కత్తిరింపులు, జోడింపులు, ఫిరాయింపులు!

ABN , First Publish Date - 2023-04-20T03:15:04+05:30 IST

జి.ఎన్.సాయిబాబా నిర్దోషిత్వ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసినప్పుడు, ఆయనకు అనుకూలంగా ప్రతికూలంగా సాగిన వాదోపవాదాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి...

కత్తిరింపులు, జోడింపులు, ఫిరాయింపులు!

జి.ఎన్.సాయిబాబా నిర్దోషిత్వ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసినప్పుడు, ఆయనకు అనుకూలంగా ప్రతికూలంగా సాగిన వాదోపవాదాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి. మెదడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ వైకల్యమూ లెక్కలోకి తీసుకోలేమన్న ప్రమాదకరమైన వాదన వాటిలో ఒకటి. నిజమేనేమో, మేధావుల విషయంలోనే కాదు, ప్రతి ఒకరి విషయంలోనూ మెదడే కీలకం. మనుషులం, ఆఫ్టరాల్ కంప్యూటర్ల లాంటివాళ్లం, మన మెదళ్లే మన సీపీయూలు. అవి పనిచేయడం ఆగిపోతే, అంతా షట్ డౌనే అన్నాడు స్టీఫెన్ హాకింగ్స్.

సమాజంలో చెలాయించుకోవాలంటే, రాజకీయాధికారం, సామాజికాధికారం, సాంస్కృతికాధికారం వగైరా అన్నీ కావలసిందే. ఆ అధికార సాధన కోసం వ్యూహం పన్నేదీ మెదడే, అధికారానికి లొంగివుండే ఆలోచన పొందేదీ మెదడే. ప్రయోక్త, స్వీకర్త ఇద్దరూ ఉంటేనే, వలయం పూర్తవుతుంది.

మెదళ్లను మార్చడానికి, మారుమనసులు సాధించడానికి జరిగే ప్రయత్నమే అన్నిటికంటె హింసాత్మకమైనది. అసత్యాలతోను, అర్ధసత్యాలతోను, ప్రలోభ ఉద్వేగాలతోను, అజ్ఞాన ప్రేరణలతోను సాగే నిరంతర సాధన అది. అది అంతగా దృశ్యమానం కాదు.

వెల్లువలను, ఉప్పెనలను గమనించగలిగే వాళ్లము, చాలా సార్లు చాపకింద నీళ్లను తెలుసుకోలేము. ఖడ్గచాలనాల రణగొణ ధ్వనులను ఆలకిస్తూ, నెమలీకల వలె స్పర్శించే విషవాయువులను గమనించలేము.

మొక్కై వంగనిది మానై వంగుతుందా? అన్నది మానవానుభవం రంగరించుకున్న సామెత. క్యాచ్ దెమ్ యంగ్. బుద్ధి వికసిస్తు న్నప్పుడే, దారిలోకి తేవాలి. మరెప్పుడూ దారులు మార్చకుండా చూపును కత్తిరించాలి. కానీ, కుతూహలాన్ని పోషించడానికి, హృదయాలను విశాలాతి విశాలం చేసుకోవడానికి, పెంచుకొన్న రెక్కలతో ఎంచుకున్న ఆకాశం మీదకు ఎగరడానికి అయితే, ఏ ప్రోగ్రామింగ్ అవసరం లేదు. మేధ నుంచి వివేచనా గ్రంథిని తొలగించాలంటే మాత్రం ముక్కుపచ్చలారక ముందే జాగ్రత్తపడాలి.

