గులాబీ జెండాతోనే

ABN , First Publish Date - 2023-04-25T23:53:14+05:30 IST

రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టలేదని, ఈ ప్రాంతంలో జరుగుతున్న వివక్ష, వెనుకబాటుతనాన్ని చూసి, తెలంగాణ వస్తేనే మన బతుకులు మారతాయని రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

గులాబీ జెండాతోనే
ప్లీనరీలో ప్రసంగిస్తున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

దేశానికి కేసీఆర్‌, రాష్ర్టానికి కేటీఆర్‌ బలమైన నాయకులు

కాంగ్రెస్‌, బీజేపీ సర్వేలోనూ టీఆర్‌ఎస్‌దే అధికారమని తేలింది

అవకాశం దొరికితే అబాసుపాలు చేయాలని విపక్షాల కుట్ర

ఓపిక పట్టండి.. అందరికీ అవకాశాలు వస్తాయి

బీఆర్‌ఎస్‌ ప్లీనరీలో మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25: రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టలేదని, ఈ ప్రాంతంలో జరుగుతున్న వివక్ష, వెనుకబాటుతనాన్ని చూసి, తెలంగాణ వస్తేనే మన బతుకులు మారతాయని రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం సాధించిన జెండా అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజకీయ పార్టీగా ఏర్పడి, వచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జేజేఆర్‌ గార్డెన్‌లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమా వేశాన్ని నిర్వ హించారు. సమావేశం ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళర్పించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశానికి కేసీఆర్‌, రాష్ట్రానికి కేటీఆర్‌ లాంటి బలమైన నాయకులున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. తుపాకీ గుళ్ళకు బెదరలేదని, ప్రాణాలను సైతం తృణపాయంగా వదులుకుని రాష్ట్రం సాధించామని అన్నారు. ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదని చెప్పారు. తెలంగాణకు ముందు, తెలంగాణ తరువాత రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది కేసీఆర్‌ అని చెప్పారు. కేసీఆర్‌ లేకుండా ఆసరా, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, కల్యాణలక్ష్మి వంటి పథకాలు వచ్చేవా అని ప్రశ్నించారు. ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన పట్ల విశ్వాసంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలో చేసుకున్న సర్వేలోనే టీఆర్‌ఎస్‌దే అధికారమని తేలిందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేం దుకు ఆ పార్టీలు ఛాన్స్‌ దొరికితే ప్రజల్లో అబాసు పాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, వారికి దిమ్మతిరిగేలా, ఐక్యంగా వారి ఎత్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, ఎంకన్న, కోరమోని వెంకటయ్య, గోపాల్‌యాదవ్‌, అబ్దుల్‌రహమాన్‌, కృష్ణమోహన్‌, తాటిగణేష్‌, పోతుల గిరిధర్‌రెడ్డి, శివరాజు, చెరుకుపల్లి రాజే శ్వర్‌, శాంతన్న యాదవ్‌, వినోద్‌కుమార్‌, సుదీప్‌ రెడ్డి, వనజ, కె ఆంజనేయులు, సుధాశ్రీ, విజయలక్ష్మి, బాలరాజు, వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

80 శాతం సినిమా ముందుంది

పాలమూరులో జరుగుతున్న అభివృద్ధి ఇప్పుడు 20 శాతమే జరిగిందని, ఇంకా ముందు 80 శాతం సినిమా ఉంటుందని అన్నారు. ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని తెలిపారు. పాలమూరు వెళ్లి ఒకట్రెండ్రోజులు ఉల్లాసంగా గడిపివద్దామనేలా చేస్తామని వెల్లడించారు. పార్టీలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందరికీ గుర్తింపు, అవకాశాలు దక్కుతాయని, ఓపిక ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. 70 ఏళ్లు పాలించిన నాయకులు ప్రజల కోసం, జిల్లా కోసం చేసిందేమీ లేదన్నారు. తమ కోసం, తమ ఇంటి కోసం పనిచేసుకున్నారే తప్ప.. ఓట్లేసిన వాళ్లూ తమ కుటుంబమే అని ఆలోచన చేయలేదని విమర్శించారు. గతం గురించి మాట్లాడితే దుఖం వస్తుందని, భవిష్యత్‌ బాగు చేద్దామని చూస్తుంటే ఏదోరకంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.10 వేల కోట్లతో ఐటీ పార్క్‌లో అమర్‌రాజా గిగాసెల్‌ లిఽథియం పరిశ్రమ తీసుకువస్తుంటే ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 వేల మందికి ఉద్యోగాలిచ్చే ఈ పరిశ్రమను తమిళనాడు సీఎం తమ దగ్గర పెట్టాలని అడిగారని, కేటీఆర్‌ సిరిసిల్లలో పెట్టాలని అంటే తాను మాట్లాడి ఇక్కడికి తెచ్చానన్నారు. దీనిపై విష ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రలు చేస్తున్నా మనం మౌనం పాటించడం సరికాదని అన్నారు. మే 6న కేసీఆర్‌ ఐటీని ప్రారంభిస్తున్నారని, ఆరు విదేవీ కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయని వివరించారు.

తీర్మానాలు

ప్లీనరీలో 14 తీర్మానాలు ప్రవేశపెట్టిగా, పార్టీ శ్రేణులు బలపరిచారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ, బీసీ గణన చేపట్టాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టవద్దని, దేశ వ్యాప్తంగా దళితబంధు ప్రవేశపెట్టాలని, పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని వేధింపులు ఆపాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, గొర్రెలు, చేపల పంపిణీని దేశ వ్యాప్తంగా చేపట్టాలనే తీర్మానాలను ప్రవేశపెట్టారు.

Updated Date - 2023-04-25T23:53:14+05:30 IST