Uddhav Vs BJP: ఉద్ధవ్ 'గోద్రా' హెచ్చరికను తిప్పికొట్టిన బీజేపీ

ABN , First Publish Date - 2023-09-11T20:26:53+05:30 IST

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగవచ్చంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఉద్ధవ్ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే అభిలషించారనే విషయాన్ని గుర్తు చేసింది.

Uddhav Vs BJP: ఉద్ధవ్ 'గోద్రా' హెచ్చరికను తిప్పికొట్టిన బీజేపీ

న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya)లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా (Godhra) తరహా అల్లర్లు జరగవచ్చంటూ శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) చేసిన వ్యాఖ్యలను బీజేపీ (BJP) తిప్పికొట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఉద్ధవ్ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే అభిలషించారనే విషయాన్ని గుర్తు చేసింది. విపక్ష నేతలో (Uddhav) వివేకం మేలుకోవాలని రాముడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది.


జలగావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ, రామాలయ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రామభక్తులందరూ పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులలో అయోధ్యకు చేరుకుంటారని, అయితే తిరుగు ప్రయాణంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ''దాడులు జరగొచ్చు. ఏదో కాలనీలో వాళ్లు బస్సులు తగులబెట్టవచ్చు, రాళ్లు రువ్వొచ్చు...ఊచకోతలు చోటుచేసుకోవచ్చు. దేశంలో మళ్లీ మంటలు చెలరేగొచ్చు. ఈ మంటల్లోంచే తిరిగి రాజకీయ లబ్దికి వాళ్లు ప్రయత్నించవచ్చు'' అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చే జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు.


రవిశంకర్ ప్రసాద్ కౌంటర్..

ఉద్ధవ్ వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిన విపక్ష కూటమి కేవలం ఓట్ల కోసం అన్ని హద్దులను అతిక్రమిస్తారని అన్నారు. వారికి ఆ రాముడే వివేకం ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఉద్ధవ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, హుందాతనం లోపించిన వ్యాఖ్యలని, తాము వాటిని ఖండిస్తున్నామని చెప్పారు. బాలాసాహెబ్ ఉండి అంటే ఆయన సైతం తన కొడుకుకు ఏమి జరిగింది? ఎవరి ఆశీస్సులో ఆయన పెద్ద నేత అయ్యాడో మరిచిపోయాడంటూ బాధ పడతారని అన్నారు.

Updated Date - 2023-09-11T20:27:31+05:30 IST