అందుకేనేమో, పిల్లల బడి పుస్తకాలలో ఏమి ఉంచాలా, ఏమి తీసేయాలా అని అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. చరిత్రలోను, వర్తమానంలోను కొన్ని విషయాలను చెరిపేస్తే, కొన్ని విషయాలు చేరిస్తే, తాము కట్టే గంతలకు పిల్లలు లోబడి చూపులు దిద్దుకుంటారని వాళ్ల ఆశ. కొన్ని స్కూళ్లల్లో చిన్నప్పటినుంచి మన ధర్మం, ఇతరుల ధర్మం, మన దేశం, విదేశం అనే పద్ధతిలో జ్ఞానాన్ని రంగరించి పోస్తుంటారు. వాళ్లు చెప్పే చరిత్రల్లో ధర్మ ద్రోహులుంటారు లేదా రక్షకులుంటారు. ఏదో ఒక ద్వంద్వం చుట్టూ బోధనలన్నీ సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా విద్యావిధానాన్నే ఆ కోవలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ప్రభుత్వ పాఠ్య ప్రణాళికల్లో కొత్తగా చేర్చినా, తీసివేసినా, పదిమంది దృష్టి పడుతుంది, అది ఒక వార్త అవుతుంది. ఎన్‌సిఇఆర్‌టి వారి పాఠ్యాలలో, ముఖ్యంగా చరిత్ర, సమాజశాస్త్రం పాఠ్యాలలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అప్రియమైన వాటిని కొన్నిటిని తొలగించారు. ఉదాహరణకు, గాంధీని ఒక యువ హిందూమత తీవ్రవాది నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు అని ఉంటే దాన్ని గాంధీని నాథూరామ్ గాడ్సే అనే యువకుడు కాల్చి చంపాడు అని మార్చారు. అట్లాగే, 1984 ఢిల్లీ హింసాకాండ గురించి, 2002 గుజరాత్ మారణకాండ గురించి పాఠ్యాలు తీసివేశారు. ఉంచిన చోట వివరాలు తీసేశారు. భారతీయ సమాజం గురించిన వివరాలలో కులం వంటి అంశాల గురించి అనేక భాగాలు తొలగించారు. మొగల్ పాలన గురించి అంశాలలో అనేక కత్తిరింపులు జరిగాయి. వాళ్లను చక్రవర్తులుగా చేసిన సంబోధనలను, మొగల్ సామ్రాజ్యం అన్న ప్రస్తావనను తొలగించారు.

ఈ పాఠ్యాల సంస్కరణ సంచలనమై, మీడియాలో చర్చ జరుగుతోంది కానీ, చర్చ జరగని ప్రక్రియలు అనేకం నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉన్నాయి. అందులో ఒకటి, పోటీ చరిత్ర నిర్మాణం. కేవలం రాజుల, పాలనల, యుద్ధాల చరిత్ర కాదు, సకల రంగాల చరిత్ర. ఇంతకాలం తమకు అనువుగా లేకుండా పోయిన ఆధునిక చరిత్ర.

ఉదాహరణకు, వైజ్ఞానిక రంగ చరిత్ర. సైన్స్‌కు సంబంధించి, భారతీయ మితవాద సంప్రదాయవాదులకు కొన్ని సమస్యలున్నాయి. భారతదేశం ఒకనాడు స్వర్ణ యుగంలో ఉండింది, గతమెంతొ ఘనకీర్తి కలిగింది... ఇవన్నీ సరే, అవి వర్తమానంలో ప్రేరణకు పనికివస్తాయి, ప్రస్తుత దుస్థితిలో పరువు దక్కించుకోవడానికి పనికివస్తాయి. మరి సమకాలీన ఆధునిక భౌతిక అభివృద్ధిని ఎట్లా పరిగణించడం అన్న సమస్య వస్తుంది. భారతీయ ప్రాచీన వాఙ్మయంలో ఎంతో విజ్ఞానం ఉన్నది, దాన్నంతా, 18, 19 శతాబ్దాలలో భారతీయ సంస్కృతి మీద ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేసిన ఇంగ్లీషువారు, జర్మన్లు గ్రహించి లేదా అపహరించి ముందుకు వెళ్లగలిగారు- అన్న వాదన రూపొందించారు. భారతీయ వాఙ్మయం, ముఖ్యంగా వైదిక, సంస్కృత వాఙ్మయం మీద యూరోపియన్ పండితుల ఆసక్తి ఉధృతమైన కాలానికి, ఇంగ్లండులో, మరికొన్ని ఐరోపా దేశాలలో పారిశ్రామిక విప్లవం జరిగిన కాలానికి ఉన్న సామీప్యం ఆ వాదనకు అనుకూలంగా ఉన్నది.

