొదలైంది. అన్నిచోట్లా తమ వాళ్లే ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గాలు నాలుగూ గెలిచిన ఆనందం... ప్రలోభాలు, హెచ్చరికలు, బోగస్ ఓట్లతో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సొంతం చేసుకున్న తృప్తి... పట్టభద్ర స్థానాల ఫలితాలతో గల్లంతయ్యాయి! ఇది ఆషామాషీ ఫలితం కాదు! ఏకంగా 108 నియోజకవర్గాల పరిధిలో లక్షలాదిమంది పట్టభద్రులు చెప్పిన తీర్పు! ఈ ఫలితాలతో టీడీపీలో జోష్ నిండగా అధికార పార్టీ శిబిరంలో నిశ్శబ్దం ఆవరించింది. రాష్ట్రంలో మూడు విభాగాలకు సంబంధించిన ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎన్నికల్లో కేవలం ఎంపీటీసీలు, సర్పంచులు మాత్రమే ఓటు వేశారు. వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడం వల్ల ఆ సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రమే ఓటర్లు. చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం.. అనంతపురం-కడప-కర్నూలు స్థానాల్లో ఒక్కో నియోజకవర్గంలో సుమారు 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రాజకీయ పార్టీల నుంచి వైసీపీ మాత్రమే పోటీ చేసింది. టీడీపీ బరిలో నిలవలేదు. ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా బరిలోకి దిగాయి. దీంతో ఓట్లు చీలిపోయి ఈ రెండు సీట్లను వైసీపీ గెలుచుకోగలిగింది. పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు వీటన్నింటి కంటే విభిన్నం. పట్టభద్రులైన వారంతా ఇందులో ఓటర్లు కావడానికి అర్హులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి మొత్తం మూడు నియోజకవర్గాలుగా విభజించి ఎన్నికలు జరిపారు. ఈ మూడింటిలో మొత్తం పది లక్షల మంది వరకూ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వైసీపీ, టీడీపీ నేరుగా తలపడ్డాయి. వీటికి తోడు వామపక్షాలకు అనుబంధంగా ఉన్న సంఘాలతో ఏర్పాటైన పీడీఎఫ్ కూడా విడిగా పోటీ చేసింది.
అయినా... చేదు ఫలితమే!
‘వై నాట్ 175’ అన్న నినాదంతో ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాలను పూర్తిస్థాయిలో వాడుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగిందని మంత్రి ఉషశ్రీచరణ్‌కు సంబంధించి లీకైన వీడియోలు చాటాయి. పట్టభద్రులు కాకపోయినా ఏడో తరగతి, పదో తరగతి చదివిన వారిని కూడా అధికార పార్టీ నేతలు ఓటర్లుగా నమోదు చేయించి వారితో ఓట్లు వేయించారని తిరుపతిలో పోలింగ్ రోజు ఘటనలు బట్టబయలు చేశాయి. కొంత మంది బోగస్ ఓటర్ల వివరాలు సేకరించి ప్రతిపక్షాలు ముందుగానే ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ ఒక్క ఓటును కూడా అధికారులు తొలగించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. కింది స్థాయిలో వలంటీర్లను అధికార పార్టీ రంగంలోకి దింపి వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించింది. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార.. ప్రతిపక్ష పార్టీలు సెమీ ఫైనల్స్‌గానే పరిగణించాయి. ఇంత కీలకమైన పోరాటంలో అనూహ్యంగా అధికార పక్షం వైసీపీ చతికిలబడింది. ఒక్కచోట కూడా ఖాయంగా గెలుపు తమదేనని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికలు జరిగిన ప్రాంతాలు కూడా ఆ పార్టీకి వ్యూహపరంగా అతి ముఖ్యమైనవి కావడం.. అక్కడే వ్యతిరేక ఫలితాలు ఎదురుకావడం ఆ పార్టీ నాయకత్వానికి దిగ్ర్భాంతి కలిగించాయి. విశాఖను రాజధాని చేయబోతున్నామని జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ, అభివృద్ధి పనులు నిలిపివేసి.. దానిని ధ్వంసం చేసేసి.. విశాఖపైనే ఫోకస్ పెట్టి అక్కడే పనులు చేయిస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే అక్కడ భారీ ప్రచారంతో పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. విశాఖ రాజధాని అన్న నినాదంతో ఉత్తరాంధ్రలో రాజకీయంగా పట్టు సాధించవచ్చని వైసీపీ నాయకత్వం ఆశించింది. ఈ ఎన్నికల్లో ఎక్కడ తేడా వచ్చినా ఉత్తరాంధ్రలో రాకూడదన్న పట్టుదలతో విశాఖ నగరంలోని తమ పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఎన్నికలకు వారం ముందు ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డిని అక్కడకు పంపి సకల వనరులను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లకు వెండి నాణాలు పంపిణీ చేశారని ఫొటోలు కూడా వచ్చాయి. ఇంత చేసినా అక్కడ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు వైసీపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి విడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయినా టీడీపీకి పాతిక వేలకు పైగా ఆధిక్యం రావడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎంత బలంగా ఉందో ఉత్తరాంధ్ర ఫలితం నిరూపించింది.
సీమ కోటలు బద్దలు!
రాయలసీమ జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రాజకీయంగా తమకు బలమైన కోటలుగా వైసీపీ నాయకత్వం భావిస్తూ వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఎదురు గాలి వీచినా రాయలసీమలో మాత్రం తమకు తిరుగుండదని ఇంతకాలం ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటూ వచ్చారు. పట్టభద్ర ఎన్నికలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఉన్న రాయలసీమ తూర్పు పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ వైసీపీ అభ్యర్ధిపై భారీ ఆధిక్యం సాధించారు. చిత్తూరు, నెల్లూరులో తమకు ఎదురు లేదన్న నమ్మకంతో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఫలితం షాకిచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ముభావంగా కనిపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నడుమ నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ద్వితీయ ప్రాధాన్యం ఓట్లతో దీనిని తెలుగుదేశం కైవసం చేసుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కలిసి ఉన్న చోట కూడా వైసీపీకి భారీ ఆధిక్యం సిద్ధించకపోగా టీడీపీ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడడం చర్చనీయాంశంగా మారింది.
పథకాలు విజయాన్ని తేలేవా?
ఏ ఎన్నిక జరిగినా తాము అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వల్ల సునాయాసంగా గెలుస్తామని ఇంతకాలం వైసీపీ నాయకత్వం విశ్వసిస్తూ వచ్చింది. కానీ అవి మాత్రమే గెలిపించలేవని.. అభివృద్ధిని ఓటర్లు గాఢంగా ఆకాంక్షిస్తున్నారని పట్టభద్ర ఎన్నికలు నిరూపించాయన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ‘పథకాల ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఓటర్ల జాబితాలో ఉన్నారు. నిజంగా ఈ పథకాల వల్ల తమ జీవితాలు మారిపోయాయని నమ్మితే ఆ కుటుంబాలు ఈ ఓటర్లకు చెప్పి అధికార పార్టీకే ఓటు వేయించేవి. కానీ అలా జరగలేదు. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఆ ఓటర్లను కూడా ప్రభావితం చేసింది. అందుకే వైసీపీ అభ్యర్ధులు ఓటమి బాటలో ఉన్నారు’ అని ఒక రిటైర్డ్ అధికారి అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికలకు ఇది ముందస్తు సంకేతమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ‘రాష్ట్రంలో ముప్పాతిక వంతు ప్రాంతంలో సుమారుగా పది లక్షల మంది ఓటర్లు పాల్గొన్న ఎన్నికలు కచ్చితంగా రాబోయే ఎన్నికలకు సూచికే. అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ఫలితం వచ్చింది. వైసీపీకి గడ్డుకాలం వచ్చిందన్నది ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.