AP NEWS: ట్రంప్ న్యాయం చేయాలి... త్వరగా జగన్‌ని లాక్కెళ్లాలి... ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్లు
ABN, Publish Date - Nov 24 , 2024 | 01:17 PM
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలని.. జగన్‌ను త్వరగా అమెరికా లాక్కెళ్లాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.
నెల్లూరు : అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయంగా ఎదిగిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు కలిశారని.. రహస్యంగా కలవడంలో అంత అంతర్యమేమిటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కూడా చాలామందిని కలిశారని... అధికారికంగా కలిసి మీడియాకు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... వారిద్దరి రహస్య చర్చ గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.
రూ. 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నావ్ అని ఎఫ్బీఐ చెబుతోందని అన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి జగన్ అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి కుంపటి అని టీడీపీ ఎప్పుడో చెప్పిందని అన్నారు. సోలార్ పవర్‌ని 11 రూపాయలకు కూడా కొన్నారని.. టెక్నాలజీ మారే కొద్దీ ధరలు తగ్గుతూ వచ్చాయని అన్నారు.9 వేల మెగావాట్లకు రూ. 1750 కోట్లు సరే... ఇంకా అనేక సోలార్ సంస్థలకు పీపీఏలు చేశారు... వాళ్ల దగ్గర ఎంత లంచం తీసుకున్నారో బయటకు తీయాలని అన్నారు. రూ.20 వేల కోట్ల లంచం సోలార్ పవర్‌లో జగన్‌కి ముట్టిందని అన్నారు. లంచాలకి మరిగి పోలవరం లాంటి ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. టీటీడీకి అన్యాయం చేశారని... అందుకే ఆ స్వామి అమెరికాలో కేసు పెట్టించారని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.
జగన్ వైసీపీ అధ్యక్షుడిగా దిగిపోవాలి..
‘‘ఇక్కడ చట్టాలు మాదిరిగా ఉండదు... 6 నెలల్లో తీర్పు వస్తుంది. అపారమైన జ్ఞానం కలిగిన రిటైర్డ్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి. త్వరగా జగన్‌ని లాక్కెళ్లాలి. చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శునకానందం పొందాడు. అందుకే దేవుడు సరైన శిక్ష వేయబోతున్నాడు. ఈ అభియోగాలు తేలేవరకు జగన్ వైసీపీ అధ్యక్షుడిగా దిగిపోవాలి. అసెంబ్లీకి వచ్చే అర్హత కూడా లేదు. జగన్‌పై ఉన్న కేసులకు 11 ఏళ్లు అయ్యింది... సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చొరవ తీసుకుని కేసుల వ్యవహారంలో వేగం పెంచాలి’’ అని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు.
Updated Date - Nov 24 , 2024 | 01:19 PM