Women's IPL Auction : కోట్లు కొల్లగొట్టేదెవరో?

ABN , First Publish Date - 2023-02-13T01:21:22+05:30 IST

భారత క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. తొలిసారి నిర్వహించనున్న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలం సోమవారం ఇక్కడ జరగనుంది. స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, టీనేజ్‌

Women's IPL Auction : కోట్లు కొల్లగొట్టేదెవరో?

మహిళల ఐపీఎల్‌ వేలం నేడు

కళ్లన్నీ స్మృతి, హర్మన్‌, షఫాలీపైనే అండర్‌-19 క్రికెటర్లపై ఆసక్తి

ముంబై: భారత క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. తొలిసారి నిర్వహించనున్న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలం సోమవారం ఇక్కడ జరగనుంది. స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మపై అందరి దృష్టీ నిలిచింది. కారణం.. ఈ ముగ్గురు ప్లేయర్లు రూ. కోటి మార్క్‌ దాటతారని అంచనాలుండడమే. విదేశీ క్రికెటర్లలో అలీసా హీలీ, బేత్‌ మూనీ, ఎలీసా పెర్రీ, నాట్‌ షివెర్‌, మేఘన్‌ షట్‌, డియాండ్ర డోటిన్‌ అత్యధిక ధర పలుకుతారని భావిస్తున్నారు. మొత్తం 409 మంది క్రీడాకారిణులు వేలం జాబితాలో ఉన్నారు. ఐదు జట్లు.. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌ 90 మందిని ఎంపిక చేసుకోనున్నాయి. మొదటి ఏడాది ఒక్కో ఫ్రాంచైజీ రూ. 12 కోట్లు వెచ్చించేందుకు బీసీసీఐ అనుమతించింది. ఒక్కో జట్టులో 18 మంది క్రికెటర్లు ఉంటారు. వీరిలో ఆరుగురు విదేశీ ప్లేయర్లు. 60 మంది భారత క్రికెటర్లు వేలం బరిలో నిలవగా.. వీరిలో కనీసం 20 నుంచి 25 మందికి మంచి రేటు లభించే చాన్సుంది. కనిష్ఠ బేస్‌ ధర రూ. 10 లక్షలుకాగా.. గరిష్ఠ రేటు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. టీమిండియా క్రికెటర్లందరితోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా క్రీడాకారిణులకు చక్కటి ధర లభించే అవకాశాలున్నాయి.

మొత్తం జట్లు: ఐదు

ఇవీ వేలం వివరాలు..

  • వేలంలో పోటీపడే క్రికెటర్లు: 409

  • వేలంలో ఉన్న భారత క్రికెటర్లు: 246

  • ఐసీసీ పూర్తి సభ్య దేశాల నుంచి విదేశీ ప్లేయర్లు: 155

  • అసోసియేట్‌ సభ్య దేశాల క్రీడాకారిణులు: 8

  • ఫ్రాంచైజీ ఖర్చు చేయాల్సిన గరిష్ఠ మొత్తం: 12 కోట్లు

  • ఫ్రాంచైజీ ఖర్చు చేయాల్సిన కనిష్ఠ మొత్తం: రూ. 9 కోట్లు

  • జట్టులో ఉండాల్సిన కనిష్ఠ సభ్యుల సంఖ్య: 15

  • జట్టులో గరిష్ఠ సభ్యుల సంఖ్య: 18

  • జట్టులో భారత క్రికెటర్ల గరిష్ఠ సంఖ్య: 12

  • జట్టులో విదేశీ ప్లేయర్ల గరిష్ఠ సంఖ్య: 6

  • క్యాప్డ్‌ క్రికెటర్ల గరిష్ఠ బేస్‌ ధర: రూ. 50 లక్షలు

  • క్యాప్డ్‌ కనిష్ఠ బేస్‌ ధర: రూ. 30 లక్షలు

  • అన్‌క్యా్‌ప్డ ప్లేయర్‌ కనిష్ఠ ధర: రూ. 10 లక్షలు

  • అన్‌క్యా్‌ప్డ ప్లేయర్‌ గరిష్ఠ ధర: రూ. 20 లక్షలు

వీరికి రూ. రెండు కోట్లు?

స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌, షఫాలీ వర్మ, ఆల్‌రౌండర్‌ దీప్తీశర్మలను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు ప్రధానంగా పోటీపడే అవకాశముంది. దాంతో వీరు ముగ్గురు రూ. 1.25 కోట్లనుంచి రూ. 2 కోట్ల వరకు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిగ్‌ హిట్టర్‌ రిచా ఘోష్‌, సీమర్‌ రేణుకా సింగ్‌పై కూడా జట్లు పెద్ద మొత్తం వెచ్చించే చాన్సుంది. అలాగే స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్‌, రాధా యాదవ్‌, సీమర్లు మేఘనా సింగ్‌, శిఖా పాండేపట్ల కూడా ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. విదేశీ టీ20 లీగ్‌లలో సత్తా చాటుతున్న జెమీమా రోడ్రిగ్స్‌ భారీ ధర పలకనుందని అంచనా వేస్తున్నారు. అన్‌క్యా్‌ప్డ క్రీడాకారిణుల విభాగంలో.. కశ్మీర్‌కు చెందిన జసియా అక్తర్‌, రైల్వే ప్లేయర్‌ స్వాగతికా రథ్‌కు మంచి రేటు దక్కనుందని అంచనా. అండర్‌-19 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టు విషయానికొస్తే..బ్యాటర్లు శ్వేత సెహ్రావత్‌, గొంగడి త్రిష, స్పినర్లు పర్షవీ చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, అర్చానా దేవి, సీమర్‌ టిటాస్‌ సంధు కోసం జట్లు బాగానే వెచ్చించే అవకాశముంది. ఐదు జట్లు కూడా ప్రధానంగా కెప్టెన్‌లపై దృష్టి సారించనున్నాయి. ఈ రేసులో స్మృతి, హర్మన్‌ కాక లెజెండరీ ప్లేయర్‌ మెగ్‌ లానింగ్‌, ఇంగ్లండ్‌ సారథి హీథర్‌ నైట్‌, కివీస్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ ఉన్నారు. అయితే టీమిండియా ప్లేయర్లనే సారథిగా నియమించుకోవాలని మూడు ఫ్రాంచైజీలు భావిస్తున్నట్టు సమాచారం. కాగా..ఐదు ఫ్రాంచైజీలలో మూడింటికి ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అనుభవం ఉంది. దాంతో డబ్ల్యూపీఎల్‌ వేలంలో ఎలా సాగాలో ఆ జట్లకు కొట్టినపిండి.

Updated Date - 2023-02-13T01:56:17+05:30 IST