Gulab Jamuns: రూ.400 పలుకుతున్న 2 గులాబ్ జామ్‌లు.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-02-02T19:49:53+05:30 IST
గులాబ్ జామ్స్ (Gulab Jamuns) పేరు చెబితే చాలామంది నోట్లో నీళ్లూరిపోతాయి. తినే అవకాశమే వస్తే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఈ కోవకే చెందిన భూపేంద్ర అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో...
గులాబ్ జామ్స్ (Gulab Jamuns) పేరు చెబితే చాలామంది నోట్లో నీళ్లూరిపోతాయి. తినే అవకాశమే వస్తే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఈ కోవకే చెందిన భూపేంద్ర అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేందుకు ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో (Zomato) యాప్ ఓపెన్ చేసి హడలిపోయాడు. ఎందుకంటే కేవలం రెండంటే రెండు గులాబ్ జామ్‌ల రేటు ఏకంగా రూ.400 ఉంది. అయితే 80 శాతం డిస్కౌంట్ పోను రూ.80 లకే లభిస్తోందని గుర్తించి కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. ఒక్క గులాబ్ జామే కాదు.. 200 గ్రాముల గజర్ హల్వా (gajar ka halwa) అనే స్వీటు రేటు రూ.600 గా ఉంది. ఇది కూడా 80 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో రూ.120 లభించడం చూసి ఆశ్చర్యపోయాడు.
డిస్కౌంట్ల మాటున ఎంతటి మాయాజాలం ఉంటుందో తెలియజేసే పరిణామంపై భూపేంద్ర సోషల్ మీడియా వేదికగా వెటకారంగా స్పందించాడు. ‘‘ రూ.400 విలువైన 2 గులాబ్ జామ్‌లు, రూ.3000 విలువైన కేజీ గజర్ హల్వాలపై 80 శాతం డిస్కౌంట్. ఇంత చీప్‌గా రావడాన్ని నమ్మలేకపోతున్నాను. నిజంగా 2023లోనే జీవిస్తున్నానా?. 2023లో నివసిస్తున్న జనాల పట్ల జొమాటో చాలా ఉదారంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు.
ఈ పోస్ట్ ట్విటర్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. రూ.1000 విలువైన కోల్డ్ కాఫీ డిస్కౌంట్‌తో రూ.120కే లభిస్తోందని పేర్కొన్నాడు. మరోవ్యక్తి స్పందిస్తూ.. ‘ భారతీయులం ఎంత బద్ధకస్తులుగా మారిపోతున్నాం. తక్కువ రేటుకే ఇంటి దగ్గర వండుకోకుండా ఈ కంపెనీలను మిలియనీర్లను చేస్తున్నాం’ అని అన్నాడు. ఈ పోస్టుపై జొమాటో తక్షణమే స్పందించింది. ‘‘ హాయ్.. భూపేంద్ర. ఈ విషయాన్ని పరిశీలించాలనుకుంటున్నాం. ప్రైవేటు మెసేజ్ ద్వారా రెస్టారెంట్ వివరాలు తెలియజేయండి. రెస్టారెంట్ ధరలను నిర్ధారించేందుకు సంప్రదిస్తాం’’ అని పేర్కొంది.