గ్లోబల్ బస్తీ మే భారత్ సవాల్!

ABN , First Publish Date - 2023-09-28T01:08:48+05:30 IST

భోజరాజునే ధిక్కరించి ఓ రైతు మాట్లాడితే, మంత్రికి అనుమానం వచ్చి, అతను నిలబడ్డ చోటుని తవ్వించాడట, లోపల ఏకంగా విక్రమార్కుడి సింహాసనమే దొరికింది. పంచతంత్ర కథలో ఒక ఎలుక ఎగిరెగిరి ఉట్టిని...

గ్లోబల్ బస్తీ మే భారత్ సవాల్!

భోజరాజునే ధిక్కరించి ఓ రైతు మాట్లాడితే, మంత్రికి అనుమానం వచ్చి, అతను నిలబడ్డ చోటుని తవ్వించాడట, లోపల ఏకంగా విక్రమార్కుడి సింహాసనమే దొరికింది. పంచతంత్ర కథలో ఒక ఎలుక ఎగిరెగిరి ఉట్టిని కూడా అందుకుంటుంటే, దీనికింత శక్తి ఎక్కడిదా అని అనుమానించి దాని కలుగును పెకిలిస్తే బోలెడు బంగారమట. సాధారణంగా అణకువగా, నంగినంగిగా మెసిలేవారు ఒక్కసారిగా తలబిరుసుగా మాట్లాడితే, ఆ మాటల వెనుక అధికారపు వాసనో, నడమంత్రపు సిరో కారణమని అనుకోవడం సహజం. అట్లాగని, బలహీనులు, దీనులు ఎప్పుడూ ధీమాగా, నిబ్బరంగా మాట్లాడలేరని, కొత్త శక్తులు పుంజుకుని విజయాలు అందుకోలేరని అర్థం కాదు. అహంకారం, ఆత్మాభిమానం చూడ్డానికి ఒకేలాగ కనిపించినా, చూడచూడ వాటి తీరు వేరు. ఆధిక్యవాదులలో పౌండ్రక వాసుదేవుల లాగా నకిలీలు ఉన్నట్టే, ఆత్మాభిమానం కూడా అన్నివేళలా నికార్సయినది కాకపోవచ్చు. నిన్నటి దాకా అణగిమణగి ఉన్నవారు, వీలయినప్పుడల్లా పరదేశాలకు మేళ్లు చేసినవారు కూడా, కాలం కలసిరాగానే జాతీయభావంతో కదం తొక్కుతారు.

నిజానికి ఈ నరేంద్రమోదీ, ఆ జైశంకర్ గుండీలు విప్పి, చొక్కాచేతులు మడిచి, రారమ్మని కెనడాను, అమెరికాను పిలుస్తూ తొడగొడుతుంటే సంతోషంగానే కాదు, ఒకింత గర్వంగా కూడా అనిపిస్తుంది. రష్యా వెనుక దాక్కుని, అమెరికాను ఖబడ్దార్ అని హెచ్చరించినందుకే ఇందిరాగాంధీకి జేజేలు పలికాం. ఇప్పుడు అమెరికా పక్కన నిలబడి చైనాను, చైనా రష్యాల పక్కన నిలబడి అమెరికాను, దాని ఎగువన మునగ తీసుకుని ఉండే కెనడాను, ఆధునికత తగ్గించుకుని సనాతనం పెంచుకుంటున్న టర్కీని అన్నిటినీ చెడుగుడు ఆడుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని చూసి జనులందరికీ యాభైఆరు అంగుళాల ఉత్సాహం ఉప్పొంగితే ఆశ్చర్యం లేదు. లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా, సంపదను, సంపన్నులను ఆరాధించే నవయుగం అవతరించినా, ఇప్పటికీ, పెద్దవాళ్లను ఢీకొట్టే పేదలంటే జనాలకు ఆకర్షణే. అగ్రరాజ్యాలను సవాల్ చేయగలిగే అవకాశం కంటె జాతీయవాదికి అదృష్టం ఏముంటుంది? ఈ సినిమా కథ ఎప్పటికీ పాతబడదు. ఎవర్ గ్రీన్.

