Corrupt Officials : కోరల్లేని ఏసీబీ!
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:23 AM
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.
అవినీతిపై యుద్ధంలో సైనికులు కరువు
ఆరుగురు ఐపీఎస్‌లకుగాను ఒక్కరూ లేరు
అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు..
నాన్ కేడర్ ఎస్పీ,ఏఎస్పీ, డీఎస్పీలకూ కొరత
60ు పోస్టులు ఖాళీ..టోల్ ఫ్రీ నంబర్ లేదు
నాడు ఇసుక, మద్యం, గనుల అవినీతి దందా
అధికారుల పాత్రపైనా తీవ్ర అభియోగాలు
కానీ, ఏసీబీ చేతులు కట్టేస్తున్న సిబ్బంది లేమి
ఇకనైనా పట్టించుకోకుంటే పాత కేసుల విచారణా కష్టమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, దోపిడీ వ్యవస్థను మాత్రమే బలంగా నడిపించారు. భూగర్భంలో మైనింగ్, నదుల్లో ఇసుక, అడవిలో సంపద, మద్యంలో కమీషన్లు, రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు.. ఇలా ఏ ఒక్క దాంట్లోనూ అవినీతి లేదనకుండా ఊడ్చేశారు. లక్షల కోట్ల ప్రజల సంపద దోచేసిన దొంగలను జైలుకు పంపాలన్నా.. అవినీతి వ్యవస్థను ఇకపై కట్టడి చేయాలన్నా ఏసీబీ బలంగా ఉండాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎక్కడికక్కడ జిల్లాల్లో అవినీతి ఉద్యోగులను ట్రాప్ చేయాలి. దోచుకున్న కోట్ల రూపాయల ఆస్తులు వెలికి తీయాలి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అవినీతికి పాల్పడరాదన్న భయాన్ని కలిగించాలి. ఇన్ని చేయాలంటే ఏసీబీలో సిబ్బంది, వారిని నడిపించే అధికారులు ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖలో 60శాతం అధికారుల కొరత ఉందంటే నమ్మగలమా? ఆరుగురు ఐపీఎ్‌సలు ఉండాల్సిన శాఖలో ఒక్కరంటే ఒక్కరు(డీజీ మినహా) కూడా లేరనేది పచ్చి నిజం.
పెద్ద జిల్లాల్లో సిబ్బందికి దిశా నిర్దేశం చేసి అవినీతి కేసుల్లో ముందుకు నడిపించే అడిషనల్ ఎస్పీలు లేరు. ఆఖరికి జిల్లాలో ఏసీబీకి బాస్‌గా ఉండే డీఎస్పీల కొరత 67శాతం ఉంది. ఫలితంగా అవినీతి కేసులు నమోదు కావట్లేదు. పాత కేసుల్లో తవ్వి తీయడమూ సాధ్యం కావట్లేదు. బాధితులు ఫిర్యాదు చేద్దామంటే టోల్ ఫ్రీ నంబర్ కూడా లేదు. ఏసీబీని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా కనీస ప్రయత్నం లేదు.
పరుగు పెట్టాల్సిన సమయంలో..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని చట్ట పరమైన చర్యలకు ఏసీబీ ఉపక్రమిస్తుంది. ఏసీబీ సమర్థవంతంగా పని చేయాలంటే డీజీ నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే కానిస్టేబుల్ వరకూ నిజాయితీగా వ్యవహరించి, వ్యూహాత్మకంగా ఉచ్చు బిగించాలి. అందుకు గాను ఏసీబీ డీజీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేస్తుంటారు. ఆయన తర్వాత అడిషనల్ డైరెక్టర్లుగా ఇద్దరు డీఐజీ ర్యాంకు అధికారులు ఉంటారు. కేడర్ ఎస్పీ హోదాలో ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు.. నాన్ కేడర్ ఎస్పీ హోదాలో మరో నలుగురు మొత్తం ఏడుగురు జేడీలు పని చేస్తారు. రాయలసీమ, కోస్తాంధ్ర, సెంట్రల్ జోన్, సీఐయూ,హెడ్ క్వార్టర్స్, సైబర్ అండ్ లీగల్, అడ్మిన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ జిల్లాల్లోని అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో సమన్వయం చేసుకుంటారు. తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హెడ్ క్వార్టర్స్‌తోపాటు ట్రైనింగ్ విభాగానికి ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు. ఇతర జిల్లాల్లో అవినీతి కట్టడికి డీఎస్పీల నేతృత్వంలోనే సీఐలు, ఎస్‌ఐలు, కిందిస్థాయి సిబ్బంది పని చేస్తారు. ఇందులో రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలతోపాటు సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్(సీఐయూ) కీలకమైన విభాగం. కీలక అవినీతి కేసులు సీఐయూ విభాగమే చూస్తూ, నేరుగా ఏసీబీ డీజీకి రిపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద అవినీతి పరుల్ని అరెస్టు చేయడం, వందల కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సోదాలకు దిగడం సీఐయూ పనిలో కీలకం.
