Trade War Impact On India: సుంకాల పోరులో ఇదీ మన కర్తవ్యం
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:18 AM
ప్రపంచ దేశాలు ట్రంప్ ప్రారంభించనున్న సుంకాల సమరం అనుసరిస్తాయా లేదా అన్నది ఏప్రిల్ 2, 2025న తేలుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇతర దేశాల నుంచి దిగుమతి సరుకులపై శిక్షాత్మక సుంకాలు విధించేందుకు భారత్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు

ప్రపంచ దేశాలు ఆధునిక పైడ్ పైపర్ (సుప్రసిద్ధ జర్మన్ జానపద గాథలో వేణువు ఊది పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లిన వ్యక్తి)ను అనుసరిస్తాయా లేదా అనేది ఏప్రిల్ 2, 2025న, ఆ తరువాత రోజుల్లో మనకు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్న సుంకాల సమరం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. లక్ష్యంగా పెట్టుకున్న ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన సరుకులపై అమెరికా, శిక్షాత్మక సుంకాలు విధిస్తే, ఆ చర్య ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) నిబంధనలను, బహు పక్షీయ వ్యాపార ఒడంబడికలను, అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుంది. అయితే అమెరికా 47వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చట్టాలను –అమెరికావి అయినా, ఇతర దేశాలవి అయినా– కించిత్ కూడా లెక్క చేసే వ్యక్తి కాదు. అసలు ఆయనకు ఆయనే ఒక చట్టం కదా. తన మాటను అందరూ ఒక శిలా శాసనంగా పాటించాలని ఆయన ఆశిస్తారు. శిక్షాత్మక సుంకాల విధింపునకు ట్రంప్ కొన్ని ‘టార్గెట్’ దేశాలను గుర్తించారు. ఆ దేశాల నుంచి ఎంపిక చేసుకున్న దిగుమతి సరుకులపై పెద్ద ఎత్తున సుంకాలు విధిచేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ట్రంప్ గుర్తించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నది.
దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించి, దేశి సరుకులతో పోటీ విదేశీ వస్తువులకు అవరోధాలు కల్పించేందుకు ఉద్దేశించినవే సుంకాలు. ఈ లక్ష్య పరిపూర్తికి సుంకాల (అంటే కస్టమ్స్ సుంకాలు)తో పాటు మరికొన్ని ఇతర పన్నులు (యాన్టి–డంపింగ్ డ్యూటీ అందుకొక ఉదాహరణ) కూడా విధించడం పరిపాటి. ప్రత్యేక పరిస్థితులలో వీటిని విధించడం ప్రతి దేశంలోను జరుగుతుంది. అయితే ఈ సుంకాలు లేదా పన్నులను సవాల్ చేయడమనేది సంబంధిత దేశీయ న్యాయస్థానాలలో మాత్రమే జరగాలి. కాగా అన్ని దేశాలలోను న్యాయస్థానాలు విదేశీ ఎగుమతిదారుల కంటే దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు అధిక ప్రాధాన్యమిస్తాయని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు సరుకుల నాణ్యతా ప్రమాణాల పరిరక్షణ, ప్యాకేజింగ్ ప్రమాణాలు, పర్యావరణ సంబంధిత మార్గదర్శకాలు పేరిట సుంకాలేతర అవరోధాలూ అమల్లో ఉంటాయి. ఈ స్వీయ లేదా స్వార్థ ప్రయోజనాన్నే సంరక్షణవాదంగా పరిగణిస్తారు. ‘స్వయం సమృద్ధి’ లేదా ‘స్వావలంబన’కు దోహదం చేసే మార్గాలలో ఒకటి సంరక్షణవాదం. ఈ సంరక్షణవాదాన్ని దేశ భక్తిగా తికమక పడకూడదు. ‘స్వయం సమృద్ధి’ వాదాన్ని ఆధునిక అర్థశాస్త్రం. అనుభావిక రుజువులు తిరస్కరించాయి. స్వయం సమృద్ధి అనేది ఒక మిథ్య. ఏ దేశమూ తన ప్రజలు ఆకాంక్షిస్తున్న, వినియోగిస్తున్న సరుకులు, సేవలు అన్నిటినీ ఉత్పత్తి చేయలేదు దేశీయ పరిశ్రమల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే దేశం అల్ప ఆర్థికాభివృద్ధిని మాత్రమే సాధిస్తుంది.
