Share News

Darmapatham : భయనివారకం బోధిచిత్తం

ABN , First Publish Date - 2023-12-08T03:37:40+05:30 IST

నేటి మన జీవితాల్లో భౌతికత్వం తాండవిస్తోంది. అందుకే మనం మనస్సు కన్నా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన ప్రాచీన భారతీయులందరూ శరీరం కన్నా మనసుకే

Darmapatham : భయనివారకం బోధిచిత్తం

నేటి మన జీవితాల్లో భౌతికత్వం తాండవిస్తోంది. అందుకే మనం మనస్సు కన్నా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన ప్రాచీన భారతీయులందరూ శరీరం కన్నా మనసుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నేడు మనం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాం కానీ... మనస్సును ఆరోగ్యవంతంగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించడం లేదు. స్నానం చేస్తే... మలినపడిన శరీరం శుభ్రపడుతుంది. మరి మలినమైన మనస్సు ఎలా శుభ్రపడుతుంది? మలినమైన మనస్సు ఋజుప్రవర్తన వల్ల శుభ్రమవుతుంది. ఈ విషయం మనం ఆలోచిస్తున్నామా?

మనో నిగ్రహాన్ని ఎలా పెంచుకోవాలో బుద్ధుడు చక్కగా వివరించాడు. ధర్మపదం ప్రారంభమయ్యేదే మనో విశ్లేషణతో. మనస్సు, చిత్తము పర్యాయపదాలు. ‘‘ప్రపంచంలో దేన్ని నిగ్రహిస్తే మిగిలినవన్నీ నిగ్రహంలో ఉంటాయో అదే చిత్తము’’ అని ‘అంగుత్తరనికాయం’లోని ‘ఏకక నిపాతం’లో బుద్ధుడు చెబుతాడు. స్థవిరవాదం ప్రకారం ఎవరికి వారు వ్యక్తిగతంగా చిత్త నిగ్రహాన్ని సాధించాలి, తద్వారా అర్హతత్వాన్ని సంపాదించాలి. అర్హతుడు అంటే అందరికన్నా శ్రేష్టుడు. మహాయానంలో సమస్త ప్రజల దుఃఖాలనూ అంతం చేసి, వారి ముక్తికోసం తహతహలాడేవాడే బోధిసత్త్వుడు. అయితే ప్రజలకు సమ్యక్‌-దర్మాన్నీ, సమ్యక్‌-జ్ఞానాన్నీ బోధించి, వారిని ప్రాపంచిక సుఖాలకు అతీతులుగా చేసి... నిర్వాణంవైపు పయనించేవారుగా చేయడం అంత సులువైన పని కాదు. దానికోసం బోధిసత్త్వుడికి బోధిచిత్తం అవసరం. అంటే బుద్ధుడు ఎలాంటి చిత్త స్థితిని సంపాదించాడో... అలాంటి చిత్త స్థితిని సంపాదించడానికి బోధిసత్త్వుడు ప్రయత్నిస్తాడు. తాను కూడా బుద్ధుడిగా మారాలని ప్రయత్నిస్తాడు. అదే బోధి చర్య.

బోధిచిత్తం ఒక అద్భుతమైన మానసిక స్థితి. అది జగదానందానికి బీజం. అది సర్వార్థసాధని. బోధిచిత్తం వల్ల మనిషి అజేయమైన స్థితికి చేరుకుంటాడు. అతణ్ణి ఎవరూ బాధపెట్టలేరు. ఎవరూ జయించలేరు. ఎందుకంటే ప్రపంచంలోని అందరి దుఃఖాలు బోధిసత్వునివే. అతడు కారుణ్యమూర్తి. కారుణ్యం అణువణువునా నిండిన నిరామయుడు బోధిసత్త్వుడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే నాలుగు బ్రహ్మవిహారాలతో బోధిసత్త్వుడు ప్రపంచాన్ని జయిస్తాడు. వీటిలో కరుణకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు. మన ప్రాచీన భారతీయ ఆచార్యులు ఈ కరుణామయ స్ఫూర్తితోనే విశ్వ విజయాన్ని సాధించారు. దిగ్దిగంతాలలో అనంతమైన ఖ్యాతిని ఆర్జించి, భగవత్‌ స్వరూపులయ్యారు. ఈ అజేయమైన బోధిచిత్తాన్ని సాధించాలనుకున్న వ్యక్తి... దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన ప్రజ్ఞా పారమితలనే షట్పారమితలను సాధించాలి. వాటిని అభ్యసించాలి. వాటిలో చివరిదైన ప్రాపారమిత... సామాన్యుణ్ణి స్థితప్రజ్ఞుడిగా మార్చగలిగే శక్తి కలిగినది. ప్రజ్ఞవల్లే బుద్ధత్వం ప్రాప్తిస్తుంది. ఈ విషయాలన్నీ ‘ఆర్య గండవ్యూహసూత్రం’లో స్పష్టంగా వివరించి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా అలముకున్న అంధకారం ఒక ప్రదీప ప్రకాశంతో ఎలా పటాపంచలవుతుందో... అలాగే మనిషి అనేక కల్పాలలో సంచయం చేసుకున్న (పోగుచేసుకున్న) అజ్ఞానాన్ని బోధిచిత్త ప్రకాశంతో బోధిసత్త్వుడు నివారించగలుగుతాడు.

మనో నిగ్రహంపై మన దేశంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నా... మనస్సును ఉన్నది ఉన్నట్టుగా... అతి చక్కగా విశ్లేషించేది బౌద్ధ ధర్మమే. మనస్సు తాలూకు యదార్థమైన స్థితిని తెలుసుకుంటేనే మనం దాన్ని నిగ్రహించగలుగుతాం. ఆ తరువాత ధ్యానం కూడా సాధ్యమవుతుంది. మనస్సును మనం నిరంతరం రక్షించుకోవాలి. బోధిసత్త్వుడు బోధిచిత్తాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు... ఎంతోమంది దుర్జనులు ఆటంకాలను సృష్టిస్తారు. ఈ ప్రపంచంలో దుర్జనులకు కొదవ ఉండదు కదా! వారందరినీ జయించడం సాధ్యం కాదు. ఒక దుర్జునుణ్ణి జయిస్తే... మరో దుర్జనుడు ఉదయిస్తాడు. వారందరినీ నిర్మూలించడం కన్నా.... వారిపై మన మనసులో రగిలే కోపాగ్నిని మనమే చల్లార్చుకుంటే... ప్రపంచంలోని దుర్జనులందరూ నశించినట్టే కదా! మనిషి నలుగురిలో ఉన్నప్పుడు తన వ్రణాన్ని ఎలా రక్షించుకుంటాడో... అలాగే దుర్జనుల మధ్య ఉన్నప్పుడు తన చిత్తాన్ని కాపాడుకోవాలి. అప్పుడే బోధి చిత్తం సాధ్యపడుతుంది.

ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు

జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం

Updated Date - 2023-12-08T03:37:41+05:30 IST