Ammonium gas leak: 8 గ్రామాలు ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:27 AM
కోరమాండల్ ఎరువుల కర్మాగారం నుంచి అర్ధరాత్రి అమ్మోనియం గ్యాస్ లీకవటంతో 8 గ్రామాల ప్రజ లు ఊపిరి అందక

కోరమాండల్ ఎరువుల ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్
42 మందికి అస్వస్థత.. ఆరుగురి పరిస్థితి విషమం
చెన్నై, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కోరమాండల్ ఎరువుల కర్మాగారం నుంచి అర్ధరాత్రి అమ్మోనియం గ్యాస్ లీకవటంతో 8 గ్రామాల ప్రజ లు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరయ్యారు. కళ్ల మంటలు, వాంతులు, శ్వాస అందక పరుగులు తీశారు. 42 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతమైన ఎన్నూరులో మంగళవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఎన్నూరు పెరియకుప్పం ప్రాంతంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేరుతో ప్రైవేటు ఎరువుల కర్మాగారం ఉంది. విదేశాల నుంచి నౌకల ద్వారా మద్రాసు హార్బర్‌కు వచ్చే అమ్మోనియం గ్యాస్‌ను సముద్రం అడుగున అమర్చిన రెండు పైప్‌లైన్ల ద్వారా ఈ కర్మాగారానికి సరఫరా చేస్తారు. అయితే మంగళవారం అర్ధరాత్రి పైప్‌లైన్ ఉన్నట్టుండి పేలిపోయి అమ్మోనియం గ్యాస్ లీకైంది. దీంతో ప్రజల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే బాధిత గ్రామాల ప్రజలు భారీగా ఎరువుల కర్మాగారం వద్దకు చేరుకొని మూసేయాలంటూ బుధవారం ధర్నా చేపట్టారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ హరిత ట్రైబ్యునల్ జనవరి 2న విచారిస్తామని ప్రకటించింది.