Chandrababu Arrest : చంద్రబాబును హడావుడిగా అరెస్ట్ చేసి సీఐడీ అడ్డంగా బుక్కయ్యిందా.. ఈ లాజిక్ మరిచిపోయారే..!?
ABN , First Publish Date - 2023-09-09T20:10:15+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. బాబును ఎన్ని అక్రమకేసులు పెట్టయినా సరే ఇరికించాలని..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. బాబును ఎన్ని అక్రమకేసులు పెట్టయినా సరే ఇరికించాలని సీఎం జగన్ (CM Jagan) కుట్ర పన్నుతున్నారని తాజా పరిస్థితులను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. రెండు గంటలకు పైగా తాడేపల్లి సీఐడీ సిట్ ఆఫీసులోనే చంద్రబాబును అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. బాబును కడిగిన ముత్యంలా బయటికి తీసుకొస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) లేనిపోని ఆరోపణలు మోపి ఇగో, అహం చల్లార్చుకోవడానికే సీఎం ఇదంతా చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు భగ్గుమంటున్నారు.
ఇప్పుడు జరగబోతోంది..?
అరెస్ట్ అయితే చేశారుగానీ.. ఇప్పుడు వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) సంతకం కీలక సాంకేతిక అంశంగా మారింది. దీంతో గవర్నర్ సంతకం (Governor Signature) కోసం ప్రభుత్వ అధికారులు నానా హైరానా పడుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. దీంతో సీఐడీ అధికారుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ఎటుచూసినా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ గవర్నర్ అనుమతి కోసం ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో గవర్నర్ ఉండగా.. అధికారులు మాత్రం విజయవాడలో ఉన్నారు. దీంతో గవర్నర్ వద్దకు సంబంధిత ఫైల్‌ను తీసుకెళ్లేందుకు అధికారులు హైరానా పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. రాష్ట్రంలో అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టడానికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. మరోవైపు.. ఇప్పటికే గవర్నర్ అనుమతి ఉంటే ఆ పత్రాలు చూపించాలని దర్యాప్తు అధికారులను చంద్రబాబు డిమాండ్ కూడా చేశారు. గవర్నర్ అనుమతి లేకుంటే మాత్రం అక్రమ నిర్బంధమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అనుమతి లేకుంటే ఆ అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జగన్‌ను, ప్రభుత్వాన్ని, సీఐడీని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. చిన్న లాజిక్ దొరికింది ఇక అసలు సినిమా షురూ అవుతుందని టీడీపీ శ్రేణులు దుమ్మత్తిపోస్తున్నాయి.
ఆశ్చర్యపోయిన గవర్నర్!
కాగా.. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor On Chandrababu Arrest) ఆశ్చర్యం వ్యక్తం చేశారట. మాట వరసకైనా సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌ని గానీ, గవర్నర్ కార్యాలయంలో గానీ సీఐడీ అధికారులు (CID officials) సంప్రదించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి. 2018లో చేసిన చట్ట సవరణ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ, ప్రస్తుత గవర్నర్, 2021లో కేసు నమోదు చేసినప్పుడు ఉన్న గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఈ రోజు చంద్రబాబును అరెస్టు చేసిన వ్యవహారం కూడా గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఆదివారం ఉదయం 9.45 గంటలకు టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవబోతున్నారు. ఇవాళే అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహనిర్బంధం, అరెస్టులు చేయడంతో రేపటికి వాయిదా పడింది.
మొత్తానికి చూస్తే.. గవర్నర్‌కు ఇసుమంతైనా చెప్పకుండా సీఐడీ అధికారులు ముందుకెళ్లడంతో అనవసరంగా చిక్కుల్లో పడ్డారనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు గవర్నర్ దగ్గరికెళ్తే మొదటి ప్రభుత్వానికి.. ఆ తర్వాత అధికారులకు గట్టిగా చీవాట్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌పై పలు విషయాల్లో గవర్నర్ గుర్రుగా ఉన్నారట. ఇప్పుడు ఈ విషయంలో గవర్నర్ ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో హడావుడిగా అరెస్ట్ చేసిన అధికారుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైందట. అధికారులు గవర్నర్ దగ్గరికెళ్లాక నజీర్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో.. రేపు టీడీపీ నేతలు ఆయన్ను కలిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.