మున్సిఫ్‌ కోర్టు ముచ్చట తీరేనా?

ABN , First Publish Date - 2023-04-07T00:17:11+05:30 IST

చేర్యాలలో మున్సి్‌ఫకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.

మున్సిఫ్‌ కోర్టు ముచ్చట తీరేనా?
కోర్టు కోసం ప్రతిపాదించిన చేర్యాల ఎంపీడీవో కార్యాలయ భవనం

చేర్యాలలో ఏర్పాటు చేస్తామని ఏడాది అవుతున్నా వీడని సందిగ్ధం

సబ్‌, జిల్లా, ఫ్యామిలీ కోర్టుకు సిద్దిపేటకే

నాలుగు మండలాల ప్రజలకు ఇబ్బందులు

చేర్యాల, ఏప్రిల్‌ 6 : చేర్యాలలో మున్సి్‌ఫకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్నాళ్లకు మోక్షం కలుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి చేర్యాల, మద్దూరు మండలాలను నూతన జిల్లాగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో విలీనం చేశారు. అంతేకాకుండా కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాలను అదనంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సిద్దిపేట డివిజన్‌లో చేర్యాల, కొమురవె ల్లి మండలాలను, మద్దూరు, దూల్మిట్ట మండలాలను హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు. రెవెన్యూపరంగా ఆయా మండలాల ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కుంటుండగా, కోర్టుల విషయంలోనూ తంటాలు తప్పడం లేదు.

గతంలో అన్ని కోర్టులకు జనగామకు... ఇప్పుడు సిద్దిపేట, హుస్నాబాద్‌కు !

నాలుగు మండలాలకు సంబంధించి 2000-2500 సివిల్‌, క్రిమినల్‌ కేసులున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జనగామలోని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌, పిన్ర్సిపల్‌ జూనియర్‌ సివిల్‌, సబ్‌ కోర్టు, 5వ అదనపు జిల్లా, ఫ్యామిలీ కోర్టులకు వెళ్లే వారు. జనగామకు వెళ్లాలంటే 50-60 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో వ్యయ, ప్రయాసలకు లోనయ్యారు. కానీ గత సంవ త్సరం జూన్‌లో జిల్లా కోర్టులను ప్రారంభించిన క్రమంలో ఇక్కడి కేసులను సిద్దిపేట జిల్లా పరిధిలోని కోర్టులకు బదిలీ చేశారు. దీంతో రెవెన్యూ డివిజన్ల ప్రకారం కోర్టులకు వెళ్లాల్సి వస్తున్నది. మద్దూరు, ధూల్మిట్ట మండలాల ప్రజలు మున్సిఫ్‌ కోర్టు కోసం హుస్నాబాద్‌కు, సబ్‌, జిల్లా, ఫ్మామిలీ కోర్టుల కోసం సిద్దిపేటకు వెళుతున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల కక్షిదారులు అన్ని కోర్టులున్న సిద్దిపేటకు వెళుతున్నారు. ఇలా తలోదిక్కుకు వెళుతుండటంతో స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతూ వచ్చారు.

తొలుత వడివడిగా అడుగులు.. అంతలోనే తుస్‌

ప్రభుత్వం కొత్తగా కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న క్రమంలో అన్ని అర్హతలున్న చేర్యాలలో మున్సి్‌ఫకోర్టు ఏర్పాటుకు ఆశలు చిగురించాయి. ఈప్రాంత న్యాయవాదులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి విన్నవించడంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ప్రతిపాదించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు జడ్జిలకు వినతిపత్రం అందజేశారు. దీంతో కాస్త చలనం వచ్చింది. న్యాయశాఖ కార్యదర్శి ఆదేశానుసారం గతేడాది జూన్‌లో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రఘురాం, జిల్లా న్యాయమూర్తి భవానితో పాటు సిద్దిపేట సీపీ శ్వేత తదితరులు ప్రతిపాదిత భవనాన్ని పరిశీలించి నివేదిక పంపించారు. రోజుల వ్యవధిలోనే వడివడిగా అడుగులు పడటంతో ఇక కోర్టు కల సాకారం కాబోతుందని భావించారు. కానీ ఏడాది కావస్తున్నా నేటికీ ఎలాంటి స్పష్టత లేదు. కోర్టుకు సంబంధించి న్యాయశాఖ నుంచి ఫైల్‌ నం. 13421/2022 సీఎం పేషీలో పెండింగ్‌లో ఉన్నందున, ఎప్పటికి మోక్షం కలుగుతుందోనని ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే సాకారం

చేర్యాల ప్రాంత ప్రజల ఇబ్బందిని గుర్తించి మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. భవనాన్ని ఖరారు చేసి ప్రతిపాదనలు పంపించాం. అన్నిరకాలా అనుమతులను పొందాం. ప్రస్తుతం సీఎం పేషీలో ఫైల్‌ ఉంది. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ముఖ్యమంత్రిని కలిసి త్వరలో సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే

రాజకీయ స్వార్థాలు వీడి మంజూరు చేయాలి

ప్రజోపయోగాలను విస్మరించి చేర్యాల, మద్దూరు మండలాలను ఇష్టానుసారం చీల్చారు. కోర్టులు, కార్యాలయాల కోసం ప్రజలు తలో దిక్కుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ ఏర్పాటు హామీని నెరవేర్చకపోగా, కోర్టు విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. రాజకీయ స్వార్థాలు వీడి డివిజన్‌తో పాటు కోర్టును మంజూరు చేయించాలి.

-బూరుగు సురేశ్‌గౌడ్‌, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి

Updated Date - 2023-04-07T00:17:11+05:30 IST