Digvijaya Vs Azad : గులాం నబీ ఆజాద్‌పై దిగ్విజయ సింగ్ తీవ్ర ఆరోపణలు

ABN , First Publish Date - 2023-04-05T16:15:58+05:30 IST

కాంగ్రెస్ పార్టీ పెద్దలను విమర్శిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్న జమ్మూ-కశ్మీరు నేత గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్

Digvijaya Vs Azad : గులాం నబీ ఆజాద్‌పై దిగ్విజయ సింగ్ తీవ్ర ఆరోపణలు
Ghulam Nabi Azad, Digvijaya Singh

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పెద్దలను విమర్శిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్న జమ్మూ-కశ్మీరు నేత గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) తీవ్ర ఆరోపణలు చేశారు. 40 సంవత్సరాలపాటు పార్టీలో ఉన్న తర్వాత ఆ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీజేపీ, మోదీ సాయంతో ఏం సాధించగలరని నిలదీశారు.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సొంతంగా డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (Democratic Progressive Azad Party)ని ఏర్పాటు చేశారు. ఆయన ‘ఆజాద్’ పేరుతో తన జీవిత చరిత్రను రాశారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ పార్టీ పట్ల తనకు చెడు అభిప్రాయం లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ (Indira Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పనితీరులో తేడాల గురించి వివరించారు.

మోదీ రాజనీతిజ్ఞుడు

మోదీ అసలు సిసలైన రాజనీతిజ్ఞుడని ఆజాద్ కితాబిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, హిజాబ్ వివాదం ఇలా అన్ని అంశాల్లో విమర్శలు చేసినా, కొన్ని బిల్లులు ఆమోదం పొందకుండా చేసినా మోదీ ఎప్పుడూ తనపై ప్రతీకారం తీర్చుకోలేదని ప్రశంసించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చిన్నపిల్లల వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సామాన్య ప్రజల్లో పట్టు లేదన్నారు.

రాహుల్ గాంధీకి బాసట

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుతో(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వస్తున్న వేళ గులాం నబీ ఆజాద్ తన మాజీ బాస్‌కు బాసటగా నిలిచారు. రాహుల్ గాంధీ అయినా, లాలూ ప్రసాద్ యాదవ్ అయినా, వేరొక ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా అత్యున్నత న్యాయస్థానం తేల్చేదాకా అనర్హత వేటు వేయరాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికిది సరైనది కాదన్నారు. క్రింది కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అనర్హత వేటు వేస్తే, పూర్తి పార్లమెంట్, మొత్తం అసెంబ్లీలు ఖాళీ అయిపోతాయన్నారు. కాంగ్రెస్ భావజాలంపై తనకు భిన్నాభిప్రాయాలు లేవన్నారు. ఆ పార్టీని నాశనం చేయాలని కానీ, ఆ పార్టీ గుట్టు రట్టు చేయాలని కానీ తాను కోరుకోవడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గులాం నబీ సోదరా! కాంగ్రెస్ పార్టీని మీరేం నాశనం చేస్తారు. ఆ పార్టీ గురించి మీరు బయటపెట్టేదేమిటి? మొదట కశ్మీరులో మీ పార్టీని కాపాడుకోండి. 40 ఏళ్లు పార్టీలో ఉన్న తర్వాత మీరు పార్టీకి ద్రోహం చేశారు. బీజేపీ, మోదీల ఊత కర్రల సాయంతో మీరేం సాధిస్తారు!’’ అని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Rahul Vs Scindia : రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింథియా మండిపాటు

Updated Date - 2023-04-05T16:15:58+05:30 IST