DA Hike 2025: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:42 AM
కేంద్ర కేబినెట్ కేంద్ర ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపును, పెన్షనర్లకు డీఆర్‌ను ఆమోదించింది. రూ.37,216 కోట్లు ఖరీఫ్ ఎరువుల సబ్సిడీకి, రూ.22,919 కోట్లు నాన్ సెమీకండక్టర్ పరికరాల పీఎల్‌ఐ స్కీానికి మంజూరైంది. బిహార్లో కీలక సాగునీటి ప్రాజెక్టు కూడా ఆమోదించబడింది

డీఏ 2% పెంపు పెన్షనర్లకు డీఆర్ కూడా.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
ఖరీఫ్‌లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.37,216 కోట్ల సబ్సిడీ
నాన్-సెమీకండక్టర్ పరికరాల కోసం 22,919 కోట్లతో పీఎల్‌ఐ స్కీం
న్యూఢిల్లీ, మార్చి 28: కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త ప్రకటించింది. వారికి కరువు భత్యం (డీఏ), డిఎఫ్‌లను రెండు శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని రైల్వే, సమాచార,ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల మౌలిక వేతనం/పింఛనులో డీఏ, డీఆర్ 53 శాతంగా ఉన్నాయని.. ఇప్పుడవి 55 శాతానికి పెరిగినట్లు చెప్పారు. ఏడో వేతన సంఘం సిఫారసుల ఆధారంగా.. ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది. దీనివల్ల 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు.
ఎనిమిదో వేతన కమిషన్ ఏర్పాటుకోసం ఎదురుచూస్తున్న వీరికి ఇప్పుడు వేతనాలు, పెన్షన్లు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ పెంపు కారణంగా కేంద్ర ఖజానాపై ఏటా రూ.6,614.04 కోట్ల భారం పడుతుందని మంత్రి చెప్పారు. కాగా.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై రూ.37,216 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. డీఏపీ ఎరువుల ప్రస్తుత రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. రూ.22,919 కోట్లతో నాన్-సెమీకండక్టర్ ఎలకా్ట్రనిక్స్ పరికరాలకు ఉత్పాదక ఆధారిత రాయితీ (పీఎల్‌ఐ) స్కీంను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పరిశ్రమ ఎంతకాలంగానో ఈ నిర్ణయం కోసం ఎదురుచూస్తోందని, ఈ ప్యాకేజీ ఆరేళ్లు అమల్లో ఉంటుందని వైష్ణవ్ చెప్పారు. బిహార్లో అత్యంత కీలకమైన కోసీ మేచీ అంతర్గత అనుసంధాన ప్రాజెక్టును కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి కృషి సించయీ యోజన-సత్వర సాగునీటి లబ్ధి పథకం (ఏఐబీపీ) కింద దీనికి ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ పథకం అంచనా వ్యయం రూ.6,282.32 కోట్లు కాగా.. కేంద్రం బిహార్‌కు రూ.3,652.56 కోట్లు అందిస్తుంది. సాగునీరు, వరద నిర్వహణ కోసం ఇప్పుడున్న తూర్పు కోసి ప్రధాన కాలువను ఆధునికీకరించి.. కోసి నదిలో మిగులు జలాలను మహానంద బేసిన్‌లో సాగునీటి అవసరాలకు మళ్లించడం దీని ప్రధానోద్దేశం. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే నేపాల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. 2029నాటికి పథకం పూర్తవుతుందని, అరారియా, పూర్ణియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాల్లో 2.10 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందుతుందని చెప్పారు. డీఏ బకాయిలు ఏప్రిల్ వేతనంలో! పెరిగిన డీఏ/డీఆర్ బకాయిలను ఏప్రిల్ నెల వేతనంతో కలిపి అందిస్తారు. డీఏ పెంపుతో ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి. ఉదాహరణకు.. రూ.18 వేల మౌలిక వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి (ఈ ఏడాది జనవరి 1 నుంచి) ఇక ప్రతి నెలా రూ.360 పెరుగుతుంది. 18 వేల మౌలిక వేతనం, నెలనెలా రూ.30 వేల జీతం పొందుతున్న ఉద్యోగికి ఇక డీఏ కింద రూ.9,900 అందుతుంది.
lso Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..