Share News

CM ChandraBabu: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:03 PM

వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సీఎం చంద్రాబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సైతం బాధ్యతతో మెలగాలని సూచించారు.

CM ChandraBabu: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

అమరావతి, నవంబర్ 07: ఆడబిడ్డలు జోలికి వస్తే మిమ్మల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వైసీపీ సోషల్ మీడియా సైకోలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా.. వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. వైసిపి లాంటి పార్టీలో ఉండే వారి ఇళ్లలోని ఆడబిడ్డలు.. ఈ పోస్ట్‌లు పెట్టే వారిని ప్రశ్నించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.


గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మదం, కొవ్వు ఎక్కి కొంత మంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తెలపై సైతం అభ్యంతరకర పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధపడ్డారన్నారు.


ఇటువంటి పోస్ట్‌లు పెట్టిన వాళ్ళును వదిలి పెట్టాలా? అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్ల సొంత పత్రిక పెట్టి.. ప్రతి రోజు అసత్యా కథనాలు రాస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు.. సాక్షి పత్రికలో ఏ కథనం వెలువడిందో అందరికీ తెలుసునన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసి.. తనపై వాళ్ల పత్రికలో నారా సుర రక్త చరిత్ర అంటూ రాశారని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


మమ్మల్ని మానసికంగా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పారు. అయితే అందుకు కారణమైన వారినెవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనతో ఆడుకోవాలని చూస్తే.. ఎవరిని వదిలి పెట్టనని హెచ్చరించారు. కొవ్వు ఎక్కిన వారి కొవ్వు తగ్గిస్తానని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ సైతం ఆలోచించుకోవాలన్నారు. నేరస్తుల కంటే మీరు అప్పర్ హ్యాండ్‌లో ఉండాలని ఈ సందర్బంగా పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు.


రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలని తాను మరోసారి చెబుతున్నానని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక బావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెబుతున్నారని.. అంటే ఎవరిపైనా అయినా మీ ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతారా? అంటూ వైసీపీ కేడర్‌ను సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా సూటిగా ప్రశ్నించారు.


మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్ నేత వంగలపూడి అనితపై తీవ్ర అభ్యంతరక పోస్టులు పోస్ట్ చేశారు. అలాగే వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై జుగుఫ్సాకర పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డిని కడపలోని చిన్న చౌక్ పోలీసులు మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.


అయితే అంతలో స్థానిక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. దీంతో 41 ఏ నోటీసులు ఇచ్చి రవీందర్ రెడ్డిని వదిలి వేశారు. అయితే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవీందర్ రెడ్డిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు సైతం రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు చిన్న చౌక్ పీఎస్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రవీందర్ రెడ్డిని విడిచి పెట్టేయడంతో.. ఈ వ్యవహారం పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు సీఐలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 03:03 PM