Drone attack in Red Sea: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెలీ మర్చెంట్ నౌకపై డ్రోన్ దాడి
ABN , Publish Date - Dec 23 , 2023 | 06:31 PM
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం వాణిజ్యంపై కూడా పడుతోంది. ఎర్ర సముద్రంలో తాజాగా ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగిందని బ్రిటన్‌కు చెందిన నౌకాయన భద్రతా సంస్థ ఆంబ్రే శనివారం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం వాణిజ్యంపై కూడా పడుతోంది. ఎర్ర సముద్రంలో (Red sea) తాజాగా ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి (Drone attack on Merchant Vessel) జరిగిందని బ్రిటన్‌కు చెందిన నౌకాయన భద్రతా సంస్థ ఆంబ్రే శనివారం వెల్లడించింది. భారత్‌లోని వెరావల్ తీరానికి నైరుతి దిశగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. లైబీరియా జెండా ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్‌కు సంబంధించినది (Isreal Affiliated Vessel).
నౌకలో రసాయనాలు తరలిస్తుండటంతో దాడి కారణంగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా నౌకకు కొంత నష్టం జరిగిందని ఆంబ్రే సంస్థ పేర్కొంది. ఇండియావైపు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది.
కాగా, దాడి సమాచారం అందగానే భారత్ నేవీ రంగంలోకి దిగింది. సాయం కావాలన్న విజ్ఞప్తి రావడంతో తాము స్పందించామని భారత నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి యుద్ధ నౌకను పంపించామని చెప్పారు. కావాల్సిన సాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఎర్రసముద్రంలో ఇటీవల వాణిజ్య నౌకలపై మిసైళ్లు, డ్రోన్ల దాడులు జరిగాయి. పాలస్తీనాకు మద్దతునిస్తున్న హౌతీలు ఈ దాడులు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సరుకు రవాణా, వాణిజ్య నౌకలు తమ ప్రయాణ మార్గం మార్చుకుంటున్నాయి. ఆఫ్రికా చుట్టూ తీరిగే సుదీర్ఘ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.