Varun Gandhi : యోగి ప్రభుత్వానికి వరుణ్ గాంధీ వినతి
ABN , First Publish Date - 2023-04-12T15:02:13+05:30 IST
ఓ కొంగను కాపాడి, దాదాపు సంవత్సరంపాటు దానిని అల్లారుముద్దుగా పెంచుకున్న మహమ్మద్ ఆరిఫ్‌కు భారతీయ జనతా
లక్నో : ఓ కొంగను కాపాడి, దాదాపు సంవత్సరంపాటు దానిని అల్లారుముద్దుగా పెంచుకున్న మహమ్మద్ ఆరిఫ్‌కు భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) అండగా నిలిచారు. ఈ కొంగను కాన్పూరు జంతు ప్రదర్శనశాలలో పెట్టడంతో, దానిని తిరిగి ఆరిఫ్‌కు ఇచ్చేయాలని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
అటవీ శాఖాధికారులు ఈ కొంగను ఆరిఫ్ వద్ద నుంచి తీసుకుని, కాన్పూరు జంతు ప్రదర్శనశాలలో పెట్టారు. ఇది అంతరించిపోయే జాతి అని, సహజమైన వాతావరణంలో జీవించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. అయితే దీనిని జంతు ప్రదర్శనశాలలో పెట్టిన తర్వాత ఆహారం సక్రమంగా తినడం లేదని వార్తలు వచ్చాయి. ఆరిఫ్ ఆ కొంగను చూడటం కోసం ఆ జంతు ప్రదర్శనశాలకు వెళ్లినపుడు ఆ కొంగ చాలా ఆనందంతో ఎగురుతూ, ఎన్‌క్లోజర్ నుంచి బయటకు రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వరుణ్ గాంధీ ట్విటర్‌లో షేర్ చేశారు.
‘‘వారి ప్రేమ స్వచ్ఛమైనది. ఈ అందమైన పక్షి స్వేచ్ఛగా ఎగరడం కోసం ఉంది కానీ, బోనులో జీవించడానికి కాదు. దానికి తన ఆకాశాన్ని, స్వేచ్ఛను, స్నేహితుడిని తిరిగి ఇచ్చేయండి’’ అని తెలిపారు.
అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా ఆరిఫ్‌ను కలిశారు. బీజేపీ ప్రభుత్వం ఇతరులను ఏడిపించి సంతోషిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. వారికి ప్రేమ వాతావరణం ఇష్టపడదన్నారు. మనుషుల మధ్య ప్రేమను అయినా, మనిషి, పక్షి మధ్య ప్రేమను అయినా వారు ఇష్టపడరన్నారు. ఇతరులను ఏడిపించి సంతోషించాలనుకునేవారికి ఎన్నటికీ సంతోషం దక్కదన్నారు.
ఇదిలావుండగా, ఈ కొంగను ఆరిఫ్ ఎంతో ఆత్మీయంగా పెంచి, పోషించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆరిఫ్ మోటారు బైక్‌పై వెళ్తున్నపుడు కూడా ఈ కొంగను తీసుకొని వేళ్లేవాడని, అనేక మంది ఆ సన్నివేశాలను వీడియోలు తీశారని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
Heat wave:ఒడిశాలో తీవ్రమైన వేడిగాలులు...వచ్చే 5రోజులపాటు పాఠశాలలకు సెలవు