Share News

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:09 PM

సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డితో తనకున్న వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే మీడియా ప్రతినిధుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..
APCC cheif YS Sharmila

విజయవాడ: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్ కంటే ఎక్కువగా ప్రజా సమస్యలపై స్పందిస్తానని చెప్పారు. విజయవాడలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదంపై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. అయితే మీడియా ప్రతినిధుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడితే దాన్ని హైలెట్ చేయడం లేదని, ఇతర అంశాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం కవరేజీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్‌తో తనకున్న విబేధాల గురించి మాట్లాడతానని, అంతకంటే ముందు ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు.


ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.."వైఎస్ జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వక్ఫ్ బిల్లు అంశంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ఖండిసున్నా. వక్ఫ్ సవరణ బిల్లును నిన్నటి వరకూ వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ కబుర్లు చెప్పింది. ఎన్డీఏకు బలం ఉన్న లోక్ సభలో వ్యతిరేకించి.. కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది. జగన్ సూచనలతోనే రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తర్వాత విప్ జారీతో వైసీపీ డ్రామా ఆడింది. ఓటింగ్ తర్వాత విప్.. లోక్ సభ చరిత్రలోనే లేదంటూ విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరును జాతీయ మీడియా ఎండగడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ మళ్లీ వచ్చి మట్టి, నీరు ఇచ్చి వెళ్లిపోతారా?. ప్రధాని మోదీ మమ్మల్ని కలిసే అవకాశం ఇస్తే కచ్చితంగా మేం ప్రశ్నిస్తాం.


కానీ, మోదీ వచ్చినప్పుడు మా పార్టీ వాళ్లను హౌస్ అరెస్టులు చేస్తారు కదా?. నేను మాట్లాడే ప్రజా సమస్యల కన్నా.. నేను మాట్లాడే ఇతర అంశాలనే మీడియా హైలెట్ చేస్తోంది. నిన్న కూడా వక్ప్ యాక్ట్ అంశం వదిలిపెట్టి వివేకా హత్య అంశాన్నే మీడియా హైలెట్ చేసింది. జగన్ వాదనలపై మాట్లాడితే పోలవరం అంశం పక్కకు వెళ్లి మిగిలిన అంశాలు హైలెట్ అవుతున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడినప్పుడు నాకు కవరేజి ఇవ్వండి. జగన్ రెడ్డి స్వయంగా ఏంఓయూపై సంతకం పెట్టారు. నా పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ఆయనే ప్రకటించారు. గిప్ట్ డీడ్‌ను మా అమ్మ విజయలక్ష్మికి జగన్ చేశారు. గిప్ట్ ఇచ్చి మళ్లీ ఇచ్చిన షేర్లు వెనక్కి ఇవ్వాలని ఆమెపై కేసు వేశారు. తల్లిపై కేసులు వేసిన కొడుకుగా జగన్ రెడ్డి మిగిలిపోతారు. ఆయన నన్ను ప్రభావితం చేసే స్థాయి దాటిపోయారు. సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు లాక్కుంటున్నారు. వైవీ సుబ్బారెడ్టి, విజయసాయిరెడ్డి వంటి వారిని అడ్డం పెట్టుకుని మా మీద నిందలు వేశారు. ఆయనకు ఆత్మీయుల కన్నా ఆస్తులే ముఖ్యం అనుకుంటా" అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vikasit Bharat: తెలుగమ్మాయికి అత్యుత్తమ అవార్డు

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Updated Date - Apr 04 , 2025 | 03:16 PM