Tripura Elections 2023: అభివృద్ధికి బాటలు వేసిన బీజేపీ సర్కార్: మోదీ

ABN , First Publish Date - 2023-02-11T14:18:34+05:30 IST

త్రిపురను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న క్రెడిట్ బీజేపీ ప్రభుత్వానిదే దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..

Tripura Elections 2023: అభివృద్ధికి బాటలు వేసిన బీజేపీ సర్కార్: మోదీ

అగర్తలా: త్రిపుర (Tripura)ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న క్రెడిట్ బీజేపీ ప్రభుత్వానిదే దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలనలో త్రిపుర ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, బీజేపీ వచ్చాకనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. త్రిపురలో హింసకు తావులేకుండా చేసిన ఘనత తమదేనన్నారు. భయాలు, హింస నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశామని తెలిపారు. త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారంనాడు అంబస్సాలో‌ మోదీ తొలి ర్యాలీలో ప్రసంగించారు. మధ్యాహ్నం 3 గంటలకు గోమతిలోని రాధాకిషోర్‌పూర్‌లో మరో ర్యాలీలో మోదీ పాల్గోనున్నారు.

త్రిపురలో గతంలో పోలీసు స్టేషన్లన్నీ సీపీఎం అధీనంలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టబద్ధపాలన అమల్లోకి వచ్చిందని మోదీ అంబస్సా ర్యాలీలో అన్నారు. రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించామని, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. గ్రామాలను కలుపుతూ 5000 కిలోమీటర్ల మేర రోడ్లు వచ్చాయని, ఆప్టికల్ భైబర్, 4జి కనెక్టివిటీ గ్రామాలకు చేర్చామని చెప్పారు. గ్లోబల్ స్థాయికి త్రిపుర చేరుకుంటోందన్నారు. నౌకాశ్రయాలతో ఈశాన్య, త్రిపురలను అనుసంధానిస్తూ వాటర్‌వేస్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, బీజేపీ తెచ్చిన విజన్ డాక్యుమెంట్ కేవలం పేపర్ కాదని, ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఒకప్పుడు త్రిపురలో దిగ్బాంధాలు, తిరుగుబాట్లు మాత్రమే కనిపించేవని, ఇప్పుడు శాంతి, అభ్యుదయం, అభివృద్ధికి చిరునామాగా దూసుకువెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇచ్చామని, 107 కోట్ల మందికి సెటిల్‌మెంట్ కల్పించామని అన్నారు.

త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 55 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తక్కిన 5 సీట్లు తమ భాగస్వామ్య పక్షమైన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కి కేటాయించింది. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 60 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-02-11T14:26:28+05:30 IST