పెట్టుబడులను స్వల్పస్థాయిలో మాత్రమే సమకూర్చుకోగలుగుతుంది. నాసిరకం సరుకులను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది. తమ అభిరుచులకు అనుగుణంగా సరుకులను ఎంపిక చేసుకునేందుకు ప్రజలకు అవకాశముండదు. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు అందే సేవలు నాణ్యమైనవిగా ఉండవు. సంరక్షణవాద విధానాలు కాక, స్వేచ్ఛా విపణి విధానాలే ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదనశక్తులని గత యాభై సంవత్సరాల చరిత్ర నిర్ణయాత్మకంగా నిరూపించింది. ప్రపంచ సంపన్న దేశాలన్నీ పోటీదాయక ఆర్థిక విధానాలను, స్వేచ్ఛా వాణిజ్య పద్ధతులనూ అనుసరించినవే. భారత్ నాలుగు దశాబ్దాల పాటు సంరక్షణ విధానాలను అనుసరించింది. దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఫలితంగా మన ఎగుమతులు పరిమితమయ్యాయి. అంతకంతకూ కుదించుకు పోయాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఉన్నది. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్’ అన్న ఉన్నతాధికారి ఆధ్వర్యంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆ విభాగంలో ఉన్నారు. అయితే ఒక ప్రశ్నను ఎవరూ లేవనెత్తలేదు: ‘దిగుమతులపై నియంత్రణకు ఒక ప్రధానాధికారి ఉండడం అర్థం చేసుకోదగిన విషయమే. అయితే ఎగుమతుల నియంత్రణకు ప్రధానాధికారి ఎందుకు?’. విదేశీమారక ద్రవ్యం ఎంతగానో అవసరమున్న దేశంలో ఎగుమతులపై నియంత్రణకు ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారి ఎందుకు? ఈ ప్రశ్నను ఎవరూ అర్థం చేసుకోలేదు. 1991లో ఆర్థికమంత్రిగా డాక్టర్ మన్మోహన్‌సింగ్ నియమితులయ్యారు.
ఆయన ఆర్థిక విధానాలు సంరక్షణవాదాన్ని త్యజించేందుకు దారితీశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయింది. 1991–92లో ప్రకటించిన కొత్త విదేశీ వాణిజ్య విధానం కాలం చెల్లిన వాణిజ్య నిబంధనలకు స్వస్తి చెప్పింది. భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను పూర్తిగా అనుసరించడం ప్రారంభించింది. సంరక్షణ విధానాలు గతించిన చరిత్రగా మారిపోయాయి. ఆంక్షలను తొలగించారు. నియమ నిబంధనలను సరళీకరించారు. దిగుమతులపై సుంకాలను క్రమేణా తగ్గించారు. భారతీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పారిశ్రామిక వేత్తల నుంచి పోటీ ఎదురయింది. ఈ పోటీలో దేశీయ పారిశ్రామికవేత్తలు అద్భుత విజయాలు సాధించారు. ప్రపంచీకరణ విధానాలతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలు అపరిమితంగా సమకూరాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ మళ్లీ సంరక్షణవాదాన్ని అనుసరించడం ప్రారంభమయింది. స్వయం సమృద్ధి ఒక విచిత్ర పేరు–ఆత్మ నిర్భరత– ను సంతరించుకున్నది! ప్రపంచం ఎంతో మారిపోయిందన్న సత్యాన్ని గుర్తించడంలో మోదీ ప్రభుత్వం విఫలమయింది. అనేక దేశాలు తమ ‘తులనాత్మక అనుకూలత’లను కనుగొన్నాయి. ఆ సానుకూలతలను తమకు ప్రయోజనకరంగా వినియోగించుకున్నాయి. ‘సప్లై చైన్స్’ (ఉత్పత్తి, సరఫరా ప్రక్రియల పరంపర) అనే కొత్త పద్ధతి అమలులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ లాంటి ఒక పరికరం ఉత్పత్తి పూర్తిగా ఒక దేశంలో కాక, అనేక దేశాలలో జరగడం పరిపాటి అయింది. ఈ కొత్తఉత్పత్తి ప్రక్రియ సర్వసాధారణమైపోయింది. ‘మేడ్ ఇన్ జర్మనీ’, ‘మేడ్ ఇన్ జపాన్’ అనే ప్రతిష్ఠాత్మకత గతించిన విషయమైపోయింది.
