Cybercrime: సైబర్ నేరగాళ్ల వేధింపులకు వృద్ధ దంపతులు బలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:23 AM
సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి కర్ణాటకలో ఓ వృద్ధదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ పోలీసులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి రూ.6 లక్షలు వసూలు చేశారు. మరిన్ని డబ్బులు ఇవ్వకుంటే బ్లాక్‌మెయిల్ చేయడంతో, వారు తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణత్యాగం చేసుకున్నారు.

బెంగళూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల వేధింపులకు వృద్ధదంపతులు బలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడీ గ్రామానికి చెందిన రైల్వే రిటైర్డు ఉద్యోగి డియోగో నజరత్‌కు సైబర్ నేరగాళ్లు కొంతకాలంగా ఫోన్ చేస్తున్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులుగా పరిచయం చేసుకున్న వీరు డబ్బులు ఇవ్వాలని వేధించారు. సుమారు రూ.6 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. మరింత డబ్బు కావాలని, ఇవ్వకపోతే నగ్న చిత్రాలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామని, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ చూస్తారని వీడియోకాల్ చేసి బెదిరించారు. దిక్కుతోచని డియోగో నజరత్(83), ఆయన భార్య పావియా నజరత్(79) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఇద్దరూ నిద్రమాత్రలు మింగారు. భార్య మృతి చెందిన తరువాత, డియోగో నజరత్ కత్తితో గొంతు కోసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమకు వచ్చిన బెదిరింపుల గురించి డియోగో సూసైడ్ నోట్ రాసిపెట్టారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..