Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-07-05T16:01:11+05:30 IST

పవార్‌ల మధ్య పవర్ గేమ్‌లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్‌సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు.

Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

ముంబై : పవార్‌ల మధ్య పవర్ గేమ్‌లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్‌సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు. 83 ఏళ్లు వచ్చినప్పటికీ, ఇంకా రాజకీయాలు ఎందుకని శరద్ పవార్‌ను నిలదీశారు.

ఎన్‌సీపీలోని ఇరు వర్గాలు వేర్వేరుగా బుధవారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేశాయి. అజిత్ పవార్ ముంబైలోని బాంద్రా, ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలోనూ, శరద్ పవార్ వర్గం వైబీ చవాన్ సెంటర్‌లోనూ బుధవారం సమావేశమయ్యాయి.

అజిత్ పవార్ తన వర్గంతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, 2019లో శాసన సభ ఎన్నికల అనంతరం బీజేపీ, శివసేన ముఖ్యమంత్రి పదవి విషయంలో అభిప్రాయ భేదాలతో విడిపోయాయని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్‌సీపీ, బీజేపీ మధ్య చర్చలు జరిగాయన్నారు. ఐదుసార్లు బీజేపీతో ఎన్‌సీపీ సమావేశమైందని తెలిపారు. బీజేపీతో చేతులు కలిపేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారన్నారు. తమ వైఖరిని అంగీకరించాలని తాము శరద్ పవార్‌ను కోరామన్నారు. తమ వైఖరిని అంగీకరించకపోతే తమ నియోజకవర్గాల్లో తమకు సమస్యలు వస్తాయని చెప్పామన్నారు. బీజేపీతో చర్చలు జరపడానికి తనను, జయంత్ పాటిల్‌ను నియమించారని చెప్పారు. బీజేపీతో చర్చల కోసం నేరుగా వెళ్లవద్దని, కేవలం ఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడాలని శరద్ పవార్ తనకు చెప్పారన్నారు. అప్పటికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదన్నారు.

అయితే బీజేపీతో పొత్తు లేదని, శివసేనతో కలిసి వెళ్తున్నామని అకస్మాత్తుగా తనకు ఓ సమాచారాన్ని పంపించారని చెప్పారు. శివసేన కులతత్వ పార్టీ అని శరద్ పవార్ 2017లో ఆరోపించారన్నారు. అదే పార్టీతో కలిసి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ‘‘నన్ను ఎందుకు విలన్‌ని చేశారో నాకు తెలియదు’’ అన్నారు.

ఇతర పార్టీల్లో ఓ వయసు వచ్చేసరికి నేతలు తప్పుకుంటారని, యువతకు అవకాశం ఇస్తారని అన్నారు. మీరు కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. ‘‘మేం ఏమైనా తప్పులు చేస్తే మాకు చెప్పండి. మీ వయసు 83 సంవత్సరాలు, మీరు ఎప్పటికైనా ఆపుతారా? లేదా? మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అన్నారు. శక్తిమంతమైన కుటుంబంలో పుట్టకపోవడమే మా తప్పా? అని ప్రశ్నించారు.

శరద్ పవార్‌కు ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 2న ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలోని బాంద్రా, ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా శరద్ పవార్ వైబీ చవాన్ సెంటర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌సీపీని సొంతం చేసుకోవాలంటే కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. చీలికకు ముందు ఈ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ఎవరి వర్గంలో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే అంశంపై స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి :

Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు

Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-05T16:01:11+05:30 IST