Share News

Gv Anjaneyulu: జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు టిడ్కో ఇల్లు వద్దా.. జీవీ ఆంజనేయులు ధ్వజం

ABN , Publish Date - Nov 16 , 2024 | 02:08 PM

ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు.

Gv Anjaneyulu: జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు టిడ్కో ఇల్లు వద్దా.. జీవీ ఆంజనేయులు ధ్వజం

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి కూడు, గూడు, నీడ ఉండాలనే లక్ష్యంతో పనిచేసిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ విషయంపై ఆంజనేయులు కీలక విషయాలు తెలిపారు. 7 లక్షల ఇళ్లను గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. మొదటి దశలో 4 లక్షల 54 వేల ఇళ్లకు టెండర్‌లు పిలిచారని గుర్తుచేశారు. 2019కు ముందే 3 లక్షల 13వేల 832 ఇల్లు 90 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. ఒక్క రూపాయికు ఇల్లు ఇస్తామని జగన్ మోసం చేశారని జీవీ ఆంజనేయులు విమర్శించారు.


ఏడాదికి 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదని అన్నారు. ఐదేళ్లలో 25వేల ఇల్లు ఇస్తామని అన్నారని.. కానీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికు ప్యాలెస్‌లు కావాలి కానీ పేదలకు టిడ్కో ఇళ్లు వద్దా అని నిలదీశారు. బెంగళూరు, హైదరాబాద్, రుషికొండలో వాటిని కట్టారని చెప్పారు. రూ.430 కోట్లు ఖర్చు చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారన్నారు. పేదవాడికి ఒక సెంట్ ఇల్లు అని, జగనన్న కాలనీ అన్నారని... అందులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఈ లక్షలాది ఇల్లు పూర్తి అయ్యేవని అన్నారు. పేదలకు ఇల్లు రాకపోగా.. బ్యాంక్‌ల నుంచి వాయిదాలు, నోటీసులు వచ్చాయని అన్నారు. టిడ్కో ఇళ్ల కోసం రూ. 17 కోట్లు వడ్డీ చెల్లించారని... పేదవాడికి డిపాజిట్లు చెల్లించలేదని జీవీ ఆంజనేయులు అన్నారు.


ఈ ఇళ్లను కూడా పేద వాళ్లకు కాకుండా వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారని చెప్పారు. 90 శాతం ఇల్లు పూర్తి అయినవి కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేదని మండిపడ్డారు. వినుకొండలో 1200 ఇల్లు ప్రారంభిస్తే వాటిలో ఒకటి కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు చాలా నష్టం వాటిల్లిందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 02:16 PM