Amit Shah : తమిళుడిని ప్రధాని చేద్దాం

ABN , First Publish Date - 2023-06-12T02:40:42+05:30 IST

వారసత్వ రాజకీయాలను నడుపుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడే 2జీ, 3జీ, 4జీ పార్టీలను పార్టీలను తరిమికొట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపిచ్చారు. వేలూరులో

Amit Shah : తమిళుడిని ప్రధాని చేద్దాం

ఇది నా చిరకాల కోరిక : అమిత్‌ షా

కాంగ్రెస్‌, డీఎంకేను తరమాలని పిలుపు

చెన్నై, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): వారసత్వ రాజకీయాలను నడుపుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడే 2జీ, 3జీ, 4జీ పార్టీలను పార్టీలను తరిమికొట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపిచ్చారు. వేలూరులో ఆదివారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉదయం బీజేపీ నిర్వాహకుల సమావేశంలోనూ మాట్లాడారు. కాంగ్రెస్‌, డీఎంకే 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. 2జీ అంటే 2జీ స్పెక్ట్రమ్‌ అవినీతి కాదని, రెండు తరాలని.. 3జీ అంటే మూడు తరాలని, 4జీ అంటే నాలుగు తరాలని.. తమిళనాట డీఎంకేకు చెందిన మారన్‌ కుటుంబీకులు రెండు తరాలపాటు అవినీతికి పాల్పడ్డారని, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా అవినీతికి పాల్పడుతోందని, కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌గాంధీ నాలుగో తరం కుటుంబీకుడని, నాలుగు తరాల పాటు దేశాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పి తమిళనాట భూమిపుత్రుడికి పట్టం కట్టే రోజులు చేరువలోనే ఉన్నాయని చెప్పారు. 2004 నుండి 2014 వరకు పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్‌, డీఎంకే కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. 18 ఏళ్లు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే.. రాష్టంలో ఎయిమ్స్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తిరుక్కురళ్‌ను 13 భారతీయ భాషల్లో అనువదించి తమిళ భాషకు పట్టం గట్టింది కూడా మోదీయేనని చెప్పారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్ఠించి తమిళులందరినీ గర్వపడేలా చేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. ‘‘ఓ తమిళుడిని ప్రధానిని చేయాలన్నదే తన చిరకాల కోరిక’’ అని షా చెప్పారు. భవిష్యత్‌లో ఓ తమిళుడిని ప్రధానిగా గెలిపిద్దామని పిలుపిచ్చారు. తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌, కాంగ్రెస్‌ మాజీనేత జీకే మూపనార్‌ ప్రధాని పదవిని చేపట్టేందుకు అవకాశాలు వచ్చినా.. డీఎంకే అడ్డుకుందని ఆరోపించారు.


Updated Date - 2023-06-12T02:41:02+05:30 IST