అప్పుడు మరో ప్రశ్న వస్తుంది. సరే, వాళ్లెవరో మన దగ్గరి వైజ్ఞానిక రహస్యాలను కొల్లగొట్టి విమానాలూ రాకెట్లూ కనిపెట్టడం ఎందుకు, మనమే ఆ పని చేయవచ్చును కదా? చేయరు. ఆ విషయంలో వారికి నమ్మకం ఉన్నట్టు లేదు. మహాభారత పురాతత్వ శిథిలాలను అన్వేషించడానికి చరిత్రపరిశోధక మండలికి నిధులిచ్చారు కానీ, వేదాలలోని అణువిజ్ఞానాన్ని, వాయువిహార శాస్త్రాన్ని తవ్వితీయమని తొమ్మిదేళ్లుగా దేశంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వమేమీ శాస్త్రవేత్తలను పురమాయించినట్టు వినలేదు మరి.

‘విజ్ఞాన భారతి’ అన్న సంస్థ ముప్పై ఏళ్ల నుంచి స్వదేశీ స్ఫూర్తితో నడిచే వైజ్ఞానిక ఉద్యమంగా పనిచేస్తూ ఉన్నది. సంఘ్ పరివార్‌కు అనుబంధంగా పనిచేస్తుందంటారు. దాని ఆశయాలు ఆసక్తికరమైనవి. దేశీయ శాస్త్రవిజ్ఞానాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయ, ఆధునిక విజ్ఞానాలను ఒకవైపు, ప్రాకృతిక, ఆధ్మాత్మిక శాస్త్రాలను మరొకవైపు అనుసంధానించడం ఈ సంస్థ లక్ష్యాలు. ఆజాదీ అమృతోత్సవ సందర్భంగా కేంద్రప్రభుత్వ సాంస్కృతిక శాఖతో కలిసి ఈ సంస్థ అనేక మంది భారతీయ శాస్త్రవేత్తల మీద సదస్సులు సంకల్పించింది. గత వైభవం మీదనే ఆధారపడడానికి మించిన దుస్థితి లేదన్న వివేకవంతమైన వ్యాఖ్య ఈ కార్యక్రమాల సందర్భంగా రాసిన ఉపోద్ఘాతాల్లో కనిపించింది. ఆ దుస్థితిని అధిగమించడానికి కొందరు ఆధునిక శాస్త్రవేత్తలను ‘జాతీయతా’ ఆవరణలోకి తేవడానికి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా, వృక్ష ఉద్వేగస్పందనలను కనిపెట్టిన జగదీశ్ చంద్రబోస్, కాంతి ప్రయాణంలో వైచిత్రికి కారణాన్ని గుర్తించిన సి.వి. రామన్‌లను కొత్తగా వ్యాఖ్యానిస్తున్నారు.

