అడ్వకేట్ జనరల్‌గా సుదర్శన్ రెడ్డి
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:02 AM
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిఽధ్యం వహించే అత్యంత కీలకమైన అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి సీనియర్ న్యాయవాది ఎ. సుదర్శన్‌రెడ్డి ఎంపికయ్యారు.

కాంగ్రెస్ హయాంలో రెండోసారి వరించిన పదవి
గవర్నర్ ఆమోదంతో జీవో జారీ
తెలంగాణ ప్రాంత తొలి ఏజీ ఆయనే
సుప్రీంకోర్టులో తెలంగాణ
స్టాండింగ్ కౌన్సిల్‌గా శ్రవణ్‌కుమార్
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిఽధ్యం వహించే అత్యంత కీలకమైన అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి సీనియర్ న్యాయవాది ఎ. సుదర్శన్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శనివారం ఆమోదముద్ర వేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర న్యాయశాఖ జీవో 636 జారీచేసింది. ఆయన అడ్వకేట్ జనరల్ పదవిని చేపట్టడం ఇది రెండోసారి. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో సుదర్శన్‌రెడ్డి ఈ పదవిని నిర్వహించారు. తెలంగాణ ప్రాంతం నుంచి అడ్వకేట్ జనరల్ పదవిని చేపట్టిన తొలిన్యాయవాదిగా కూడా పేరుపొందారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడే వరకు ఈ పదవిలో కొనసాగి ఉమ్మడి ఏపీ చివరి ఏజీగా గుర్తింపు పొందారు.
సుదర్శన్‌రెడ్డి 1959 మే 25న జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రాచేపల్లిలో వ్యవసాయదారులైన జగపతిరెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య రేణుక, పిల్లలు మహిత, ఆదిత్య ఉన్నారు. 1985లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. రాజ్యాంగం, సివిల్, కార్పొరేట్ లా, ఆర్బిట్రేషన్, క్రిమినల్, సర్వీస్ కేసుల్లో సమర్థవాదనలు వినిపిస్తారనే గుర్తింపు పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్‌లో లెక్చరర్‌గా సైతం పాఠాలు బోధించారు. 1984-85 మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, 2009-10లో ఉమ్మడి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.