Share News

IND vs AUS: మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను ఊరిస్తున్న మైల్‌స్టోన్స్ ఇవే!

ABN , First Publish Date - 2023-11-28T07:53:36+05:30 IST

IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.

IND vs AUS: మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను ఊరిస్తున్న మైల్‌స్టోన్స్ ఇవే!

గువాహటి: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది. మంగళవారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లు మైల్‌స్టోన్ రికార్డులకు చేరువలో ఉన్నారు. ఈ జాబితాలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తోపాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ యాదవ్ 52 ఇన్నింగ్స్‌ల్లో 1,940 పరుగులు చేశాడు. సగటు 46గా ఉండగా.. స్ట్రైక్ రేటు 173గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. వేగంగా ఈ మార్క్ అందుకున్న మిడిలార్డర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అన్ని రకాల టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 1,956 పరుగులు చేశాడు. మరొక 44 పరుగులు చేస్తే 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటివరకు 149 వికెట్లు తీశాడు. దీంతో మరొక వికెట్ తీస్తే 150 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. కాగా అక్షర్ పటేల్ టెస్టుల్లో 50, వన్డేల్లో 59, టీ20ల్లో 40 వికెట్లు తీశాడు. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 149 సిక్సులు కొట్టాడు. మరొకటి కొడితే 150 సిక్సులను పూర్తి చేసుకుంటాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 100వ టీ20 మ్యాచ్. అలాగే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కలిపి మాక్స్‌వెల్‌ ఇప్పటివరకు 146 వికెట్లు తీశాడు. మరొక 4 వికెట్లు తీస్తే 150 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఇప్పటివరకు 247 వికెట్లు తీశాడు. మరొక 3 వికెట్లు తీస్తే 250 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. కాగా జంపా వన్డేల్లో 165, టీ20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-11-28T09:10:08+05:30 IST