Delhi mayor Elections: సుప్రీంకోర్టుకెక్కిన ‘మేయర్’ వివాదం
ABN , First Publish Date - 2023-01-26T16:00:48+05:30 IST
ఢిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా పడుతుండడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేయర్ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ (Dr Shelly Oberoi) సుప్రీంకోర్టును
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా పడుతుండడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేయర్ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ (Dr Shelly Oberoi) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఈ పిటిషన్‌ను రేపు (శుక్రవారం) విచారించే అవకాశం ఉంది.
మేయర్ ఎన్నికలు జరిగేలా చూడాలంటూ ‘ఆప్’ కోర్టును ఆశ్రయించడంపై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ (Praveen Shankar Kapoor) స్పందించారు. దీనంతటికీ కారణం ఆ పార్టీయేనని ఆరోపించారు. సభలో రభస చేయడం ద్వారా ఎన్నికలు జరగకుండా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ఎన్నికలు జరిపించాలంటూ కోర్టుకెక్కిందని ఎద్దేవా చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదని చెప్పారు. హౌస్ రెండుసార్లు వాయిదా పడడానికి ‘ఆప్’ నేతలే కారణమని అన్నారు.
ఢిల్లీకి మేయర్ ఉండడం ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal)కు ఇష్టం లేదని, మేయర్‌కు తనకంటే పేరు వచ్చేస్తే అది తన పదవికి ఎక్కడ ఎసరు తెస్తుందోనని భయపడుతున్నారని ప్రవీణ్ శంకర్ విమర్శించారు. కాగా, ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ‘ఆప్’ గతేడాది నవంబరులోనే ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా డాక్టర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ‘ఆప్’ మతియా మహల్ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమార్ ఆలే ముహమ్మద్ ఇక్బాల్‌ను పార్టీ నామినేట్ చేసింది. ఢిల్లీ మునిసిపల్(MCD) ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 104 స్థానాలకు పరిమితమైంది.