ప్రపంచ రాజకీయాలు కొంచెం చెదిరిపోయాయి. మునుపటి లాగా లేవు. అమెరికా ప్రాభవం తగ్గిపోతున్నది. రష్యా పాత పుష్టిని కూడగట్టుకుంటున్నది. చైనా చాప కింద నీరు లాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. యూరోపు అయోమయంలో ఉన్నది. రకరకాల కూటములు రకరకాల భౌగోళిక, ఆర్థికప్రయోజనాల కోసం ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిలో చిన్నదేశాలకు ఒక సాపేక్ష స్వేచ్ఛ కనిపిస్తోంది. గతంలోని ద్వైపాక్షిక, చారిత్రక బంధాలు ఏవీ బలంగా లేవు. తనకు చైనా ఒక్కటే కాదు, ఇండియా అమెరికా కూడా కావాలని నేపాల్ ప్రచండ అంటున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట భారత్ నేపాల్ మధ్య చిటపటలు తెలిసినవే. చైనా అండ చూసుకుని భారత్‌ను ఎదిరించగలిగిన నేపాల్ ఇప్పుడు, చైనా అంతర్జాతీయ భద్రతా ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. మీ ఆర్థికపథకం ఓకె, అంగీకారమే, కానీ, భౌగోళికరాజకీయాల విషయంలో మా దారి వేరు అని చెప్పగలిగింది. అమెరికాకు అనుంగు నేస్తం సౌదీ అరేబియా, తన చిరకాల శత్రువు ఇరాన్‌తో సఖ్యతకు సిద్ధపడింది. ఇవన్నీ ఆత్మాభిమాన సూచనలా, అవకాశవాద వైఖరులా?

భారత్ తన భౌగోళిక పరిసరాల రీత్యా మాత్రమే కాదు, ప్రపంచ కార్పొరేట్ల మార్కెట్ గాను, ఉత్పత్తికేంద్రంగాను, ద్రవ్యపెట్టుబడి లక్ష్యంగాను కూడా కీలకమయినది. చైనా ప్రాభవం పెరగకుండా నిరోధించడానికి భారత్ అవసరమని అమెరికా అనుకుంటుంది. పాకిస్థాన్ బాగా బలహీనపడినందువల్ల, దక్షిణాసియాలో అమెరికాకు తానే ఎక్కువ ప్రయోజనకరమైన మిత్రదేశమని భారత్ కూడా అనుకుంటోంది. కానీ, ఇరాక్ ఆప్ఘనిస్థాన్ యుద్ధాల ముగింపు తరువాత, ఉక్రెయిన్ యుద్ధారంభం తరువాత, ప్రపంచ రాజకీయాలలోనే అమెరికా నిర్వహించగలిగే పాత్ర తగ్గుముఖం పట్టింది. అనేక ప్రాదేశిక, వాణిజ్య కూటములలో ఇండియా భాగస్వామిగా ఉంటున్నది. చైనాతో ఒకవైపు ఘర్షణ పడుతూనే ఉన్నది, మరోవైపు కొన్ని వేదికలను పంచుకుంటున్నది, దేశీయమార్కెట్‌ను చైనా విజృంభణకు అనుమతిస్తున్నది. ద్వైపాక్షిక ప్రయోజనాలకోసం పనిచేయాలనుకున్నప్పుడు, ఇండియాలో మతమైనారిటీల హక్కుల గురించి, ప్రజాస్వామ్యం లేకపోవడం గురించి అమెరికా మాట్లాడడం ఎందుకు? వెంటనే జైశంకర్ అంతే తీవ్రంగా సమాధానం ఇవ్వడం ఎందుకు? అమెరికాపై జైశంకర్ చేసే విమర్శల్లోని స్వర తీవ్రతను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతకు వేలరెట్లు దూషణలకు అమెరికా అర్హమైనదే, సందేహం లేదు. కానీ, వేలాది కోట్ల విమాన కాంట్రాక్టులు, అమెరికన్లకు కోట్లాది మానవ ఉపాధి దినాలు సమర్పించుకుంటూ, మాటల్లో మాత్రం ఎందుకు ఈ దూకుడు అన్న సంశయం కలగడం సహజం. ఈ సందేహాలు, సంశయాల లోతుల్లోకి వెడితే సమాధానాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మళ్లీ పోటీకి సిద్ధపడుతున్న బైడెన్‌కు డెమొక్రటిక్ పార్టీ రాజకీయవాదనలకు అనుగుణమైన బాహ్య ప్రకటనలు ఉండాలి. ట్రంప్‌ను, ట్రంప్ తరహా నేతలను వారి మితవాద భావాలను విమర్శిస్తూ ఉండాలి. అగ్రరాజ్య ప్రజాస్వామ్య నైతిక ఆధిక్యం సరేసరి. ఇక, భారత్ విషయంలో ఆర్థికవిధానాలలో స్వతంత్ర జాతీయ వైఖరిని అనుసరించడం సాధ్యపడకపోవడమో, ఆసక్తి లేకపోవడమో ఉంది కాబట్టి, వాగాడంబరం అవసరం, తీవ్రజాతీయతా ప్రదర్శనా అవసరం.


