అంధకారంలో పీహెచ్‌సీ..

ABN , First Publish Date - 2023-01-07T01:01:57+05:30 IST

గుడిమల్కాపూర్‌ పరిధిలోని పీహెచ్‌సీ అంధకారంలో ఉండడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంధకారంలో పీహెచ్‌సీ..

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

కార్వాన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గుడిమల్కాపూర్‌ పరిధిలోని పీహెచ్‌సీ అంధకారంలో ఉండడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుడిమల్కాపూర్‌ పరిధిలోని ఉషోదయకాలనీలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రి మొత్తం చీకటిగా ఉండడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. చీకట్లో రోగులకు ఎలా వైద్యసేవలు అందిస్తున్నారని, రోగులు పడే ఇబ్బందులు పట్టవా అంటూ వైద్యులను నిలదీశారు. మూడు నెలలుగా వైరింగ్‌ కాలిపోయి కరెంట్‌ సరఫరా నిలిచిపోయిందని డాక్టర్లు తెలిపారు. దీంతో మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గర్భిణులు, చిన్న పిల్లలు, డాక్టర్ల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పీహెచ్‌సీలకు నిధులు అందజేస్తుంటే మరమ్మతులు ఎందుకు చేయించడం లేదన్నారు. నిధులు లేకుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి కరెంట్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కిషన్‌రెడ్డి పలువురు పేషెంట్లు, మహిళలతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉషోదయ కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T01:02:00+05:30 IST