Jobs: కొలువెప్పుడో?
ABN , First Publish Date - 2023-07-31T01:51:04+05:30 IST
రాష్ట్రంలో ఇంజనీరింగ్(Engineering) పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థుల(students) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మంచి ఐటీ ఉద్యోగం(IT job), లక్షల రూపాయల ప్యాకేజీలపై గంపెడాశలతో ఉన్న వారికి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ నిరీక్షణ..
భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లు
30 వేల కొత్త ఐటీ ఉద్యోగాలకు బ్రేక్!
ఎన్‌ఐటీ, ఐఐటీల్లోనూ తగ్గిన ప్యాకేజీలు
తప్పని పరిస్థితుల్లోనే వీటి నుంచి ఎంపిక
అమెరికా మార్కెట్, మాంద్యం ప్రభావం
హనుమకొండకు చెందిన అపర్ణ.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు సంబంధించి కళాశాలకు మంచి పేరుండటంతో టాప్ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం సాధించాలని అనుకుంది. ఏటా 20కి పైగా ప్రముఖ ఐటీ కంపెనీలు క్యాంపస్‌లో నియామకాలు చేపడుతుండగా.. ఈసారి చిన్నపాటి నాలుగైదు కంపెనీలు మాత్రమే వచ్చాయి. దీంతో అపర్ణ ఆశలు గల్లంతయ్యాయి. ఆఫ్ క్యాంపస్‌లో ఉద్యోగ వేట ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పరిణామం ఆమెపై ఒత్తిడి పెంచుతోంది.
నిజామాబాద్‌కు చెందిన ప్రణవ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సీఎ్‌సఈ చివరి సంవత్సరం పూర్తి చేరాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు కళాశాల పేరుగాంచడంతో భారీగా డొనేషన్ చెల్లించి మరీ ఈ కళాశాలలోనే చేరాడు. గతేడాది ఆ కళాశాలలో అంతంత మాత్రంగానే ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఈసారైనా ఆశించిన స్థాయిలో ప్లేస్‌మెంట్లు ఉంటాయనుకుంటే.. ఒక్క కంపెనీ అయినా క్యాంప్‌సవైపు కన్నెత్తి చూడలేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల సీజన్ ముగిసిపోయింది. దీంతో లక్షల రూపాయలు పోసి సీటు సంపాదించి చదువు పూర్తి చేసిన అతను తన ఉద్యోగ భవిష్యత్తుపై బెంగతో, ఆందోళనతో ఉన్నాడు.
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్(Engineering) పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థుల(students) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మంచి ఐటీ ఉద్యోగం(IT job), లక్షల రూపాయల ప్యాకేజీలపై గంపెడాశలతో ఉన్న వారికి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి. ఫలితంగా వారిపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల(Campus placements)లో ఎంపిక కాకపోవడంతో.. ఇక తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సమస్యలున్నా లక్షల రూపాయల డొనేషన్లు చెల్లించి పేరున్న కళాశాలల్లో సీట్లు సంపాదించుకున్న వారు ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయన్న ఆశతో ఉన్నారు. కాగా, పిల్లల ఉద్యోగాలకు సంబంధించి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 247 కాలేజీల్లో వేలాది మంది ఇంజనీరింగ్(Engineering) చదువుతున్నారు. వీటిలో 192 ప్రైవేటు కాలేజీలుండగా.. ఏటా 50-60 కాలేజీల్లో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తుంటాయి. దిగ్గజ ఐటీ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా.. వంటి కంపెనీలు ఏటా దాదాపు 10-15 వేల మందిని క్యాంప్‌సలనుంచి ఎంపిక చేస్తుండగా.. చిన్న, మధ్యతరహా కంపెనీలు మరో 25-30వేల మందిని ఎంపిక చేస్తూ ఉన్నాయి. కరోనా ప్రభావం(Carona effect)తో 2020, 2021 సంవత్సరాల్లో నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. గతేడాది పరిస్థితి కాస్త మెరుగుపడినట్టుగా కనిపించింది.
