రాహుకాలాన్ని రాహుల్ గెలుస్తారా?
ABN , First Publish Date - 2023-03-30T02:29:55+05:30 IST
కథఅడ్డం తిరిగిందనలేము కానీ, నల్లేరు మీద నడకలా నరేంద్రమోదీ నడిపిస్తున్న జాతీయ రాజకీయం మలుపు తిరిగింది. ఈ పరిణామం అధికార బిజెపి ఉద్దేశించిందా, లేక...
కథఅడ్డం తిరిగిందనలేము కానీ, నల్లేరు మీద నడకలా నరేంద్రమోదీ నడిపిస్తున్న జాతీయ రాజకీయం మలుపు తిరిగింది. ఈ పరిణామం అధికార బిజెపి ఉద్దేశించిందా, లేక అనూహ్యంగానో తొందరపాటుతోనో సంభవించి తాను కూడా దిగ్భ్రాంతి చెందిందా, పర్యవసానాలకు ఏ పక్షం ఎంత మేరకు సిద్ధంగా ఉన్నది వంటి ప్రశ్నల మీద దేశమంతా చర్చ జరుగుతున్నది. ఈ మాత్రం వేడి ఈ మధ్యకాలంలో చూడలేదు. అధికార ప్రతిపక్షాలు ఇంతగా ముఖాముఖీ తలపడిన సన్నివేశం తొమ్మిదేళ్లలో ఎప్పుడు మాత్రం ఎదురయింది?
ఇదంతా రాహుల్ గాంధీ వన్ మ్యాన్ షో తప్ప ఇందులో సంఘటిత ప్రతిఘటన ఎక్కడుంది అని అడిగేవాళ్లున్నారు. రాహుల్ వ్యక్తిత్వంలో, వ్యవహార సరళిలో ఇప్పుడు ఎంతో పరిపక్వతను చూడగలుగుతున్నాము. కానీ, అతడు ఒక కీలక, చారిత్రక సంక్షోభ సందర్భంలో సమర్థ నాయకుడిగా ప్రతిపక్షాన్ని నడిపించగలుగుతాడా అన్న సందేహానికి మాత్రం సంతృప్తికరమైన సమాధానం కార్యక్షేత్రంలో ఇంకా లభించవలసే ఉన్నది. కాకపోతే, ప్రస్తుత సందర్భం, అతని గురించిన సానుకూల వాగ్దానాన్ని అందిస్తున్నది.
ఇతర పక్షాలన్నిటిని రాజకీయంగా బలహీనపరచి, దర్యాప్తు సంస్థల ద్వారా బాధించి, ఆ పైన చట్టసభలలో సైతం హేళన చేసి కేంద్రంలోని అధికారపార్టీ ఏకస్వామ్యపాలన నడిపిస్తున్నదన్న విమర్శలు తెలిసినవే. ప్రతిపక్షాలకు ఉనికి మిగలలేదు, వారి మాటలు జనం దగ్గరకు వెళ్లే అవకాశాలు కూడా లేవు. తొమ్మిదేళ్ల కాలంలో హిందీ ఇంగ్లీషు భాషల మీడియా అత్యధికం ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఐదు నెలల పాటు సాగించిన భారత్ జోడోయాత్రకు కూడా మీడియా నుంచి లభించిన స్పందన అతి స్వల్పం. ఎంతగా అప్రధానం చేసినప్పటికీ, రాహుల్ యాత్రకు ప్రజాదరణ అమితంగా లభించడం, సమాచార ప్రసార సాధనాల పాక్షికతకు ఉన్న పరిమితులను తెలియజేసింది.
ప్రజలతో మెలగిన తరువాత, సమకూరిన ఆత్మవిశ్వాసంతో, లోకజ్ఞానంతో రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీతో సహా బ్రిటన్‌లో అనేక చోట్ల సంభాషించారు. భారతదేశంలోని పరిస్థితుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన విదేశాలలో భారతదేశాన్ని అప్రదిష్టపాలు చేశారని, జోక్యం చేసుకొమ్మని వారిని అడిగారని విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాహుల్ నుంచి అధికారపక్షం అందుకు క్షమాపణలు కోరింది. ఈ ఘట్టం రావడానికి ముందు అదానీ వివాదం వచ్చింది. అదానికి, ప్రధానికి ఉన్న సంబంధమేమిటని రాహుల్ లోక్‌సభలో అడిగారు. ఒకనాడు అర్భకుడిగా, మేదకుడిగా ముద్రపడిన ఈ నాయకుడు ఇప్పుడు భారత రాజ్యానికి సంబంధించిన ఒక కీలక ప్రశ్న సంధించాడు. తామే ప్రతిపక్షమన్నరీతిలో అధికారపక్షం ఆ ప్రశ్నను అణగార్చివేసింది. ఆ ప్రశ్న వేసినవాడిని సభనుంచి వెలివేయడం తరువాతి ఘట్టమైంది. రాహుల్ చెప్పినట్టు ఆ ఒక్కప్రశ్నే, అతనిని బహిష్కృతుడిని చేసిందా? అదే కనుక అయితే, మాయలఫకీరు ప్రాణం ఆ ప్రశ్నలోనే ఉన్నదేమో?
మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ రాజధానిలో పార్టీ కేంద్రకార్యాలయంలో సహచరులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు. అభివృద్ధి, దృఢమైన పరిపాలన ఎజెండాను రాజ్యాంగ సంస్థల పునాది మీద ముందుకు తీసుకపోతుండగా, దాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతి పాలు చేస్తున్నారని, వాటిని కించపరుస్తున్నారని అన్నారు. రాజ్యాంగ సంస్థలంటే, ఆయన దృష్టిలో సిబిఐ, ఈడీ వంటివి కావు కదా అని అనుమానం కలిగింది. అవినీతిమీద, అవినీతిపరుల మీద విరుచుకుపడుతుంటే సహించలేని, దేశవిదేశీ శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. సాంకేతికంగా ఈడీ సిబిఐ వంటివి రాజ్యాంగ సంస్థలు కావు. ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు మాత్రమే. బహుశా, న్యాయవ్యవస్థను ఉద్దేశించి ఆయన ఆ మాట అని ఉంటారా? రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు గురించి అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నందున అని ఉంటారా?
మీడియాతో పాటు సోషల్ మీడియాను కూడా విశృంఖలంగా వినియోగించుకునే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న జాతీయ అధికారపక్షం, అందుబాటులో ఉన్న సకల రంగాలను, వ్యవస్థలను తన అధికార స్థిరీకరణకు వినియోగించుకుంటూ వచ్చింది. కేవలం దర్యాప్తు సంస్థలను ప్రయోగించడమే కాకుండా, న్యాయవ్యవస్థను కూడా పరోక్షంగా అదుపు చేస్తూ వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. గత తొమ్మిదేండ్ల కాలంలో రకరకాల స్థాయిలలో న్యాయస్థానాలు దేశంలో నెలకొని ఉన్న ప్రాబల్య వాతావరణానికి ఒదిగి ఉండే ప్రయత్నమే ఎక్కువగా చేసినట్టు చూస్తాము. చట్టాలు, న్యాయపద్ధతుల మార్గంలోనే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం ద్వారా అందుకు అభ్యంతరం చెప్పేవారికి నైతికత లేకుండా చేయవచ్చునన్నది అధికారపక్షం ఆలోచన. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి శిక్ష, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హత విషయంలో, చాలామంది అమాయకంగానూ, అతి తెలివిగానూ కూడా, అంతా చట్టప్రకారమే జరిగింది కదా అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదో ఎంపిక చేసిన సందర్భంలో కాక, చట్టం, న్యాయం అన్ని సందర్భాలలోనూ, అందరి విషయంలోనూ ఒకేవిధంగా వ్యవహరించాలి. అవమానపరిచే మాటలన్నందుకే ఒక నాయకుడికి రెండేళ్ల శిక్ష విధించే మాట అయితే, వారూ వీరూ అక్కరలేదు, సాక్షాత్తూ ఈ దేశ ప్రధానికే, అదే కారణానికి, అనేక శిక్షలు పడాలి. దేశం ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడాలంటే, కేవలం ప్రతిపక్షాల ఐక్యత, పౌరసమాజం అప్రమత్తత మాత్రమే చాలవని, న్యాయవ్యవస్థ క్రియాశీలంగా మారడం కూడా ఆవశ్యకమని సూచనలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీకి