Share News

Psycho Killer: ఒకరి తర్వాత మరొకరు.. వరుసగా 9 మంది మహిళల హత్య.. సైకో కిల్లర్ కోసం 250 గ్రామాల్లో సెర్చింగ్..!

ABN , First Publish Date - 2023-11-29T21:25:17+05:30 IST

సైకో కిల్లర్ వరుస హత్యలకు సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో సైకో పోలీసులకు దొరక్కుండా ఎంతో తెలివిగా హత్యలు చేస్తుంటాడు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా...

Psycho Killer: ఒకరి తర్వాత మరొకరు.. వరుసగా 9 మంది మహిళల హత్య.. సైకో కిల్లర్ కోసం 250 గ్రామాల్లో సెర్చింగ్..!
ప్రతీకాత్మక చిత్రం

సైకో కిల్లర్ వరుస హత్యలకు సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో సైకో పోలీసులకు దొరక్కుండా ఎంతో తెలివిగా హత్యలు చేస్తుంటాడు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆధారాలు సేకరించడంలో మాత్రం విఫలమవుతుంటారు. అయితే చివరకు ఎలాగోలా అతన్ని పట్టుకుని జైలుకు తరలిస్తారు. ఇది సినిమా సీన్ అయినా.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, యూపీలో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ సైకో కిల్లర్ (Psycho killer) ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా 9మందిని హత్య చేశాడు. పోలీసులు ప్రస్తుతం అతడి కోసం 250 గ్రామాల్లో సెర్చింగ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

యూపీలోని (UP) బరేరిలో సైకో కిల్లర్ వరుస హత్యలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బరేలీ జిల్లాలోని (Bareilly District) పలు ప్రాంతాల్లో ఇటీవల వరసగా 9 మంది మహిళలు ఒకే రీతిలో హత్య చేయబడ్డారు. ఈ ఘటనలన్నీ షాహీ, శిష్‌గడ్, ఫతేగంజ్ వెస్ట్‌‌లకు 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వీటిలో షాహీ ప్రాంతంలోని నదికి రెండున్నర కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ హత్యలు జరిగాయి. అది కూడా మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 7గంటల లోపు చోటు చేసుకున్నాయి. హత్యలు జరిగిన తీరును పరిశీలిస్తే..

Geyser: ఇంట్లో గీజర్‌ను వాడుతున్నా కూడా.. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదంటే..!


  • షాహిలోని పార్తాపూర్ గ్రామానికి చెందిన కళావతి జూన్ 5న అడవిలో చలనం లేకుండా పడి ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు కనిపించలేదు. అయితే ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదులూ రాకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకోలేదు.

  • కుల్చా గ్రామానికి చెందిన ధన్వతి అనే మహిళ జూన్ 19న షాహి రోడ్డు పక్కన ఉన్న చెరుకుతోటలో శవమై కనిపించింది. ఈమెను ఎవరో గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

  • జూన్ 30న షాహిలోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన ప్రేమవతి అనే మహిళ మృతదేహం చెరుకు తోటలో కనిపించింది. ఈమెను కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.

  • షాహిలోని ఖజురియా గ్రామానికి చెందిన కుస్మా మృతదేహం జూలై 22న పొలాల్లో లభ్యమైంది. ఈమెను కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు రాంపుర గ్రామానికి చెందిన రాజేంద్ర అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

  • షాహీస్ ఖేయుస్ గౌంటియాలో ఆగస్టు 19న భీమవతిని ఆమె భర్త హత్య చేసి, సజీవ దహనం చేశాడు. ఈ కేసులో పోలీసులు.. మృతురాలి భర్తను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

  • ఆగస్టు 23న షాహిలోని సేవా జ్వాలాపూర్ గ్రామానికి చెందిన వీరతి మృతదేహం అడవిలో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. ఈమెనూ గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

  • శిష్‌గఢ్‌లోని లఖింపూర్ గ్రామంలో అక్టోబర్ 31న 60 ఏళ్ల మహిళ చెరుకు తోటలో హత్యకు గురైంది. మెడకు కండువా చుట్టి హత్య చేసినట్లు తేలింది.

  • నవంబర్ 29న షాహిలోని ఖర్సైనీ గ్రామానికి చెందిన 60 ఏళ్ల దులారో దేవి అనే మహిళను కూడా చీరను మెడకు బిగించి హత్య చేశారు.

  • అదేవిధంగా నవంబర్ 26న శిష్‌గఢ్‌లోని జగదీష్‌పూర్ ప్రాంతంలోని పొలాల్లో ఊర్మిళ (55) అనే మహిళ మృతదేహం బయటపడింది. ఈమెను కూడా చీరతో మెడకు చుట్టి చంపారు.

ఇలా చాలా వరకు హత్యలన్నీ ఒకే విధంగా జరగడంతో ఒకే వ్యక్తి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సైకో కిల్లర్ సంచరిస్తున్నాడన్న సమాచారంతో గ్రామాల్లోని ప్రజలు రాత్రిళ్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వరుస హత్యలతో పోలీసులు ఉన్నతాధికారులు ఈ కేసులను సీరియస్‌గా తీసుకున్నారు. ఏడాది క్రితం వరకు జైలు నుంచి విడుదలైన ఖైదీల రికార్డులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Woman: ప్రియుడి ఫోన్‌లో 13,000 అశ్లీల ఫొటోలు.. తనవే కాకుండా వేరే మహిళలవి కూడా ఉండటం చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

Updated Date - 2023-11-29T21:29:41+05:30 IST