పాత కేసులే కదలట్లేదు.. ఇక కొత్తవెక్కడ?
ఏడెమిదేళ్ల క్రితం నమోదైన కేసుల్లోను కనీసం అభియోగాలు కోర్టులో నమోదు చేయలేని దుస్థితిలో ఏసీబీ విలవిల్లాడుతోంది. కొత్త కేసుల గురించి సమాచారం సేకరించేందుకు అధికారుల్లేరు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత నిస్సహాయ స్థితిలో ఏసీబీ ఉందని అందులో పనిచేస్తున్న కొందరు నిజాయితీపరులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నప్పుడు రోజుకు సరాసరి ఏసీబీకి 30 దాకా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు టోల్ ఫ్రీ లేదు. ఫిర్యాదుల్లేవు. అవినీతి మాత్రం ఉంది. అధికారుల్లేకుండా ఏసీబీ ఏమి చేస్తుంది?’ అని పెదవి విరుస్తున్నారు.
అధికారులు వెయిటింగ్.. ఏసీబీలో ఖాళీలు
పోలీసు శాఖలో పలువురు అధికారులు పోస్టింగ్ కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు.. మరోవైపు కీలకమైన అవినీతి నిరోధక శాఖలో ఖాళీలు ఉన్నాయి. పీఎ్‌సఆర్ ఆంజనేయులు, ఎన్.సంజయ్, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాల కేసుల్లో సస్పెండయ్యారు. అయితే ఐజీ ర్యాంకులో పాలరాజు, కొల్లి రఘురామిరెడ్డి.. మరో నెల రోజుల్లో డీఐజీలు కాబోతున్న సత్య యేసుబాబు, బాబూజీ అట్టాడ.. ఎస్పీ ర్యాంకులో పరమేశ్వర రెడ్డి, రిశాంత్ రెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్.అన్బురాజన్, కృష్ణకాంత్ పాటిల్, హర్షవర్ధన్ రాజు, రవిశంకర్ రెడ్డి నిరీక్షణలో ఉన్నారు. వీరిలో సత్య యేసుబాబు, బాబూజీ అట్టాడ, పరమేశ్వర రెడ్డి, హర్షవర్ధన్ రాజుపై అవినీతి ఆరోపణలు లేవు. పనిలోనూ సమర్ధవంతమైన అధికారులుగానే పేరుంది. ఆర్నేల్లకు పైగా అధికారులను నిరీక్షణలో పెట్టిన ప్రభుత్వం ఇక ఏదో ఒక లూప్‌లైన్ పోస్టు ఇవ్వాలనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాగూ జీతం చెల్లించక తప్పదు గనుక ఏసీబీకి పనికొచ్చే వారిని తెచ్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐపీఎ్‌సలతోపాటు పదిహేనుమందికి పైగా అడిషనల్ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు వెయిటింగ్‌లో ఉన్నారు. వారిలో ఎంతో కొంత పనికొచ్చే వారిని ఎంపిక చేసుకుని సర్దుబాబు చేస్తే అధికారుల సమస్య తీరుతుందంటున్నారు.