నిరుడు రాష్ట్రంలో దాదాపు 15-20వేల మంది ఫ్రెషర్లు క్యాంప్‌సలోనే అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నారు. ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు ఆశతో ఉండగా.. వారికి నిరాశే ఎదురవుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కంపెనీలు తమకు అవసరమైన ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవడానికిగాను క్యాంప్‌సల బాట పడతాయి. విద్యార్థుల టాలెంట్‌ను బట్టి ఎంచుకుని వారికి మంచి ప్యాకేజీని ఇస్తుంటాయి. అయితే అమెరికా ఐటీ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభంలో బడా కంపెనీలు వేలాదిగా ఉద్యోగాల్లో భారీ కోత విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాదికి కొత్త నియామకాలు సైతం ఉండవని అధికారికంగా ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో పెద్దగా నియామకాలు జరగలేదు. అమెరికా మాంద్యం ప్రభావం, కంపెనీల లాభాలు తగ్గుతుండటంతో ఉద్యోగుల కోతకే ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాల ఊసెత్తడం లేదు. కొవిడ్‌లో అకస్మాత్తుగా పెరిగిన భారీ డిమాండ్ కారణంతో కంపెనీలు ఐటీ ఉద్యోగులను పెద్దఎత్తున నియమించుకున్నాయి.
అయితే కొవిడ్ తర్వాత అనుకున్నంత వ్యాపారం పుంజుకోలేకపోవడంతో ఉన్న ఉద్యోగులను భరించడం కంపెనీలకు భారంగా మారింది. దీంతో ప్రతి ఏటా రాష్ట్రంలో 30-40వేల మంది ఉద్యోగులను క్యాంప్‌సల నుంచి ఎంపిక చేసుకునే కంపెనీలు..ఈసారి నియామకాలను భారీగా తగ్గించుకున్నాయి. ఈ ఏడాది కొన్ని చిన్న, మధ్యతరహా కంపెనీలు మాత్రమే రాష్ట్రంలో దాదాపు 10వేల మందిని ఎంపిక చేసుకున్నాయని, దాదాపు 30వేలకుపైగా కొత్త ఉద్యోగాలకు కోత పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలు ఫ్రెషర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని, ఆఫ్ క్యాంప్‌సలోనూ కొత్త నియామకాలు తక్కువగా ఉండటంతో పట్టభద్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అమెరికా మాంద్యం ప్రభావం భారత మార్కెట్‌పై పడటంతో మరో ఏడాదిపాటు క్యాంప్‌సలో కొత్త నియామకాలు ఇలాగే ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి అంచనాలు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి.
ప్యాకేజీల్లో కోతలు...
రాష్ట్రంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అందరి దృష్టిని ఆకర్షించే విద్యాసంస్థ వరంగల్‌లోని ఎన్‌ఐటీ. అత్యధిక ప్యాకేజీలను ప్రతి ఏటా ఇక్కడి విద్యార్థులే అందుకుంటున్నారు. భారీ వేతనాలతో కూడిన ఆఫర్ లెటర్లు అందుకోవడంతో ఈ విద్యాసంస్థ పేరు గడించింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి మార్చి, ఏప్రిల్, మేలో ప్లేస్‌మెంట్లు జరిగాయి. ఒకరిద్దరు విద్యార్థులు రూ.80లక్షల వార్షిక ప్యాకేజీలను అందుకున్నారు. కానీ..సరాసరి ప్యాకేజీ మాత్రం చాలావరకు తగ్గింది. గతేడాది ఎన్‌ఐటీ క్యాంప్‌సలో మొత్తం విద్యార్థుల్లో 78శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లతో ఎంపికవ్వగా.. ఈ ఏడాది 82శాతం మంది ఎంపికయ్యారు. ఇక్కడ గతేడాదితో పోలిస్తే నియామకాలు 4శాతం పెరిగినా ప్యాకేజీలు మాత్రం భారీగా తగ్గాయి. గతేడాది ఎంపికైన 1,132 విద్యార్థుల సరాసరి వేతనం రూ.25.5లక్షలు ఉండగా, ఈసారి రూ.17.29 లక్షలకు తగ్గింది. మధ్యస్థ ప్యాకేజీ (మీడియన్) గతేడాది రూ.25.4 లక్షలుగా ఉండగా ఈసారి అది రూ.12.6 లక్షలు మాత్రమే ఉంది. ఐఐటీ హైదరాబాద్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది అత్యధిక ప్యాకేజీ రూ.51 లక్షలు ఉండగా.. గతేడాది రూ.65లక్షలతో పోలిస్తే రూ.14లక్షలు తక్కువగా ఉంది. అలాగే ఎంపికైన మొత్తం విద్యార్థుల్లో సరాసరి ప్యాకేజీ ఈసారి రూ.27.11 లక్షలు ఉండగా.. గతేడాది రూ.29.76 లక్షలుగా ఉంది. బడా కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల నుంచి కొందరిని ఎంపిక చేసుకుంటున్నా.. గతంలో మాదిరిగా భారీ వేతనాలు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేవని నిపుణులు పేర్కొంటున్నారు.