మరో కోనసీమగా స్టేషన్‌ఘన్‌పూర్‌

ABN , First Publish Date - 2023-08-01T00:35:29+05:30 IST

జిల్లాలోనే అత్యధిక రిజర్వాయర్లు, నీటి వనరులతో మరో కోనసీమగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు.

మరో కోనసీమగా స్టేషన్‌ఘన్‌పూర్‌
గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

ఉప్పుగల్లు రిజర్వాయర్‌ ద్వారా 83వేల ఎకరాలకు సాగునీరు

ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య

జఫర్‌గడ్‌, జూలై 31: జిల్లాలోనే అత్యధిక రిజర్వాయర్లు, నీటి వనరులతో మరో కోనసీమగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి మత్తడి పోస్తున్న మండలంలోని ఉప్పుగల్లు రిజర్వాయర్‌ను సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజయ్య మాట్లాడుతూ అత్యధిక రిజర్వాయర్లతో స్టేషన్‌ఘన్‌పూర్‌ జిల్లాలో రిజర్వాయర్ల హబ్‌గా నిలిచిందన్నారు. భారీ వర్షాలతో నియోజకవర్గంలో అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ మినహా అన్ని చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయన్నారు. రెండు కుంటలు మాత్రమే తెగిపోయాయన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, వరదల కారణంగా ఇసుక మేట వేసి కొంత మేర పంట నష్టం జరిగిందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి మండలంలోని ఉప్పుగల్లు, కూనూరు, కోనాయిచలం, తమ్మడపల్లి(ఐ), సూరారం తదితర గ్రామాల పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. జరిగిన నష్టంపై సంబంధిత అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే త్వరలో వీటి మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఉప్పుగల్లు రిజర్వాయర్‌ ద్వారా 83వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ఈ రిజర్వాయర్‌ 0.54 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు.. మత్తడి పైనుంచి 3 ఫీట్ల ఎత్తులో అధిక నీరు దిగువకు వెళ్లిపోతోందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొడారి కనకయ్య, ఉప సర్పంచ్‌ నరేశ్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నేత పి.మహేందర్‌రెడ్డి, పులి ధనుంజయ్‌గౌడ్‌, కోరుకొప్పుల రాజు, రాజశేఖర్‌, ఇరిగేషన్‌ ఏఈ ముత్తం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలో ఇటీవల మరణించిన గడ్డం యాకయ్య, గుడికందుల కొమురుమల్లు చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే రాజయ్య నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2023-08-01T00:35:29+05:30 IST