Share News

AP Elections 2024: ఢిల్లీ లిక్కర్‌ స్కాం నిందితుడికి వైసీపీ టికెట్‌.. పోటీ ఎక్కడ్నుంచో తెలిస్తే..?

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:40 AM

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి ఉరఫ్‌ అరబిందో శరత్‌చంద్రారెడ్డికి వైసీపీ వీరతాడు వేసింది...

AP Elections 2024: ఢిల్లీ లిక్కర్‌ స్కాం నిందితుడికి వైసీపీ టికెట్‌.. పోటీ ఎక్కడ్నుంచో తెలిస్తే..?

  • నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా శరత్‌చంద్రారెడ్డి

  • విజయసాయి రెడ్డికి బంధువు కూడా..

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి ఉరఫ్‌ అరబిందో శరత్‌చంద్రారెడ్డికి వైసీపీ వీరతాడు వేసింది. ఆయనకు నెల్లూరు లోక్‌సభ స్థానం టికెట్‌ను కేటాయించినట్టు సమాచారం. ఈయన స్వయానా వైసీపీ కీలక నేత వి. విజయసాయిరెడ్డి బంధువు. తొలుత నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని జగన్‌ ప్రకటించారు. కానీ, నెల్లూరు లోక్‌సభ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను మార్చాలని వేమిరెడ్డి ప్రతిపాదించారు. దీనికి సీఎం జగన్‌ అంగీకరించలేదు.

Sarath-Chandra-Reddy-Final.jpg

పైగా, ఈ అసెంబ్లీ స్థానాలో వేమిరెడ్డి వ్యతిరేకించిన వారినే సీఎం జగన్‌ ప్రోత్సహించారు. అంతేకాదు, నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలోనూ వేమిరెడ్డి మాటను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ప్రస్తుత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ సన్నిహితుడు ఖలీల్‌ అహ్మద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నియామకంపై వేమిరెడ్డికి మాట మాత్రంగా కూడా చెప్పలేదని తెలిసింది. మరోవైపు, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌కు క్వార్ట్జ్‌ గనులు అప్పగించడంపైనా వేమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. అయినప్పటికీ జగన్‌ ఆయనను పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డి ఆకస్మికంగా పార్టీని వీడారు. ఇటీవల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి సీఎం జగన్‌తో సమావేశమైనప్పుడు నాలుగురోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో.. విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడైన అరబిందో డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలన్న యోచనలో ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చసాగుతోంది.

Vemireddy-Prabhakareddy.jpg

Updated Date - Feb 20 , 2024 | 09:04 AM