Share News

Priyanka: తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్‌కు తెలుసు..

ABN , First Publish Date - 2023-11-19T14:08:55+05:30 IST

అదిలాబాద్ జిల్లా: గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని, ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని ప్రియాంక గాంధీ అన్నారు.

Priyanka: తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్‌కు తెలుసు..

అదిలాబాద్ జిల్లా: గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ (Indira Gandhi) ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని, ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. ఆదివారం ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ (Congress) విజయభేరి సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్‌కు తెలుసునని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్‌ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్‌ (CM KCR) పాలనలో ప్రజల స్వప్నం నెరవేరలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారతాయని ఉద్యమకారులు కలలు కన్నారని, యువతకు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఉద్యమకారుల కటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వైఫల్యం వల్లే యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రియాంక అన్నారు.

కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు పెద్దలకే రుణమాఫీ చేస్తారని, రైతులు, కార్మికుల రుణాలను మాత్రం మాఫీ చేయదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) కలిసే పనిచేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో జరిగే అవినీతిపై ప్రధాని మోదీ (PM Modi) ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్లలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-19T14:08:57+05:30 IST