ఉలిక్కిపడ్డ సూళ్లూరుపేట
ABN , Publish Date - Mar 20 , 2024 | 01:05 AM
టపాకాయల తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడుతో మంగళవారం మధ్యాహ్నం సూళ్లూరుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణ సమీపంలోని వట్రపాలెం దగ్గర్లో జాతీయ రహదారి పక్కనే మదీనా గ్రాండ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాణసంచా తయారీ కేంద్రం చాలాకాలంగా నిర్వహిస్తున్నారు.

ఆరుగురికి గాయాలు- ముగ్గురి పరిస్థితి విషమం
సూళ్లూరుపేట, మార్చి 19: టపాకాయల తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడుతో మంగళవారం మధ్యాహ్నం సూళ్లూరుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణ సమీపంలోని వట్రపాలెం దగ్గర్లో జాతీయ రహదారి పక్కనే మదీనా గ్రాండ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాణసంచా తయారీ కేంద్రం చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. దీని లైసెన్సుదారులు ముతీష్, ఆయన భార్య సాధీనబేగం కాగా ఈ కేంద్రాన్ని ప్రస్తుతం వారి కుమారులిద్దరు నిర్వహిస్తున్నారు.11 గంటల సమయంలో టపాకాయల తయారీ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకోగా ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి.దీంతో ఎగిసిన మంటల తాకిడికి బయట ఉన్న టపాకాయల నిల్వలు కూడా పేలిపోయాయి.ఈ పేలుళ్ల ధాటికి గోదాములోనే పనిచేస్తున్న ముగ్గురు కూలీల శరీరం చాలావరకూ కాలిపోయింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.గాయపడిన వారిలో బీహార్‌కు చెందిన శంకర్ చౌదరి, పింకేష్ జాదవ్, రాజ్‌కుమార్, గండ్ మండేల్, జార్ఘండ్‌కు చెందిన రవిలతో పాటు వట్రపాలేనికే చెందిన కందుకూరి శివకుమార్ వున్నారు.గోడౌన్ నుంచి శబ్దాలు విన్న చుట్టుపక్కల జనం ఏమి జరిగిందో తెలియక టపాసుల గోడౌన్ వైపు పరుగులెట్టారు. పేలుళ్లు, మంటలతో ఉన్న వాతావరణం చూసి అందరూ భయపడిపోయారు. గోడౌన్ నుంచి మంటలతో కూడిన దట్టమైన పొగలు వస్తుండడంతో ఇంకా పేలుడు మందులు ఉన్నాయోమోనన్న అనుమానంతో అక్కడకు చేరుకొన్న జనాలు కొంతసేపు హైవే రోడ్డు పైనే ఉండిపోయారు.ఈలోపు క్షతగాత్రుల్లో ఇద్దరు మంటల్లో నుంచి బయటకు వచ్చి లోపల ఇంకా కూలీలున్నారని చెప్పడంతో కాలిన గాయాలతో ఉన్న నలుగురిని స్థానికులే బయటకు తీసుకొచ్చారు. వారిని ఆటోల్లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంధి అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆర్డీవో చంద్రముని, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి, సీఐ మధుబాబు, ఎస్‌ఐ రహీం రెడ్డి అక్కడకు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొన్నారు. బాణసంచా గోదాము వద్ద నిబంధనల మేరకు ఎటువంటి జాగ్రత్త చర్యలు కూడా లేనట్లు గుర్తించారు. పేలుడుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆర్డీవో తెలిపారు.తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిచారు.పేలుడు సంఘటనపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. టపాసుల తయారీ కేంద్రం లైసెన్సు రద్దుకు ఉన్నతాధికారులకు సిపార్సు చేశామని ఆర్డీవో తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.