కెనడాతో వివాదం సంక్లిష్టమైనది. ఆ దేశం సాధుజీవి ఏమీ కాదు. అగ్రరాజ్యంగా చెప్పుకోకపోయినా, అగ్రరాజ్యాల మిత్రదేశమే. సంపన్నదేశమే. మా దేశంలోకి వచ్చి మా పౌరుణ్ణి చంపుతారా అని నిలదీస్తున్నది కానీ, ఈ కెనడా కూడా నాటో సభ్యురాలిగా ఆప్ఘనిస్థాన్‌లో ఆప్ఘన్లను చంపిన దేశమే. అమెరికా శిబిరం గ్లోబల్ రాజకీయాలలో చేసే వాదనలే కెనడా కూడా చేస్తుంది. కాకపోతే, ఆ దేశం అమెరికా కంటె, అనేక యూరోపియన్ దేశాల కంటె తమ దేశపౌరులకు అధిక సంక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది. చలి వాతావరణం దుర్భరం అయినప్పటికీ, భారతీయులతో సహా అనేక ఇతర దేశాల వారు కెనడా శాశ్వత నివాసం లేదా పౌరసత్వం కోసం తహతహలాడతారు. తక్కువ జనసంఖ్య కలిగిన ఆ దేశం ప్రవాసులను ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది. తమిళులయినా, సిక్కులయినా ఆ దేశంలో పెద్దసంఖ్యలో ఉండడానికి ఈ నేపథ్యమే కారణం. భారతదేశ ప్రభుత్వం ప్రమాదకారులని భావిస్తున్న ఖలిస్తాన్ వాదులు కెనడాకు వలసవెళ్లడం కానీ, అక్కడి సానుభూతిపరులు వారిని ఆదరించడం కానీ సమస్యాత్మక అంశాలే. 1985లో ఎయిర్ ఇండియా వారి కనిష్క విమానం ఖలిస్తానీల విద్రోహ చర్య కారణంగా అట్లాంటిక్‌లో కూలిపోయి 329 మంది మరణించారు. మృతులలో అధికులు భారత సంతతికి చెందిన కెనడా పౌరులు. ఆ కాలం నుంచి, ఆ తరువాత భారత్‌లో ఉద్యమం అణగారిపోయిన తరువాత కూడా కెనడా సిక్కులలో ఖలిస్తాన్ సానుభూతిపరులు కొనసాగుతున్నారు. భారత సంతతి కెనడియన్లలో తమిళ టైగర్ల సానుభూతిపరులు, సహాయకులు కూడా ఉండేవారన్నది తెలిసినదే. మరో దేశానికి ప్రవాసం వెళ్లినవారు తమ పూర్వదేశంలోని పరిణామాలకు స్పందించడం, వాటిలో భాగం కావడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. ఖలిస్తాన్ వాది అయిన నిజ్జార్ అనే కెనడాపౌరుడిని గత జూన్‌లో కెనడా భూభాగం (బ్రిటిష్ కొలంబియా) మీద హత్య చేసిన వారి వెనుక భారత్ ఉన్నదన్నది కెనడా ఆరోపణ. అది అబద్ధమని చెబుతూ, ఆధారాలు చూపమని ఇండియా డిమాండ్ చేస్తున్నది. కెనడా, దాని నాలుగు మిత్రదేశాలు, ఈ హత్యను సీమాంతర అణచివేత (ట్రాన్స్ నేషనల్ రిప్రెషన్) చర్యగా అభివర్ణిస్తున్నాయి.