అనేక వస్తువులు ‘మేడ్ ఇన్ ది వరల్డ్’గా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ ఆత్మనిర్భర్ సాధించిందేమిటి? త్యజించిన నియమ నిబంధనలు, లైసెన్స్‌ల విధానం, ఆంక్షలు, మరీ ముఖ్యంగా సుంకాలను పునః ప్రారంభించడమే కాదూ? సరే, ట్రంప్ మహాశయుడు రెండోసారి అధికారానికి వచ్చిన కొద్ది రోజులకే సుంకాల సమరానికి నాందిగా మొదటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై సుంకాలు పెంచాడు. అయితే వెనుకడుగు వేసి ఆ సుంకాల వసూలును వాయిదావేసి, అందుకు కొత్త తేదీ నిర్దేశించాడు. మార్చి 26న అటోమోబైల్స్, వాటి విడిభాగాల దిగుమతులపై భారీ సుంకాలు విధించాడు. ట్రంప్ నిర్ణయాలు, చర్యలకు భారత్ ప్రతిస్పందన ఇంతవరకు గోప్యంగా, ప్రతి చర్యలు చేపట్టే రీతిలో ఉన్నది. 2025–26 కేంద్ర బడ్జెట్‌లో సుంకాల తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య, ట్రంప్‌ను ఏమీ ప్రభావితం చేయలేదు. ఇండియాకు అనుకూలంగా ఆయన వైఖరిని మారగలదనే సూచనలు కనిపించడం లేదు. వైట్ హౌజ్ సమావేశంలో నరేంద్ర మోదీ మెరమెచ్చు మాటలు మాట్లాడారు. అయితే అవేమీ ట్రంప్‌ను సంతృప్తిపరచ లేదు. ద్రవ్య బిల్లును ఆమోదించిన సమయంలో డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (‘గూగుల్ ట్యాక్స్)ను ఉపసంహరించుకున్నారు. అమెరికాకు మరిన్ని రాయితీలు ఇచ్చే విషయమై మోదీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపివేయనున్న ట్రంప్ సుంకాల సమరాన్ని ఎదుర్కొనేందుకు ఇది సరైన దృక్పథమేనా? సరైనదనే భావన కలిగించే రీతిలో ప్రభుత్వ తీరు లేదు.
భారత్–అమెరికా పరస్పర ప్రయోజనాలకు మేలు కలిగే విధంగా సమస్త సుంకాల విషయమై సమగ్రంగా చర్చించాలి. తన స్నేహితుడు ట్రంప్ తత్వం మోదీకి బాగా తెలుసు కనుక సుంకాల విషయంలో తగ్గారు. ట్రంప్ నిర్దేశాలను పాటించేందుకు సుముఖమయ్యారు. అయితే భారత్ ప్రయోజనాలను సంరక్షించడంలో మోదీ సఫలమవుతారా లేదా అన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. ట్రంప్ ప్రారంభించనున్న సుంకాల యుద్ధంలో తన ప్రయోజనాలను రక్షించుకునేందుకు భారత్‌కు ఇతర దేశాల మద్దతు, సహాయ సహకారాలు ఎంతైనా అవసరం. అలాగే ఆ దేశాలకూ అమెరికాపై వాణిజ్య పోరులో విజయం సాధించాలంటే భారత్ మద్దతు తప్పనిసరి. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా ఈ సుంకాల పోరులో భారత్‌తో కలిసివచ్చే దేశాలు. భారత్ అనుసరించాల్సిన వివేకవంతమైన మార్గమేమిటి? ఒక కలెక్టివ్‌గా ఏర్పడేందుకు ఆ దేశాలకు నచ్చజెప్పి అంగీకరించేలా చేసేందుకు భారత్ పూను కోవాలి. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు సంఘటితమైన ఈ మిత్ర దేశాలతో సమష్టిగా చర్చలు జరిపేలా అమెరికాను ఒత్తిడి చేయాలి. ట్రంప్ ప్రభుత్వంతో చర్చల ద్వారా ప్రపంచ దేశాల సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఒక సమగ్ర ఒప్పందానికి రావాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)