Sridhar Babu: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:46 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు.

ఫ్యూచర్‌సిటీ అథారిటీలో.. కందుకూరు మండల గ్రామాలన్నీ కలిపేలా కృషి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
మహేశ్వరం, కందుకూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాల ఫలితంగానే ఇక్కడ ప్రపంచస్థాయి పరిశ్రమలు స్థాపితమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై లేనిపోని బురద జల్లాలని చూస్తున్నాయని, ఎవరు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రజలు, రైతులు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, టీయూఎ్‌ఫఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్‌సిటీ అథారిటీలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని అన్ని గ్రామాలను కలిపేందుకు కృషి చేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. మహేశ్వరం ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ఆయనకు కందుకూరు మండలంలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, పెద్దమ్మతండా, దావుత్‌గూడతండా గ్రామాలకు చెందిన అఖిలపక్ష పార్టీల నాయకులు ఫ్యూచర్‌సిటీ అథారిటీలో తమ తొమ్మిది గ్రామాలను కలపాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఈ విషయమై సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు.