Michaung: 550 ఇండిగో విమానాలు రద్దు.. విశాఖ విమానాశ్రయం మూసివేత
ABN , First Publish Date - 2023-12-05T14:01:26+05:30 IST
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది.
చెన్నై: మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది. సోమవారం కురిసిన భారీ వర్షానికి చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో అధికారులు ఎయిర్‌పోర్డును మూసివేశారు. దీంతో చెన్నై మీదుగా నడవాల్సిన విమానాలు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. నిన్నటి నుంచి ఏకంగా వెయ్యికిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగోకు చెందిన విమానాలే 550 రద్దయ్యాయి. ఎయిర్ ఇండియాకు చెందిన 16 విమానాలు, విస్తారాకు చెందిన 10 విమానాలు కూడా నిలిచిపోయాయి.
అయితే మంగళవారం ఉదయం వర్షం ఆగిపోవడంతో రన్‌వేపై ఉన్న నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇండిగో సంస్థ చెన్నై నుంచి తమ విమానాలను తిరిగి ప్రారంభించింది. విస్తారా కూడా తమ కార్యాకలాపాలను మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లడంతో విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేశారు. విశాఖ నుంచి నడవాల్సిన 23 విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వెల్లడించారు. విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నామని, అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీపీ 24 గంటలు పని చేస్తుందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.