జగదీశ్ చంద్రబోస్ అత్యద్భుతమైన, భారతీయులు గర్వించదగ్గ భౌతిక, జీవ శాస్త్రవేత్త. కానీ, సత్యాగ్రహంపై గాంధీ ముద్రను బలహీనపరచడానికి, 1880లలోనే సత్యాగ్రహం చేసిన ఘనతను బోస్‌కు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యాపకులలో తెల్లవారికి, నల్లవారికి నడుమ వేతన వ్యత్యాసం చూపించినందుకు నిరసనగా మూడు సంవత్సరాల పాటు జీతం తీసుకోకుండా బోస్ పనిచేశారు. తరువాత కాలంలో ఆయనకు సమానజీతం ఇవ్వడమే కాక, పాత బకాయిలను కూడా చెల్లించారు. వర్ణవివక్షను వ్యతిరేకించినందుకు ఆయనను అభినందించాలి. కమ్యూనికేషన్ రంగంలో మైక్రోవేవ్ వైజ్ఞానికతలో బోస్ దోహదం గొప్పది. దానికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. కానీ, ఆయనకు వాణిజ్యస్థాయి కమ్యూనికేషన్ రంగ పరిశోధన మీద ఆసక్తి లేదు. ఆ దిశగా ఆయన పరిశోధనలు చేయలేదు. బోస్‌కు కాక, మార్కొనికి పేరు రావడంలో అన్యాయం ఉన్నదన్న వాదన సరి అయినది కాదు. సి.వి. రామన్‌కు నెహ్రూకు విభేదాలున్న మాట నిజమే. శాస్త్ర పరిశోధనలకు నిధుల కేటాయింపు విషయంలో నెహ్రూ ప్రాధాన్యం అన్వయశాస్త్రాలకు ఉండగా, రామన్ మౌలిక శాస్త్రాలకు (ప్యూర్ సైన్సెస్) ఇవ్వాలన్నారు. రామన్ నోబెల్ బహుమతి సందర్భంగా జాతీయవాద ఉద్వేగాలను ప్రకటించారనడం నిరాధారం. ఆయన జీవితంలో తన జాతీయవాదాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. పైగా, ఆయన తెల్లవారి నుంచి కాక, బెంగాలీల నుంచి ఎక్కువ వేధింపులు ఎదుర్కొన్నారు. ఆ వేధింపుల బాధ్యులలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉండడం విశేషం. ఉన్నట్టుండి, బోస్‌ను గాంధీ కంటె గొప్ప చేసి, రామన్‌ను అంతర్జాతీయ స్థాయి దేశభక్తుడిని చేయాలనుకోవడం విన్యాసమే తప్ప, ఔచిత్యవంతం కాదు. అనేక ప్రతికూల పరిస్థితులలో ఆ ఇద్దరు మహాశాస్త్రవేత్తలు పరపాలనలో అంతటి మౌలిక దోహదాలు చేయగా, స్వతంత్ర భారతంలో అది ఎందుకు కొనసాగలేదని ప్రశ్నించుకోవాలి. కుల, మత సమానత్వాన్ని, సామరస్యాన్ని విశ్వసించి, ఆచరించిన జగదీశ్ చంద్రబోస్ వాస్తవ ఆదర్శాలను మనమెందుకు గుర్తించడం లేదని కూడా ఆశ్చర్యపడాలి.

సి.వి.రామన్ చదువు అంతా భారతదేశంలోనే సాగింది కానీ, రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టడానికి ప్రేరణ మాత్రం మధ్యధరా సముద్రాన్ని చూసినప్పుడు కలిగింది. జగదీశ్ చంద్రబోస్ విద్యార్జన దేశంలోను, ఇంగ్లండ్‌లోను జరిగింది. ఐరోపాలో వృద్ధి అయిన శాస్త్ర విజ్ఞానాన్నే ఈ ఇద్దరూ చదువుకున్నారు, దాన్నే ముందుకు తీసుకువెళ్లారు. వారేమీ భారతీయ సంప్రదాయ విద్య చదివి ఆధునిక శాస్త్రవేత్తలైన వారు కాదు.

మన గతంలో కొన్ని లోపాలున్నాయి. మన విద్యాచరిత్రలో కొన్ని అన్యాయాలున్నాయి. చరిత్రను మసిబూసి మారేడుకాయ చేయలేము. వాస్తవాన్ని అంగీకరించి, దారిని సవరించుకోవాలి. కత్తిరింపులు, జోడింపులతో చరిత్రకు మరమ్మత్తు జరగదు. మహనీయులను ఫిరాయించుకుని కృత్రిమంగా బలం పెంచుకోలేము. ఇటువంటి కల్పిత సత్యాలతో మెదళ్లపై దాడిచేస్తే, ఎటువంటి మేధావి తరం అవతరిస్తుంది?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-04-20T09:45:08+05:30 IST