ఒకనాడు సీమాంతర లేదా అంతర్జాతీయ ఉగ్రవాదం సమస్య అని అమెరికా శిబిరం గగ్గోలు పెట్టింది. దాన్ని ఎదుర్కోవడం కోసం అంటూ యుద్ధాలు చేసింది. తాము ప్రమాదకారులని గుర్తించిన వ్యక్తులను వారి భూభాగంలోనే గురిపెట్టి మరీ చంపుతోంది. ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన సంఘటన కూడా పాకిస్థాన్ భూభాగం మీద, ఆ దేశం నుంచి అనుమతి లేకుండా చేసిన చర్య. మరి తమకు ప్రమాదకారులని భావించిన వ్యక్తులను వారు విదేశీయులైనా, వారిని వారి సొంత దేశంలో చంపే హక్కు భారత్‌కు ఎందుకు ఉండదు? ఇతరుల విషయానికి వచ్చేసరికి సీమాంతర అణచివేత అన్న కొత్త మాట తీసుకువచ్చారు. అమెరికా, ఇంగ్లండ్, ఇజ్రాయిల్ వంటి దేశాల రహస్యదళాలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఎవరినైనా చంపగలిగే శక్తీ, ఆనవాయితీ ఉన్నవే కదా? తమ దేశంలో ఒక్కరినంటే ఒక్కరిని చంపితే ఎందుకింత యాగీ? అక్కడ సిక్కుల ఓట్లు గణనీయంగా ఉండడం కారణమని కొందరు అంటున్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రాధాన్యాలు మారకూడదని ఒకరు, అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించాలని మరొకరు చేస్తున్న వాదనలు అటువంటి వివరణలకు ప్రతిస్పందనగా వస్తున్నాయి.

చంపే హక్కు భారత్‌కు ఉందా లేదా అన్నది అవాంఛనీయమైన, అమానవీయమైన చర్చ. ప్రపంచంలో ఎవరూ ఎవరినీ చంపే హక్కూ అధికారమూ ఉండకూడదు. ఇండియా అసలు తనకు ఆ హత్యతో సంబంధం లేదనంటున్నది. కానీ, తీవ్రజాతీయవాదులు మాత్రం సామాజిక మాధ్యమాలలో భారత్ ప్రతాపానికి వేడుకలు జరుపుకుంటున్నారు. నిజంగానే మన దేశం ఆ పని చేసిందని నమ్ముతున్నారు. ధైర్యమూ మగటిమీ కలిగిన ప్రభుత్వం కాబట్టే, ఏడేడు లోకాల్లో దాగిన శత్రువునైనా శిక్షిస్తోందని ప్రశంసిస్తున్నారు. ఈ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన ఒకటి రెండు సంఘటనలు కూడా భారత ప్రభుత్వం వారి అప్రకటిత చర్యల ఖాతాలో వేసుకుంటున్నారు. రాజకీయ హత్యలు, అనధికార హత్యలు భారతదేశంలో జరగలేదని ఎవరు మాత్రం అనగలరు? ఇప్పుడు వాటి విస్తృతి విదేశాలకు కూడా పాకిందని, మనమూ మొస్సద్ స్థాయికి ఎదిగామని సంతోషించేవారుంటే కాదనేదెవరు? ఇదంతా కూడా ఒకతరహా దేశభక్తిని, కఠినచర్యల ప్రభుత్వాలను కీర్తించే వాదనలే కదా?

ఇండియాతో తగవు వల్ల, వచ్చే ఎన్నికలలో ప్రధాని ట్రూడోకు ఏమైనా లాభం ఉందో లేదో తెలియదు కానీ, కెనడాతో కయ్యం ప్రధాని మోదీకి మాత్రం అంతో ఇంతో సహాయపడవచ్చు. ఒకపక్క పాకిస్థాన్ తూగని, తగని శత్రువు అయిపోయింది, చైనాతో పోరు మనకే నష్టమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ దశలో దేశంలో తీవ్రజాతీయవాద భావాలకు కెనడా వివాదం ఎంతోకొంత అనుకూల వాతావరణం కల్పించగలదు. అయితే, పాకిస్థాన్‌తో ఘర్షణ దేశంలో కలిగించగలిగిన ఆవేశాన్ని, కెనడాతో కలహం కలిగించలేదు. పైగా, భారతదేశ మధ్య, ఎగువ మధ్యతరగతి ఆకాంక్షలకు, జాతీయతకు మధ్య ఘర్షణ వస్తే, ఎంపికలు దేశభక్తియుతంగా ఉంటాయని గ్యారంటీ లేదు. కెనడాలో ఉన్న భారతజాతీయులు, ఉద్యోగస్తులు, కెనడాకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ ఉద్రిక్తతను ఇష్టపడడం లేదు. సాధ్యమైనంత తొందరగా ఇది సమసిపోవాలని కోరుకుంటున్నారు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-09-28T01:08:48+05:30 IST