ప్రజల నుంచి, ఇతర ప్రతిపక్షాల నుంచి ఇంతటి మద్దతు దొరకడాన్ని బిజెపి పెద్దలు ఎట్లా అర్థం చేసుకున్నారు? బిజెపి బాధితులందరూ ఒక గూటికి చేరడం తమకు రాజకీయంగా లాభం కలిగిస్తుందని అనుకుంటున్నారా? లేక, అనూహ్యమైన రీతిలో పరిణామాలు సాగడానికి అనవసరంగా తాము దోహదపడ్డామని పశ్చాత్తాపపడుతున్నారా? వారి అంతరంగాలేమిటో చెప్పలేము కానీ, నరేంద్రమోదీ మంగళవారం నాడు చేసిన ప్రసంగంలో ఒక చిన్న క్లూ ఉన్నది. అవినీతిపరులంతా కూడి తన మీద యుద్ధానికి వస్తున్నారని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పుకున్నారు. ‘‘గట్టిగా పోరాడాలి’’ అని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఈ గట్టి పోరు స్వరూప స్వభావాలెట్లా ఉంటాయో రాజకీయ రంగస్థలంలోనే చూడాలి. ఒకటి మాత్రం నిజం, బిజెపి తాను కొద్దిగా కూడా బలహీనపడాలనుకోవడం లేదు, పైగా, మునుపటి కంటె మరింత బలపడాలనుకుంటున్నది. ఏ మాత్రం దెబ్బతినే అవకాశం ఉన్నా, పెద్ద ఎత్తున ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతుంది. అన్ని రకాల ఏజెన్సీల నుంచి, వ్యవస్థల నుంచి, ప్రచార యంత్రాంగాల నుంచి బహుముఖ ప్రయత్నాలు జరుగుతాయి. అవినీతిపరులు, దేశవ్యతిరేక శక్తులు, విదేశీశక్తులు అంతా కుమ్మక్కయ్యారన్న ప్రచారం ఉధృతమవుతుంది. ప్రమాదావకాశాలను, విరుగుడు వ్యూహాలను పరీక్షించడానికి కర్ణాటక ఎన్నికలు నమూనావేదికగా పనిచేస్తాయి. రాహుల్ ఉదంతంతో వచ్చిన మలుపునకు, కర్ణాటక ఫలితం కూడా తోడయితే, వచ్చే పన్నెండు నెలల కాలమూ హోరాహోరీయే!
ప్రతిపక్షాలన్నీ, ఒకే ఉపద్రవం కారణంగా బెదిరిపోయి, భీతితో దగ్గరయ్యాయి తప్ప, వాటి మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్-, ఆప్ మధ్య సాగుతూ ఉన్న అసహన వాతావరణం గమనిస్తే ఇప్పటి సంఘీభావం ఆశ్చర్యకరమే. అట్లాగే, బిఆర్ఎస్, టిఎంసీ కూడా మాటమద్దతు ఇవ్వడం చిన్న విషయం కాదు. ఆ మద్దతును ఎంతో కొంత స్థిరపరచుకునే దిశగా సుహృద్భావాన్ని, పరిపక్వతను కాంగ్రెస్ ప్రదర్శించాలి. బలంగా స్థిరంగా ఉన్నప్పుడు కూడా స్నేహం కోసం మనుషులు తగ్గవలసి వచ్చింది. ఇప్పుడు కష్టకాలంలో ఉండి కూడా కాంగ్రెస్ తన పెద్దన్న ధోరణిని వదులుకోకపోతే కష్టం. కాంగ్రెస్‌కు కొత్తరూపం ఇవ్వాలనుకుంటున్న రాహుల్, తన నాయకత్వాన్ని స్థిరపరచుకోవడానికి ప్రత్యర్థులతోనే కాదు, మిత్రులతో ఎట్లా మెలగాలో కూడా నేర్చుకోవాలి. వ్యక్తిగా ఉదాత్తతను, గాంభీర్యాన్ని, రాజకీయ వివేకాన్ని అలవరచుకున్న రాహుల్, ఆ లక్షణాలను పార్టీనేత బలాలుగా కూడా మలచగలగాలి.
రాహుల్ శిక్షను, అనర్హతను సమర్థించేవారు ఏమి వాదించినా, వారి ప్రత్యర్థులు ఏమి ప్రతివాదం చేసినా, సాధారణ పౌరులు మాత్రం ఇందులో కక్ష తప్ప న్యాయం లేదని పెదవి విరుస్తున్నారు. నరేంద్రమోదీ మీద ఎంతో అభిమానం ఉన్నవారు కూడా ఇది ఇట్లా జరగవలసింది కాదనే అంటున్నారు.
కె. శ్రీనివాస్