పరాయి మగాళ్లతో మాట్లాడొద్దన్న భర్త.. కాఫీలో విషం కలిపిచ్చిన భార్య
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:16 PM
అనుజ్ భార్య గంటలు గంటలు పరాయి మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇది అతడికి నచ్చలేదు. భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై పరాయి మగాళ్లతో మాట్లాడవద్దని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. పగ పెంచుకున్న భార్య అతడ్ని చంపడానికి ప్లాన్ వేసింది.

రాఖీ సినిమాలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు, మారణకాండల గురించి ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఆ డైలాగును మార్చి మగాళ్ల గురించి చెప్పాల్సి వస్తోంది. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట మగాళ్లపై ఆడవాళ్లు దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తమకు నచ్చకపోతే ప్రాణాలు తీసేస్తున్నారు. మీరట్‌కు చెందిన ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. పెద్ద డ్రమ్‌లో సిమెంట్ పోసి శవాన్ని పూడ్చేసింది. ఆ తర్వాత కూడా చాలా దారుణాలు జరిగాయి. తాజాగా, వేరే మగాళ్లతో ఫోన్‌లో మాట్లాడవద్దు అన్న కారణంగా భర్తను చంపడానికి ప్రయత్నించింది ఓ మహిళ. భర్త తాగే కాఫీలో విషం కలిపింది.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఖతౌలీకి చెందిన అనుజ్ కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. అనుజ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య తరచుగా వేరే మగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. ఇది గమనించిన అనుజ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. పరాయి మగాళ్లతో గంటలు, గంటలు ఫోన్‌లో మాట్లాడొద్దని హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు అయ్యాయి. అనుజ్‌పై భార్య పగ పెంచుకుంది. అతడ్ని చంపడానికి నిశ్చయించుకుంది. అతడు తాగే కాఫీలో విషం కలిపి ఇచ్చింది. కాఫీ తాగిన అతడి ఆరోగ్యం బాగా క్షీణించింది.
కుటుంసభ్యులు అనుజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యులు అనుజ్ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, మరో సంఘటనలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు. వాళ్లకు అడ్డుగా ఉంటే తన ప్రాణాలు పోతాయని భావించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దగ్గరుండి వాళ్ల పెళ్లి చేశాడు. పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటానని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం