AP Politics : ఏపీ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్.. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్..!
ABN , First Publish Date - 2023-07-22T23:03:29+05:30 IST
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. (Vijay Kumar) తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.! టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఈయన కీలక శాఖలకు పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. (Vijay Kumar) తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.! టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఈయన కీలక శాఖలకు పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ను (CM YS Jagan Reddy) ప్రసన్నం చేసుకోవడానికే సరిపోయింది.!. ప్రభుత్వ కార్యక్రమాల్లో గత ప్రభుత్వాలను విమర్శించి మరీ జగన్ సర్కార్‌ను ప్రశసించి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆఖరికి జగన్‌ను ‘దేవుని బిడ్డ’ అని కూడా సంబోధించడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఎందుకిలా జగన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారనే విషయం అప్పట్లో తెలియరాలేదు కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. రాజకీయాల్లోకి రావాలన్నది విజయ్ చిరకాల కోరికట. అందుకే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్లాన్‌తో స్వామి భక్తి చాటుకున్నారని ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఇంతకీ ఇప్పుడెందుకీ విజయ్ ప్రస్తావన తెరపైకి వచ్చింది..? నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా..? వస్తే పోటీ చేస్తారా.. చేస్తే ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు సంగతి..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి సినీ నటులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు.. వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన అధికారులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ (GSRKR Vijay Kumar) చేరిపోయారు. కలెక్టర్‌గా, పలు కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రిటైర్ అయినా ప్రణాళికా శాఖలో కీలకమైన పదవి ఇచ్చి విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం కొనసాగించింది. ఆ తర్వాత వలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు, విద్యాశాఖలో ఇలా పలు శాఖల్లో తన పాత్ర పోషించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమైపోయారు.! ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్న విజయ్ కుమార్ శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎస్ జవహర్‌రెడ్డికి సమర్పించగా.. ఆయన ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో ఎం. గిరిజా శంకర్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పదవిలో ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్ సేవలో తరించిన ఈయన ఇక రాజకీయాల్లోకి వచ్చి శాశ్వతంగా సీఎం వెంట నడవాలని నిర్ణయించుకున్నారట. రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చూడాలని దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట విజయ్.
విజయ్ ప్లానేంటి..!?
ఐఏఎస్‌గా పలు శాఖలకు పనిచేసిన అనుభవం ఉన్న విజయ్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తన వంతుగా జగన్ రుణం తీర్చుకునేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతను పనిచేసిన నెల్లూరు, ఒంగోలు, విజయవాడలో దళిత, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన కూడా చేశారు. ఈ యాత్ర తడ నుంచి తుని వరకు (Tada to Tuni Padayatra) ఉంటుందంటూ పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో.. ముఖ్యంగా వైసీపీలో ఈయన గురించి పెద్ద చర్చే జరిగింది. ఆ యాత్రకు ‘ఐక్యత విజయపథం’ అని పేరు పెట్టడం గమనార్హం. రిలీవ్ కాకుండానే స్వామి భక్తి ప్రదర్శించడంపై విజయ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదివరకే ఈ వ్యవహారం అంతా జరగ్గా ఆయన్ను రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి శనివారం నాడు అధికారికంగా ఉత్తర్వులు రావడం గమనార్హం. ఉత్తర్వులు రాకమునుపే విజయ్ ఇలా పాదయాత్రకు సిద్ధం కావడంతో ఐఏఎస్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది.
ఇందుకే రాజకీయాల్లోకి..!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయ్ చేసిన అతి అంతా ఇంతా కాదు..! ప్రభుత్వం ఏం చెప్పినా సరే తల ఊపుతూ విధేయత చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రెండు చెబితే.. విజయ్ అంతకుమించే చేసుకుంటూ వచ్చారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.!. ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలను, గత ప్రభుత్వాలను విమర్శించారంటే ఇంతకుమించి చెప్పనక్కర్లేదు. అయితే.. ప్రభుత్వం మారితే కథ వేరేలా ఉంటుందని పసిగట్టిన విజయ్.. రాజకీయ అరంగేట్రం చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మాట జగన్ చెవిలో వేయగానే.. ప్రభుత్వం అంత చేసిన ఆయనకు మారు మాట చెప్పలేదట. దీంతో తన ఐఏఎస్ అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇలా ప్రభుత్వానికి మద్ధతుగా యాత్ర తలపెట్టబోతున్నారని గత వారం, పదిరోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తునే వార్తలు వస్తున్నాయి.
పోటీ ఇక్కడ్నుంచేనా..?
అయితే.. విజయ్ బాపట్ల (Bapatla) లేదా తిరుపతి (Tirupati) ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం బాపట్లకు నందిగామ సురేశ్ (Nandigam Suresh) ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకవేళ విజయ్‌ను ఇక్కడ్నుంచి పోటీచేయిస్తే ఈయన పరిస్థితి ప్రశ్నార్థకమే.! తిరుపతి ఎంపీగా గురుమూర్తి (MP Gurumurthy) ఉన్నారు. ఈ ఇద్దర్నీ జగన్ ఏరికోరి మరీ పార్టీలోకి తెచ్చుకుని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే ఈ రెండు స్థానాలపైనే విజయ్ చూపు ఉండటంతో మరి ఎవర్ని పక్కనెడతారో.. ఆ ఎంపీని ఎక్కడ్నుంచి మళ్లీ పోటీచేయిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా జగన్‌పై స్వామి భక్తి చాటుకున్న వారే.. ఇలా అందర్నీ పార్టీలోకి చేర్చుకున్నాక ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి. అయితే.. ఇలా అధికారులందర్నీ పార్టీలోకి ఆహ్వానించుకుంటూ పోతే అసలుకే ఎసరు ఎక్కడొచ్చి పడుతుందో అని వైసీపీ పెద్దలు డైలమాలో పడ్డారట. విజయ్ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే అభ్యర్థుల ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.