CM Kcr: బాబు అరెస్ట్‌పై కేసీఆర్ ఆరా! స్వయంగా ఆ కామెంట్లు పరిశీలస్తూ..!
ABN , First Publish Date - 2023-09-12T03:37:16+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు విషయమై మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్‌తెలుసుకుంటున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా ..
మినిట్ టూ మినిట్ అప్‌డేట్ తెలుసుకుంటున్న తెలంగాణ సీఎం
సోషల్ మీడియా కామెంట్ల పరిశీలన
ఏపీ వాళ్లకు ఫోన్ చేయించి మరీ ఆరా!
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై (ChandraBabu arrest) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr)ఆరా తీస్తున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు విషయమై మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్‌తెలుసుకుంటున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాసులకు ఫోన్ చేయించి మరీ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అఖరికి సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టుపై నెటిజెన్స్ పెట్టిన కామెంట్స్‌ను కూడా సీఎం కేసీఆర్ చదువుతున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బాబు అరెస్టుపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు కేసీఆర్ సామాజిక మాధ్యమాలను చూస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక స్కిల్ డెవల్‌పమెంట్ కేసు, దాని పూర్వాపరాల గురించి కూడా సీఎం కేసీఆర్ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. బాబు అరెస్టు పరిణామాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కూడా కేసీఆర్ బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చంద్రబాబు అరెస్టును అధికార బీఆర్‌ఎస్ నిశితంగా గమనిస్తోంది. దీనిపై ఇంతవరకు ఏ ఒక్క నేత కూడా పెదవి విప్పలేదు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పార్టీ నేతలంతా ఆసక్తిగా చూపుతున్నారు.
అంతర్గతంగా ఈ పరిణామాలపై చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే చంద్రబాటు అరెస్టుపై బహిరంగంగా స్పందించారు. అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణలోని ఓటర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు? బీఆర్‌ఎస్ గురించి ఏమనుకుంటున్నారు? అన్న విషయాలను కొందరు కీలక నేతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశంలో ఉన్న ఓటర్లంతా తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. వారంతా బాబు అరెస్టు విషయంలో ఏమనుకుంటున్నార్న విషయాన్ని కూడా బీఆర్‌ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్ అన్ని విధాలా సహకరించిందన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌రెడ్డి తన కక్ష తీర్చుకునేందుకే చంద్రబాబును అరెస్టు చేయించారన్న అభిప్రాయం తెలంగాణలోని మెజార్టీ పాత తెలుగుదేశం కేడర్‌లో నెలకొంది. ఆ అభిప్రాయంతో ఉన్న వారంతా రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై ఎటువంటి ప్రభావం చూపుతారోనన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.