‘రాజీవ్ యువ వికాసం’తో యువతకు బాసట
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:09 AM
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది.

- రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు
- జిల్లాలో 16,800 మందికి లబ్ధి
- ఏప్రిల్ 5వరకు దరఖాస్తుల స్వీకరణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొని తమ కాళ్లపై తాము నిలబడి తమ ఆర్థికస్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,800 మంది యువతీ,యువకులకు ఈ పథకం కింద లబ్దిచేకూరనున్నది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్భాగమై ఉన్న చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు ఆ నియోజకవర్గ కోటా కింద వెయ్యి నుంచి 1200 మందికి ఆర్థిక సహాయం అందే అవకాశమున్నది. దీనితో జిల్లాలోని 18 వేల మంది యువతీయువకులు స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పుకోవడానికి త్వరలోనే ఆర్థిక సహాయం లభించనున్నది.
ఫ ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో భాగంగా మార్చి 17న దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆర్థిక సహాయం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీయువకులు చేస్తున్న దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి మే 31వరకు పరిశీలించి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు.
ఫ మూడు కేటగిరీల్లో ఆర్థిక సహాయం
కేటగిరీ-1, 2,3 వారిగా ఆర్థిక సహాయం అందించనున్నారు. కేటగిరీ-1 కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 80 శాతం సబ్సిడీగా ప్రభుత్వం సమకూర్చుతుంది. 20 శాతం నగదును లబ్దిదారులు సమకూర్చుకోవలసి ఉంటుంది. కేటగిరీ-2 కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 70 శాతం సబ్సిడీగా ఇస్తారు. మిగతా 30 శాతం లబ్ధిదారులు సమకూర్చుకోవాలి. కేటగిరీ-3 కింద 2 నుంచి 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 60 శాతం ప్రభుత్వమే సబ్సిడీగా సమకూర్చనుండగా లబ్ధిదారులు 40శాతం భరించాల్సి ఉంటుంది. కేటగిరీ-1 కింద సహాయం పొందదల్చుకున్నవారు 20వేల రూపాయలు, కేటగిరీ-2 కింద సహాయం పొందదల్చుకున్నవారు 30వేలు,కేటగిరీ-3 కింద సహాయం పొందదల్చిన వారు 40వేల రూపాయల వరకు తమవంతు పెట్టుబడిగా స్వయంగా కానీ బ్యాంకుల నుంచి కాని సమకూర్చుకోవలసి ఉంటుంది. తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజిమెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (్టజ ౌఛఝఝట) పోర్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తాము నెలకొల్పదల్చుకున్న యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సంబంధిత కార్పొరేషన్లతోపాటు కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయిలోని అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది.
ఫ దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు:
- తెలంగాణకు చెందిన స్థిరనివాసి అయి ఉండాలి.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు అయి ఉండాలి.
- నిరుద్యోగ యువతీ యువకులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
- ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతాల వివరాల సమర్పించాలి.
- రేషన్‌కార్డు, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలో నమోదు అయి ఉండాలి.
----------------------