Tirumala Laddu Issue: వారిపై హిందూ సంఘాలు ఆగ్రహం, అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు..
ABN, Publish Date - Sep 20 , 2024 | 01:23 PM
వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పని చేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ విషయంలో తమ మనోభావాలతో ఆటలాడుకున్నారంటూ టీటీడీ ఛైర్మన్ మాజీ వై.వి.సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం మరింత రాజుకుంటుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ ఏపీ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు మెుదలుకొట్టి, హిందూ సంఘాల వరకూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఆలయ పవిత్రతను మంటగలిపారంటూ ఫ్యాన్ పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఇప్పటికే ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్.. కేంద్ర హోంశాఖతోపాటు ఏపీ, ఉత్తర్ ప్రదేశ్ డీజీపీలకు ఫిర్యాదు చేశారు.
వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై ఫిర్యాదు..
మరోవైపు వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పని చేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలతో ఆటలాడుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఈ దారుణాలు జరగడంతో అప్పటి టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడి భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేశారంటూ గుంటూరు అరండల్ పేట పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ అపవిత్రం చేసిన వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌పై ఆగ్రహం..
ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.."టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలి. దీనికి బాధ్యులైన వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరిగి ఉండదు. వేంకటేశ్వరస్వామికి అపరాధం చేసిన నేతలు గతంలో ఏమయ్యారో అందరికీ తెలుసు. తిరుపతి వెళ్లి స్వామివారి ముందు మోకాళ్లపై నిలబడి వైఎస్ జగన్ క్షమించమని వేడుకోవాలి" అని అన్నారు.
హైకోర్టుకు పొన్నవోలు..
మరోవైపు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం విషయంలో వైఎస్ జగన్‌పై దుష్ర్పచారం జరుగుతోందంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ ఆయనపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..
Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు
Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు
Updated Date - Sep 20 , 2024 | 01:28 PM