LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్
ABN , First Publish Date - 2023-09-04T19:42:20+05:30 IST
హైదరాబాద్ ఎల్‌బీ నగర్ ఆర్టీసీ కాలనీలో (LB Nagar Incident) పట్టపగలే ప్రియురాలి (Lover) ఇంట్లోకి చొరబడిన యువకుడు.. సంఘవిపై.. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిపై కత్తితో తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే..
హైదరాబాద్ ఎల్‌బీ నగర్ ఆర్టీసీ కాలనీలో (LB Nagar Incident) పట్టపగలే ప్రియురాలి (Lover) ఇంట్లోకి చొరబడిన యువకుడు.. సంఘవిపై.. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిపై కత్తితో తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించింది. ఆస్పత్రికి పరిగెడుతూ దారిలోనే సంఘవి సోదరుడు మృతి చెందగా.. తీవ్రగాయాలతో ఉన్న యువతి ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. సంఘవి ఆరోగ్యంపై ఏఐజీ (AIG) హాస్పిటల్ చైర్మన్ డి. నాగేశ్వర్ రెడ్డి వీడియో రూపంలో హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
జీవితాంతం ఇలానే..!
‘కత్తిపోట్ల కారణంగా సంఘవి సెప్టెంబర్-3 ఆదివారం నాడు మా ఆస్పత్రిలో చేరారు. మా ట్రామా కేర్ బృందం న్యూరో సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్ శస్త్రచికిత్స నిపుణుడు, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజిషియన్‌ల బృందం పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నాం. ముఖంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. సంఘవి ముఖానికి.. మా ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేశారు. దాడి ఫలితంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో ఆమె వెన్నుపాముకు గాయం కావడం జరిగింది. ప్రాణాంతకమైన గాయం కావడంతో సంఘవి జీవితాంతం కదలకుండా ఉండే అవకాశం ఉంది. అత్యున్నత స్థాయిలో వైద్య చికిత్సలు చేస్తున్నారు’ అని నాగేశ్వర్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.
అసలేం జరిగింది..?
హైదరాబాద్ ఎల్‌బీ నగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ప్రియురాలి ఇంట్లోకి చొరబడిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిని పొడిచాడు. అతను అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. ఇది గమనించిన మొదటి అంతస్తులోని వారు, స్థానికులు వచ్చి నిందితుడిని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. యువతి తమ్ముడు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఉస్మానియాకు తరలించారు. ఛాతీలో తీవ్ర గాయాలతో ఉన్న పృథ్వీని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న సంఘవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి తరలించడం జరిగింది. మరోవైపు.. ఉన్మాది శివకుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. దుర్మార్గుడిని ఉరితీయాలని స్థానికులు, సంఘవి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. షాద్‌నగర్ రోడ్డుపై బైఠాయించి స్థానికులు ఆందోళన చేస్తున్నారు.