sri Krishna: రాగద్వేషాలే శత్రువులు

ABN , First Publish Date - 2023-06-09T02:31:12+05:30 IST

‘‘దోషపూరితమైన దృష్టి లేకుండా... శ్రద్ధాసక్తులై నా బోధలను పాటించేవారు సమస్తమైన కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ‘శ్రద్ధ’ అంటే సాధారణంగా ‘నమ్మకం’ లేదా ‘విశ్వాసం’ అని భావిస్తాం.

sri Krishna: రాగద్వేషాలే శత్రువులు

‘‘దోషపూరితమైన దృష్టి లేకుండా... శ్రద్ధాసక్తులై నా బోధలను పాటించేవారు సమస్తమైన కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ‘శ్రద్ధ’ అంటే సాధారణంగా ‘నమ్మకం’ లేదా ‘విశ్వాసం’ అని భావిస్తాం. కానీ అది వీటికి మించినది. మనకు సందేహాలు లేని, మన ప్రశ్నలన్నీ సమాప్తమయ్యే స్థితి. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చాలాకాలం పాటు మానవాళి విశ్వసించింది. అది తప్పనీ, సూర్యుడి చుట్టూ భూమే తిరుగుతోందనీ విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. కాబట్టి విశ్వాసం బాహ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ శ్రద్ధ ఆంతరంగికమైనది.

రెండోది.. విశ్వాసం ఎప్పుడు దానికి వ్యతిరేక ధ్రువమైన అవిశ్వాసంతో కలిసి ఉంటుంది. అంటే బొమ్మ విశ్వాసమైతే... బొరుసు అవిశ్వాసం. కానీ శ్రద్ధ రెండిటినీ అధిగమిస్తుంది. మూడోది... అంధ విశ్వాసం నిజాన్ని వినడానికి గానీ, తెలుసుకోడానికి గానీ ఇష్టపడదు. కానీ దీనికి విరుద్ధంగా... శ్రద్ధ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలదు. నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ ఇతరుల నుంచి అరువు తెచ్చుకోవచ్చు. శ్రద్ధ పూర్తిగా మన సొంత అనుభవాల వల్ల కలుగుతుంది.

‘‘సంపూర్ణత్వాన్ని సమగ్రంగా గ్రహించాలంటే... భిన్నమైన అనేక కోణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. భ్రాంతికి లోనైనవారు ఈ బోధలను పాటించరు. వారు నాశనమైపోతారు’’ అంటూ ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు మరింత అర్థమయ్యేలా చెప్పాడు. జ్ఞాని కూడా తన సొంత స్వభావం తాలూకు ధోరణుల ప్రకారం వ్యవహరిస్తాడు. ఎందుకంటే జీవించి ఉన్న ప్రాణులన్నీ తమ స్వభావాలను పాటిస్తాయి. ఆ స్వభావాలను అణచివేయడం సాధ్యం కాదని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.

మనలో ప్రతి ఒక్కరం కొన్ని ఆహారాలను ఇష్టపడతాం. మరి కొన్నిటిని ఇష్టపడం. వాసనలు, శబ్దాలు, అందం విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఒక వ్యక్తి అంటే కొందరికి ఇష్టం ఉంటుంది. మరికొందరికి ఉండదు. నేటి ఇష్టం రేపటికి అయిష్టంగా మారవచ్చు. లేదా దానికి విరుద్ధంగా జరగవచ్చు. ఈ ధోరణులకు అనేక సమర్థనలు ఉండవచ్చు. కానీ ఈ ధోరణులను మన శత్రువులుగా భావించాలని చెప్పాడు శ్రీకృష్ణుడు. ప్రతి ఇంద్రియ వస్తువులోనూ రాగం, ద్వేషం దాగి ఉంటాయి. మనుషులు ఆ రెండిటికీ వశం కాకూడదు. ఎందుకంటే. మనిషి తనకు మేలు కలిగే మార్గంలో వెళుతున్నప్పుడు... రాగద్వేషాలు అతనికి విఘ్నం కలిగించే మహా శత్రువులు’’ అన్నాడు కృష్ణుడు.

Untitled-7.gif

• కె.శివప్రసాద్‌, ఐఎఎస్‌

Updated Date - 2023-06-09T02:44:17+05:30 IST