Nipah Virus: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదు.. ఇప్పటివరకు ఎన్ని కేసులంటే..?

ABN , First Publish Date - 2023-09-14T09:36:56+05:30 IST

కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Nipah Virus: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదు.. ఇప్పటివరకు ఎన్ని కేసులంటే..?

తిరువనంతపురం: కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతో ప్రస్తుతం కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. అలాగే ఈ వైరస్‌తో ఇప్పటికే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. కేరళలో ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం 706 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. 77 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. హైరిస్క్ కేటగిరీలో ఉన్నవారికి ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. హైరిస్క్ కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది. 13 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వారికి తలనొప్పి వంటి తేలికపాటి లక్షణాలున్నాయి. నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని చర్యలను సమన్వయం చేసేందుకు కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించేందుకు వాలంటీర్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది.


మరోవైపు నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని బడులు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేయించారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. వ్యాధి గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని.. వ్యాధి వ్యాప్తి తక్కువగానే ఉన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని, వైరస్ పై టెస్టులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.

కోజికోడ్ జిల్లా కలెక్టర్ గీత మాట్లాడుతూ.. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు చెప్పారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు 43 వార్డులోని ప్రజలు బయటకి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అవసరమైన వస్తువులు, మందులు అమ్మే షాపులు మాత్రమే ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉంటుందని వివరించారు. నిత్యావసరాలు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పబ్లిక్ మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని గీత సూచించారు. ప్రభుత్వ సంస్థలు. విద్యాలయాలు, అంగన్ వాడీలు మూసేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సూచిస్తున్న ఆరోగ్య నిబంధనల్ని ప్రజలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-14T10:24:00+05:30 IST